ఎమ్మెల్యేలు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించనంటూ ఇప్పటికే పలుమార్లు పరోక్షంగా హెచ్చరించారు సీఎం వైఎస్ జగన్. ఆయన మాట మీద ఇప్పటివరకూ ఎక్కడా ఏ ఎమ్మెల్యే కూడా కనీసం సిఫార్సుల జోలికి కూడా వెళ్లకుండా గుంభనంగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల సిఫార్సులన్నీ వారి అనుచరుల పేర్ల మీద జరిగిపోతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.
ప్రతిపక్షాల సంగతి పక్కనపెడితే చాలాచోట్ల ఈ విమర్శలు వాస్తవాలేనని సమాచారం. ఇటీవల జరిగిన రెవెన్యూ ఉద్యోగుల బదిలీలలో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే వారి అనుచరులు ఉన్నతాధికారుల దగ్గర చక్రం తిప్పారు. బదిలీలే కదా అని చాలాచోట్ల జిల్లా కలెక్టర్లు, డీఆర్వోలు.. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకుని పనులు చేసిపెట్టారు.
అయితే ఆ తర్వాత తేలిన విషయం ఏంటంటే.. అనుచరులు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి వసూళ్ల పర్వానికి దిగారట. మరీ కక్కుర్తికి పోయి ఒకే చోట పోస్టింగ్ కి ఇద్దరు ఉద్యోగులకు ఒకే ఎమ్మెల్యే నుంచి సిఫార్సు లెటర్ ఇవ్వడం. ఇక్కడ విషయం తేడా కొట్టడంతో కొంతమంది ఎమ్మెల్యేల అనుచరుల బండారం బైటపడింది.
ఇక్కడే కాదు, గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీలో కూడా ఇలాంటి చోటా లీడర్ల చేతివాటం అక్కడక్కడా బైటపడుతోంది. ఉన్న ఉర్లోనే కొలువు, ఐదువేలు జీతం, ఆఫీస్ కి టైమ్ కి వచ్చి టైమ్ కి వెళ్లాలన్న సమస్య లేకపోవడంతో చాలామంది గ్రామ వాలంటీర్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు.
ఈ పోస్టుల కోసం కొన్ని ఊళ్లలో వైసీపీలోనే రెండు వర్గాలు పుట్టుకురావడం విశేషం. ఇక్కడే ఎమ్మెల్యేల పేర్లు చెప్పి వారి అనుచరులు చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఇక రాబోయే గ్రామ సచివాలయ పోస్ట్ ల విషయంలో కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతాయనడంలో సందేహం లేదు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి బాధ్యతలు అప్పజెప్పినా.. ఎవరో ఒకరికి సిఫార్సు లేఖలు ఇప్పించి పంపించడం రివాజు.
ఎమ్మెల్యేలు జగన్ మాట మీరకుండా సైలెంట్ గా ఉన్నప్పటికీ.. వారికి తెలియకుండానే చాలా చోట్ల అనుచరులు ఇలా అక్రమాలకు తెరతీస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి వారిపై వైసీపీ ఎమ్మెల్యేలు ఓ కన్నేసి ఉంచడం మంచిది. వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తే, చులకనయ్యేది, సీఎంతో చీవాట్లు తినేది అనుచరులు కాదు, మంత్రులే.