బ్లాక్ ఫంగ‌స్‌పై నిపుణుల మాట ఏంటంటే…

కోవిడ్ బారిన ప‌డ‌డం ఒక ర‌క‌మైన న‌ర‌క‌మైతే, దాని నుంచి బ‌య‌ట ప‌డ్డ వాళ్ల‌ది మ‌రో ర‌క‌మైన భ‌యాందోళ‌న‌. కోవిడ్ నుంచి కోలుకున్న త‌ర్వాత బ్లాక్ ఫంగ‌స్ పంజా విసురుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ…

కోవిడ్ బారిన ప‌డ‌డం ఒక ర‌క‌మైన న‌ర‌క‌మైతే, దాని నుంచి బ‌య‌ట ప‌డ్డ వాళ్ల‌ది మ‌రో ర‌క‌మైన భ‌యాందోళ‌న‌. కోవిడ్ నుంచి కోలుకున్న త‌ర్వాత బ్లాక్ ఫంగ‌స్ పంజా విసురుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ ప్ర‌మాద‌క‌ర కేసులు రోజురోజుకూ పెరుగుతుండ‌డంతో కొత్త భ‌యం వెంటాడుతోంది.

ఈ నేప‌థ్యంలో బ్లాక్ పంగ‌స్ కేవ‌లం కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్ల‌కేనా, లేక ఇత‌రత్రా వ్యాపించే అవ‌కాశం ఉందా? అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లువురు వైద్య నిపుణులు బ్లాక్ ఫంగ‌స్‌పై త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. వాటి గురించి తెలుసుకుని బ్లాక్ ఫంగ‌స్‌పై ఓ అవ‌గాహ‌న‌కు వ‌ద్దాం.

నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ స్పందిస్తూ… బ్లాక్ ఫంగ‌స్ అనేది కొత్త వ్యాధి కాద‌ని తేల్చి చెప్పారు. కోవిడ్‌కు ముందు కూడా ఇది ఉంద‌న్నారు. సుగ‌ర్ కంట్రోల్ కానివారికి ఈ వ్యాధి సోకే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. సుగ‌ర్‌తో పాటు ఇత‌ర‌త్రా వ్యాధుల‌తో బాధ ప‌డేవాళ్లు బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌న్నారు. 

ముఖ్యంగా ర‌క్తంలో సుగ‌ర్ స్థాయిలు 700-800కి చేరిన వారు, నిమోనియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నవారిని బ్లాక్ ఫంగ‌స్ వెంటాడే అవ‌కాశం ఉంద‌న్నారు. అలాగే కోవిడ్‌కు ఎక్కువ‌గా స్టిరాయిడ్ల వాడే వారికి కూడా బ్లాక్‌ ఫంగస్ ముప్పు పొంచి ఉంద‌ని హెచ్చ‌రించారు. క‌రోనా పాజిటివ్‌తో సంబంధం లేకుండా ఈ ర‌క‌మైన వ్యాధి లేదా అనారోగ్య ల‌క్ష‌ణాలుంటే మాత్రం బ్లాక్ ఫంగ‌స్ ప్ర‌మాదం ఉంద‌ని అర్థం చేసుకోవాల‌ని చెప్పారు.  

ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డాక్ట‌ర్ నిఖిల్ టాండ‌న్ బ్లాక్ ఫంగ‌స్‌పై మాట్లాడారు. ఆరోగ్య‌క‌ర‌మైన వ్య‌క్తులు అస‌లు బ్లాక్ ఫంగ‌స్ గురించి ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌రోసా ఇచ్చారు. రోగ నిరోధ‌క శ‌క్తి లేని వాళ్లకు బ్లాక్ ఫంగ‌స్ నుంచి ముప్పు పొంచి ఉంద‌న్నారు. అయితే బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తిపై పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేయాల్సి ఉంద‌న్నారు. 

బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌తో పాటు తాజాగా మ‌రో ర‌కం ఫంగ‌స్ పేరు కూడా వినిపిస్తోంది. ఇలా రోజురోజుకూ కొత్త ర‌కాల జ‌బ్బులు వెలుగు చూస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.