కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతున్నదంటే.. ఎందుక్కాదు! ఆపార్టీని సంస్కరించడం కంటె.. అధినేత్రిని ప్రసన్నం చేసుకోవడం, ఆమె గుడ్ లుక్స్ లో ఉండడం, తద్వారా దక్కగల ప్రయోజనాలు పొందడం మాత్రమే నాయకుల పరమలక్ష్యాలుగా ఉన్నప్పుడు పార్టీ ఎందుకు బాగుపడుతుంది?
అయిదు రాష్ట్రాల్లో అత్యంత అవమానకరమైన రీతిలో పార్టీ సమాధి అయిపోయిన తర్వాత కూడా.. సంస్కరణల గురించి ఎలాంటి చర్చ లేకుండానే.. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం ముగియడం చిత్రమైన పరిణామం ఎంతమాత్రమూ కాదు. ఆ నాయకుల వైఖరి తెలిసిన వారికి ఇది విస్మయం కలిగించదు.
‘ఎప్పటి లాగే ఇవాళ కూడా ఇనబింబము నింగిన ఉదయించెను..’ అన్నట్లుగా.. ఎప్పటిలాగే ఈసారి కూడా.. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఒక సీడబ్ల్యూసీ సమావేశం పెట్టుకుంది. ఎప్పటిలాగే ఈ సమావేశంలో కూడా అమ్మ మీద సంపూర్ణ విశ్వాసం వెలిబుచ్చి.. ‘తమరే తప్ప ఇతః పరంబెరుగము.. కావవే అమ్మ..’ అంటూ స్తోత్రాలు చేయడంతోనే సీడబ్ల్యూసీ సభ్యులు ఆ పర్వం ముగించారు.
సోనియా.. తన కుటుంబం మొత్తం బాధ్యత నుంచి తప్పుకుంటాం అని, పార్టీని ఉద్ధరించడమే ముఖ్యం అని ఆఫర్ ఇచ్చినా కూడా.. భజన పరులు ఆమెకు ఆ చాన్సు ఇవ్వలేదు. అమ్మ ఆధ్వర్యంలోనే సంస్థాగత సంస్కరణలు జరగాలని, సంస్థాగత ఎన్నికలు కూడా జరగాలని వారు వాక్రుచ్చారు.
అమ్మ సారథ్యంలో ఆ పని జరగాలని గత నాలుగైదేళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నారు. ఆమె ఆ ప్రయత్నంలో ఇంకా ఉన్నారు. ఆమెకు చేతకావడం లేదని వారు ఎన్నటికి గుర్తిస్తారు. కనీసం ఈ సంస్థాగత నిర్మాణ/ ఎన్నికల వ్యవహారం కొందరు ముఖ్యులకు అప్పగించితే బాగుంటుంది కదా అనే ఆలోచన కూడా వారికి వచ్చినట్టు లేదు.
మేడం తమ నాయకురాలు అని చెప్పుకోకుండా పార్టీ పెద్దలకు నిద్ర కూడా పట్టేలా లేదు. మా కుటుంబం వల్లనే ఓటమి పాలవుతోందని అంతా అంటున్నారు.. మీరు కూడా అలాగే అనుకుంటే మేం తప్పుకుంటాం అన్న సోనియా మాటలు.. అలిగినట్లుగా ఉన్నాయే తప్ప, వాస్తవాన్ని ఆమోదిస్తున్నట్టుగా లేవు.
పైగా కెసి వేణుగోపాల్ లాంటి వారు.. ఇంకా పార్టీని మాయచేసి మభ్యపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను సరిగా ప్రజలకు చెప్పలేకపోవడం వల్లనే ఓడిపోయాం తప్ప.. తమ దారుణ పరాభవానికి మరొక కారణం ఏమీ లేదని ఆయన చెప్పడం ఆత్మవంచన. అదే నిజమైతే.. పంజాబ్ లో అధికారంలో ఉన్న పార్టీ అయిదు స్థానాలకు ఎలా దిగజారిపోయింది. ఇలాంటి మాయమాటలతో ఇంకా పార్టీని ఎన్నాళ్ల పాటూ ముంచదలచుకున్నారో మరి!!