బడ్జెట్ ప్రసంగం వేళ అసెంబ్లీలో ఎంత రచ్చ జరిగిందో అందరూ ప్రత్యక్షంగా చూశారు. సీఎం జగన్ ప్రసంగాలకు పదే పదే అడ్డు తగులుతూ ఆయన ఆగ్రహాన్ని చవిచూశారు టీడీపీ నేతలు. వీరికి రెండోవిడత కోటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో పాటు మిగతా టీడీపీ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు జగన్.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గత ప్రభుత్వ విధానాలను, అక్రమాలను ఆధారాలతో సహా బైటపెట్టారు సీఎం జగన్. విత్తన కొరత, ఇన్ పుట్ సబ్సిడీ ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వమే కారణం అంటూ నిందలు వేసిన టీడీపీ నాయకులకు గట్టిగా బదులిచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే రైతులకు విత్తనకొరత ఏర్పడిందని, ఇన్ పుట్ సబ్సిడీ సకాలంలో అందలేదని రుజువు చేశారు. అంతేకాదు, రుణమాఫీ పేరుతో చంద్రబాబు ఆడిన డ్రామాలన్నిటినీ వీడియో సాక్ష్యాలతో సహా బైటపెట్టారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయారు. కేటాయింపులపై పెదవి విరిచారు. నవరత్నాలకు వన్నె తగ్గిందని, బడ్జెట్ లో అభివృద్ధి పథకాల కేటాయింపుల్లో కోతలు విధించారని మండిపడ్డారు. జనంలోకి రాలేని లోకేష్ కూడా సోషల్ మీడియాలో బడ్జెట్ పై అవాకులు చవాకులు పేలారు. వీటన్నిటికీ అసెంబ్లీలోనే గట్టిగా సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్. దీనికోసం అవసరమైన లెక్కలన్నీ తెప్పించుకుంటున్నారు. వాటిని మరోసారి సభలో చూపించబోతున్నారు.
గత బడ్జెట్ లో ఏయే పథకాలకు ఎంత కేటాయింపులు జరిగాయి, ఈ దఫా వైసీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉన్నాయని సవివరంగా గ్రాఫిక్ సాయంతో సభ్యులకు చూపించడానికి టెంప్లేట్స్ రెడీ చేయించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారాని కూడా సభలో వివరించబోతున్నారు జగన్. ఇక టీడీపీ నేతలు గతంలో మాట్లాడిన మాటలు, ఆ తర్వాత మారిన మాటలు.. అన్నిటికీ ఆధారాలు సేకరించుకున్నారు.
మొన్న చంద్రబాబు వీడియోని అసెంబ్లీలో ప్రదర్శించి, బాబుకి ముచ్చెమటలు పట్టించిన జగన్.. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంపై వివరణ ఇచ్చే సందర్భంగా అలాంటి మరిన్ని వీడియోలు బైటపెట్టడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లకు, అందులో జరిగిన కేటాయింపులు, వాస్తవంగా ఖర్చుచేసిన నిధులకు అంతరం ఎంత ఉందో లెక్కలు తీస్తున్నారు. అదే సమయంలో వైసీపీ బడ్జెట్ ని ఎలా పకడ్బందీగా అమలు చేస్తుందో చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి.
ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్న బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబుకు మరోసారి చుక్కలు చూపించడానికి పూర్తిగా రెడీ అయ్యారు జగన్.