వెనుకటికి చాలా ఇళ్లల్లో పిల్లులను పెంచుకునేవారు. ఆ పిల్లికి గిద్దెడు పాలు పోసేవారు. తాగాక దానిచూపులు పాలగిన్నె వైపే ఉండేవి. పెంచేవారు కళ్లుపోతే ఎంచక్కా గిన్నెడు పాలు తాగేదాన్ని అని చెడుకోరుతుందని పెద్దలు పిల్లిని పెంచొద్దనేవారు. అలాంటి బాపతే తెలుగుదేశం పార్టీ మూల విరాట్టులు తీరు. టీడీపీ అధికారంలోకి వస్తే కన్నూమిన్నూ కానని అధికారం చెలాయింపు చేస్తుంది. అధికారంపోతే సర్వం చాలించేసి తమను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి అధికారం చేజిక్కించుకున్న పార్టీ అధికారంలో ఉండడం వీసమెత్తు భరించలేదు. పైగా, వర్షాలు పడరాదు. కరువు కాటకాలతో రాష్ట్రం ఆకలికేకలతో అట్టుడికి పోవాలి. ఇప్పుడు కొత్తగా విభజనలో ప్రత్యేకహోదా రాకూడదు. మోదీ ఎంతమాత్రం ఇవ్వరాదు. అలాగే విశాఖ రైల్వేజోన్ ఎన్నికల ముందు ఓట్లకోసం బీజేపీ ప్రకటించింది. జోన్ ఏర్పాటు చేసే తీరు చిరిగినచేటలా ఉందని పలువిమర్శలు ఈసరికే వెలువడ్డాయి.
విశాఖజోన్ మరింత ఎదుగుబొదుగు లేకుండా అయ్యేలా రైల్వేజోన్ ఏర్పాటు జరగాలి. ఒకే దెబ్బకు రెండుపిట్టల్లా అటు బీజేపీ ఇటు వైకాపా రెండుపార్టీలు ప్రజల్లో చులకనైపోవాలి. ఇలాంటి దుర్భిద్ది ఆశలతో, మూలపడ్డ టీడీపీ నేతలు పిల్లిశాపాలు పెడుతున్నారు. ఈమద్య టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీలను అయ్యా! హోదా మీరు వెళ్లాక వచ్చేలా చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. హోదా అనేది మరిచిపోవాల్సిందే. అది ఇప్పుడేకాదు ఎప్పుడూ రాదు. దానిబదులు ప్రత్యేకంగా సాయం కోరుకుని సాధించుకోవాలని చెప్పారు. ఆచెప్పడంలో మరిరాదు. అది ముగిసిన అధ్యాయం అని కూడా టాగ్‌లైన్సు ఏడ్ చేసారు ఆ ఎంపీలను పార్టీలోంచి సాగనంపుతున్నవారు సయితం టన్నుబరువుతో హోదారాదని చెప్పడం విశేషం. సలసలకాగే నీళ్లతో గుడిశెలు కాలిపోవు. ఒక్కఅగ్గిపుల్ల రగల్చాలి. ప్రతిపక్షంలో ఏపార్టీ ఉన్నా ఇలానే అధికారపార్టీపై బురదజల్లుడు ఉంటుంది.
కానీ, టీడీపీ అధికారంలో లేనప్పుడు ప్రతికోణంలో అత్యంత మోతాదులో రాజకీయమే చేస్తుంది. హోదా తెస్తానని ప్రజల్లో చెప్పి జగన్ ఓట్లే వేయించుకున్నారు అని కొత్త నినాదంతో ఆపార్టీ మీడియాల్లో మెరుపులు మెరిపిస్తోంది. హోదా తీసుకురాలేని చంద్రబాబు చేసిన పాపం ఏమిటి? జనాల్లో హోదా తెస్తానని తద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పిన జగన్ నిన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హోదా ఇచ్చేది లేదని చెబితే కిమ్మనలేదు. ఇదేనా హోదా తీసుకువచ్చే తీరు అని టీడీపీ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. వాస్తవానికి హోదా విషయంలో ఆనాడు కొత్తగా ప్రధాని అయిన నరేంద్రమోడీ ఇచ్చేసేవారే. కానీ, చంద్రబాబును చూస్తే చాలు మోదీకి నరాల్లో ఉద్రిక్తత పెరుగుతుండేది. అలా ఎందుకంటే ఆనాడు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా నరమేధం జరిగింది. దానిపై దేశవ్యాప్తంగా విమర్శలకు గురయ్యారు మోదీ. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్ని రాష్ట్రాల పర్యటనలు చేస్తూ ఏపీకి తేది ఖరారు చేసారు.
''మోదీ నీవు నరమేధకుడవు. నీవు అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లు ఏపీ (విభజనకు ముందున్న సమిష్టి రాష్ట్రం) వస్తే సాటి సీఎంవని చూడకుండా అరెస్టు చేస్తానని అప్పటి సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అప్పటి మీడియాలో బాబు హెచ్చరిక పలురాష్ట్రాల సీఎంలు గుడ్లప్పగించి చూసారు. ఎందుకొచ్చిన బాబుతో పేచీ అని మోదీ హైద్రాబాద్‌లో దిగకుండా అటునుంచి అటే వెళ్లిపోయారు. ఆ రోజే మోదీ మరపురాని బాబు దుశ్చర్యగా తనగుండెల్లో రికార్డు చేసుకున్నారు. అందుకే, సీఎంగా బాబు పీఎంగా మోదీని కలిసేటప్పుడు ఏనాడు మోదీ నవ్వేవారు కాదు. ఏ సందర్భంలో నవ్వని బాబు నవ్వులు పువ్వులవుతూ ఒదిగిఒదిగి మోదీ ముందు చేతులు కట్టుకున్నట్లుగా ఉండేవారు. అలా ఐదారుసార్లు మోదీని కలిసినప్పుడు ఇవ్వవల్సిన ప్రత్యేకహోదా బాబు అడిగేవారు కాదు. ఇద్దరికి గోద్రా కారణంగా ముఖం చెల్లేదికాదు. ఒకవేళ ఏదైన మా రాష్ట్రంకు సాయం చేయమంటే ఎస్టిమేషన్సుతో రండి అని చెప్పేయడంతో మోదీ తనవైఖరి ఇంతేనన్నట్లు కనబరిచేవారు. అక్కణ్నించి బాబు 29సార్లు ఢిల్లీ పర్యటనల్లో ప్రధానిని కలిసింది బహుతక్కువే.
కేంద్ర మంత్రులను కలవడం, వారిచేతుల్లో హోదా ఇవ్వవల్సిందిగా అర్ధింపులేఖ ఒకటి పెట్టి తిరిగొచ్చేయడంతో హోదా సాధనను ఆ విధంగా సరిపుచ్చారు. ఈలోగా తెలంగాణాలో ఓటుకు నోటుకేసులో పట్టులో పిట్టలా చంద్రబాబే సాక్ష్యాధారాలతో సీఎం కేసీఆర్ అల్లిన వలకు చిక్కిపోయారు. కిందామీదా పడి కేసీఆర్‌ను తన లెక్కలు తేల్చకుండా ఆపగలిగారు. ఇక మోదీ ముందు హోదా విషయం ఎత్తితే ఆయన ఓటుకు నోటు కేసు పీకి పందిరేస్తారని బాబు మరింత భయపడ్డారు. హోదాపై అదేమైన సంజీవినా? హోదా పొందిన రాష్ట్రం ఏదీ బాగుపడలేదు. మోదీలాంటి పీఎం లేరని ఎలుగెత్తడంలో నాలుగున్నర ఏళ్లు బాబు గడిపేసారు. ఇదీ చంద్రబాబు తనకేసులకు రాష్ట్రహోదాను తాకట్టు పెట్టుకుని బతుకుజీవుడా అన్నారు. బాబు జోకర్‌వేషాలు చూసిన మోదీ హోదా ఇవ్వ క్కర్లేదని మూడునాలుగేళ్ల క్రితమే డిసైడ్ అయ్యారు. అందుకే జగన్ ఏనాడు హోదా తెచ్చేస్తానని ప్రజల్లో చెప్పలేదు. దానిపై కేంద్రంతో పోరుతామన్నారు. హోదా అనేది ఏపీకి రానేరాదు అనేది అందరికి తెలిసిందే. అయితే, మోదీకి కొత్త సీఎం జగన్‌పట్ల ఒకింతజాలి ఉంది. కేంద్ర సాయంలో ఒకాకు ఎక్కువే ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఆశతోనే సీఎం జగన్ కేంద్రంతో టచ్‌లో ఉంటూ అక్కడ పార్టీ ఎంపీలను నిధులు కోసం ఆరాట పడాల్సిందిగా దిశానిర్ధేశం చేస్తునే ఉన్నారు. బాబు హోదాను రాకుండా చేసేసి ఆతప్పుల తట్టను జగన్ నెత్తికెత్తాలని టీడీపీ ఇప్పట్నించే విమర్శలు జడివానకురిపిస్తోంది.
అధికారపార్టీ ఎన్నికల్లో ఎన్నో చేసామని, గెలుస్తామనే ఆశలతో ప్రజల వద్దకు వెడతారు. కానీ, ముందే కూసిన కోయిలలా టీడీపీనేత చంద్రబాబు వేలకోట్ల పథకాలు ప్రజలపైకి విశిరి ఓట్లు దండుకునేయత్నం దేశ చరిత్రలోనే ఏపార్టీ, ఏపార్టీనేత చేయలేదనేది చారిత్రక సత్యమయ్యింది. ఓటమి ముందే తెలుసుకున్ననేత అందుకే ఆపద్ధర్మ సీఎంగా పాత తేదీలతో కొన్ని వేలకోట్లు చెల్లింపులు జరిపేసారు. ధైర్యం ఉండాలేగాని ఏమిచేసినా చెల్లుబాటు అవుతుందనే తీరులోనే బాబు సాగారు. అలా సాగేనేతల్లో బాబు ముందు వరుసలో ఉంటారు. ఆయన ఎవరికి జవాబు దారిని కాను. నేనే అత్యంత సీనియర్‌నని చెప్పుకోవడమే కాదు. అత్యంత తప్పులతడకనని ఆయన తీరుతో దేశవ్యాప్తంగా చాటుకున్నారు. బాబు గతంలో ఏలిన పదేళ్ల పాలనలో ఒకింత అనుకువను ప్రదర్శించేవారు. ఏదిచెప్పాలో అదే మీడియాలో చెప్పేవారు. ఇప్పుడు చెప్పకూడని మాటనైన కడుపులో కత్తులమాటున దాచుకోవడం లేదు. అహంతో బహిర్గతం చేయడానికి ఎంతమాత్రం వెనుకాడడంలేదు.
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు ఇవ్వడానికి కుదరదు. అందుకే సంక్షేమపథకాల మాటునే బాహటంగా ఇవ్వాల్సింది ఇచ్చానని సాక్షాత్తు సీఎంగా ఉన్న చంద్రబాబే జనాల మద్య కుండబద్దలు కొట్టారు. ఇలాంటివి ఒకటీ రెండుకాదు. చాలావిషయాలు చెప్పడంలో బాబు ఎవరికి భయపడేది లేదన్నట్లుగానే కడిచిన సర్కారులో ఐదేళ్లు మహానిర్లక్ష ధోరణితో సాగారు. ఒకదశలో టీడీపీలో బాలకృష్ణ, లోకేష్‌ల ప్రసంగాలతో ఆపార్టీ ప్రజల్లో ఇరుకునపడేది. కానీ, ఆఇద్దరిని మించిపోయి బాబే వివాదస్పదమైన మాటలతో నిత్యం జనాలను నోళ్లు బార్లా తెరిపించేవారు. లేదా నవ్వులపువ్వులు అయ్యేలా చేసేవారు. దాంతో బాబుతీరులోనే మంత్రులు, ఎమ్‌ఎల్‌ఏలు మరింత రెచ్చారు. దీనికి కారణం బాబు అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడడం అలాగే మీడియాల్లో అదేతీరుతో అయినదానికి కానిదానికి తగుదునమ్మా అని కన్పించి దేశంలో ఎక్కడ చీమచిటుక్కుమన్నా స్పందించేయడం వలన అదుపు తప్పిన వక్త అయ్యారు. ఏది దాచాలో ఏది దాచకూడదో గుట్లుకాస్తా ఎప్పటికప్పుడు రట్టు చేసుకున్నారు.
రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్‌పై ఆనాడు కోడికత్తి దాడి ఇలా జరిగితే అలా సాక్షాత్తు అప్పటి సీఎం హోదాలో చంద్రబాబే మీడియాల్లో విమర్శలు గుప్పించడం రాష్ట్రప్రజలు విస్తుపోయారు. ఇంతదిగజారుడు విధానాన్ని బాబు ఎందుకు ప్రదర్శిస్తున్నారని ఆశ్చర్యపోయారు. అధికారంలో ఉండేటప్పుడు బాబుకు ఎవరూ చెప్పేవారేలేరు. బాబు అహంకారంతో కూడిన దర్పం అనుక్షణం ప్రదర్శించడమే. కనీసం ఇంట్లో కూడా చెప్పేస్థాయిలో ఎవరూలేరాయే. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఏమైనచెబితే అది అర్ధం అయ్యేసరికి చాలాటైమ్ పడుతుంది. ఇక మంత్రులు, సీనియర్లు అంతా మనకెందుకు లేనిపోని సలహాలు సొల్లడం? పైగా, నువ్వెవడవు నాకు చెప్పడానికి నేను యమసీనియర్‌ని అంటే పెద్దచిక్కే అని డిసైడ్ అయ్యారు. ఎవరూ బాబుకు ఇదితప్పు అదిఒప్పు అని చెప్పడానికి లేకుండా బాబు వద్ద జీ హుజూరన్నట్లు సాగారు. ఇప్పుడు ఎవరు చెప్పినా బాబు తప్పదన్నట్లు తలాడిస్తారు. కాదంటే పార్టీ వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారని బితుకు ఒకటి పార్టీపతనం అయినప్పుడు బాబును అంటిపెట్టుకుని ఉంటుంది. ఆపతనంలో ఒదిగిఉంటారు.
ప్రజాధనంతో దాదాపు 8 కోట్ల పైచిలుకుతో నిర్మితమైన ప్రజావేదిక పక్కా అక్రమకట్టడం జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. పైగా ఎలాంటి అనుమతులు లేవని సీఎం జగన్ కూల్పించడం కూడదని టీడీపీనేతలు గంగ వెర్రులెత్తారు. ఆపక్కనే ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా అక్రమకట్టడమే. పైగా, కోర్టులో దానిపై కేసు నడుస్తోంది. కోర్టులో తేలాకా దాన్ని కూల్చేస్తాం అని కొత్తసర్కారులో మంత్రి చెప్పారు. ఇక్కడ కూడా బాబు వైయస్ విగ్రహాలకు అనుమతులు లేవు. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు వాటి జోలికిపోయామా అని ప్రశ్నించారు. తప్పితే, ప్రజావేదికను సక్రమకట్టడమే అని చెప్పుకోలేకపోయారు. పైగా, ఓడాక తగుదునమ్మా అని ప్రజావేదికను మా పార్టీ సమావేశాలకు అప్పగించండని కోరడమే తప్పయిందేమో? అనవసరంగా కెలుక్కున్నామేమో? దాంతో జగన్ కూల్చేయడానికి తెగించారని కూడా టీడీపీలో తర్జనభర్జనలయ్యారు.
కొందరు నేతలు కుట్రపూరితంగా జగన్ కూలుస్తున్నాడని పెట్రేగారు. ఇద్దరు ముగ్గురు సీనియర్లు ప్రజావేదికను అనవసరంగా కూల్చేకంటే కొత్తసర్కారు సమవేశాలకు వాడుకో వల్సిందని ఉచిత సలహాలు ఇచ్చారు. నెలరోజులు పూర్తికాకుండానే జగన్ సర్కారు చండ్రనిప్పులా ప్రజ్వరిల్లడం టీడీపీ నేతలకు జీర్ణించుకోలేకుండా ఉంది. బాబు హయాంలో అవినీతిని కూకటివేళ్లతో పెళ్లగిస్తామని, ప్రజలముందు పెడతానని జగన్ చెబుతుంటే టీడీపీలో కోటానుకోట్లు దిగమింగినోళ్లకు గుండెల్లో వేగం పెరుగుతునే ఉంది. కళ్లముందు ప్రజావేదిక కూలుస్తుంటే గుడ్లప్పగించి చూడడంవరకే చంద్రబాబు అండ్‌కో పరిమితమయ్యారు. ఆ నిర్మాణం పక్కా అనుమతులు లేనిది కనుక కిమ్మనలేకపోయారు. పైగా, జనాల్లోకి పోయి అన్యాయం చేస్తున్నారని అరిచిగీపెట్టడానికి జనాలు పనులు మానుకుని వెంటపడరు. తగినశాస్తి జరిగిందని ఈసరికే చాలావరకు ఖుష్ అవుతున్నారు. పిల్లిశాపాల బాబు అండ్‌కోకి షాకులమీద షాకులు విరుచుకుపడుతున్నాయి.
-యర్నాగుల సుధాకరరావు
సమ్మర్‌కి బంపర్ బిగినింగ్! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్ డిజాస్టర్!