ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ (సీటీయూ) క్యాంపస్ తొలిదశ నిర్మాణం కోసం 420 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుకు ఆమోదం తెలిపినట్లు మానన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2018-19లో తమ మంత్రిత్వశాఖ నుంచి క్యాంపస్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడానికి పది కోట్ల రూపాయలు గ్రాంట్‌గా మంజూరు చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణ చట్టం కింద ప్రకటించిన హామీలలో భాగంగానే సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2015 జూలైలో వర్శిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన మీదట విజయనగరం జిల్లా రెల్లి గ్రామంలో 525 ఎకరాలను క్యాంపస్ నిర్మాణం కోసం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు కోసం మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని చెబుతూ దీని కోసం సెంట్రల్ యూనివర్శిటీల చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్లో వేరుగా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.