Advertisement

Advertisement


Home > Politics - Gossip

నారాయణ మెడకు 'ప్రజావేదిక' పాపం.!

నారాయణ మెడకు 'ప్రజావేదిక' పాపం.!

ఉండవల్లిలోని ప్రజావేదిక ఇకపై 'గతం'. ప్రజా వేదికను కూల్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించిన మేరకు కూల్చివేత జరుగుతోందిప్పుడు. ఓ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇంత వేగంగా అమలవడం చాలా అరుదైన సందర్భమేమో. మరోపక్క, ప్రజావేదిక కూల్చివేతపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తోంది. సుమారు 9 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను ఎలా కూల్చేస్తారంటూ అధికారపక్షంపై టీడీపీ నేతలు మండిపడ్తున్నారు.

ఇదిలావుంటే, ఐదు కోట్లలో పూర్తయ్యే ప్రజావేదిక కోసం అదనంగా సుమారు 4 కోట్ల దాకా ఖర్చు చేశారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఆరోపించడమే కాదు, ఈ మేరకు లెక్కలు కూడా తెరపైకి తెచ్చింది. అప్పటి మంత్రి నారాయణ అత్యుత్సాహంతో, 'కాస్ట్‌ ఎస్కలేషన్‌' ప్రక్రియ జరిగిందంటూ నిజాల్ని నిగ్గుతేల్చింది కొత్త ప్రభుత్వం. వ్యవహారం కోర్టుకు కూడా వెళ్ళడంతో, ఇప్పుడు 'ప్రజావేదిక పాపం' మాజీ మంత్రి నారాయణ మెడకు చుట్టుకునేలా వుంది.

నిజానికి, నారాయణ తనంతట తాను నిర్ణయాలు తీసుకునేంత సీన్‌ లేదు. అనూహ్యంగా అప్పట్లో మంత్రి పదవి దక్కించుకున్న నారాయణ భుజాల మీద అమరావతి నిర్మాణ బాధ్యతల్ని వుంచిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెరవెనుకాల వుండి కథ నడిపించారు. ప్రజావేదిక మాత్రమేకాదు, చాలా అధికారిక నిర్మాణాల విషయంలో 'కాస్ట్‌ ఎస్కలేషన్‌' ప్రక్రియతోపాటు నిబంధనల ఉల్లంఘన కూడా జరిగిందని చెబుతోన్న తాజా ప్రభుత్వం.. దానికి సంబంధించిన పూర్తి లెక్కల్ని ఇప్పటికే తవ్వి తీసింది.

'ప్రజావేదిక కూల్చివేతతో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడమనే ప్రక్రియ ప్రారంభం కావాలి.. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ కట్టడాలు వుండకూడదు..' అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీచేసిన దరిమిలా, అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయిప్పుడు. అన్నట్టు, ఇంతా జరుగుతున్నా.. ప్రజావేదిక విషయంలో అత్యుత్సాహం చూపిన నారాయణ మాత్రం ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడం గమనార్హం. 

అక్రమ కట్టడం ప్రజా వేదికకు సంబంధించి దుర్వినియోగమైన మొత్తాన్ని రాబట్టే ప్రక్రియ న్యాయస్థానం పర్యవేక్షణలో జరిగితే.. ముందుగా బుక్కయిపోయేది మాజీమంత్రి నారాయణే.  

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?