క‌డ‌ప‌ న‌గ‌రం చుట్టూ రియ‌ల్ వ్యాపారుల హ‌డ‌ల్‌!

ఇది మంచి ప్ర‌భుత్వమా? ముంచే ప్ర‌భుత్వ‌మా?

క‌డ‌ప‌, ఆ న‌గ‌రం చుట్టూ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు హ‌డ‌లిపోతున్నారు. క‌డ‌ప న‌గ‌రానికి వెలుపుల సీకేదిన్నె, పెండ్లిమ‌ర్రి, వ‌ల్లూరు, చెన్నూరు మండ‌లాలు క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌స్తాయి. క‌డ‌ప న‌గ‌రంలోనూ, దాని చుట్టు ప‌క్క‌ల రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క‌ప్పం క‌ట్టాల్సిందే. లేదంటే వెంచ‌ర్ల‌కు వెళ్లే ర‌హ‌దారుల్ని అధికారాన్ని అడ్డు పెట్టుకుని మూసేయిస్తారు.

ర‌హ‌దారుల్లో గుంత‌లు త‌వ్విస్తారు. వైసీపీ నాయ‌కుల వెంచ‌ర్‌కు వెళ్లే దారిలో బ్రిడ్జిని కూల‌దోయించ‌డం లాంటి చ‌ర్య‌ల్ని ఇప్పుడే చూస్తున్నాం అని వ్యాపారులు వాపోతున్నారు. క‌డ‌ప చుట్టూ క‌మ‌లాపురానికి చెందిన అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచ‌ర్లు వేస్తున్నార‌నే స‌మాచారం నిమిషాల్లో సంబంధిత నాయ‌కుల‌కు చేరిపోతోంది.

ఆ త‌ర్వాత అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల ముఖ్య బ్రోక‌ర్లు అక్క‌డ వాలిపోతారు. త‌మ నాయ‌కుడి మాట‌గా, రియ‌ల్ట‌ర్ల‌ను హెచ్చ‌రిస్తారు. డిమాండ్ చేసిన మేర‌కు క‌ప్పం క‌డితే స‌రేస‌రి. లేదంటే వ్యాపారం ముంద‌డ‌గు ప‌డ‌కుండా, అధికార యంత్రాంగాన్ని పంపి అడ్డుకుంటారు.

క‌డ‌ప న‌గ‌రంలోని 8వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ బాల‌కృష్ణారెడ్డిని ఇలా లొంగ‌దీసుకుని ఏకంగా టీడీపీ కండువానే క‌ప్పారు. ఆయ‌న వెంచ‌ర్‌కు వెళ్లే మార్గంలో గుంత‌లు త‌వ్వి, ఎవ‌రూ వెళ్ల‌కుండా చేశారు. చివ‌రికి ఎందుకొచ్చిన గొడ‌వ‌లే అనుకుని స‌ద‌రు కార్పొరేట‌ర్ టీడీపీలో చేరాడు. దీంతో వ్యాపారం చేసుకోడానికి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది.

అరాచ‌కంలో అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు ఒక‌రు త‌క్కువ‌, మ‌రొక‌రు ఎక్కువ అని చెప్ప‌డానికి వీలుకాదు. వీళ్ల‌తో పోలిస్తే, గ‌తంలో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఎంతో మేల‌న్న అభిప్రాయం తొమ్మిది నెల‌ల్లోనే ప్ర‌జానీకంలో ఏర్ప‌డిందంటే… ఏ స్థాయిలో బ‌రితెగించారో అర్థం చేసుకోవ‌చ్చు. క‌మ‌లాపురానికి చెందిన అధికార పార్టీ నేత‌లైతే… గ్రావెల్ త‌మ నుంచి కొనుగోలు చేయాల‌ని వ్యాపారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. ఎవ‌రైనా గ్రావెల్‌ను త‌మ‌ను కాద‌ని వేరే ప్రాంతం నుంచి తెచ్చుకుంటే, ఇక వాళ్ల వ్యాపారం అంతే సంగ‌తులు. ఇది మంచి ప్ర‌భుత్వమా? ముంచే ప్ర‌భుత్వ‌మా? …అని జ‌నం తిట్టుకునే ప‌రిస్థితి.

4 Replies to “క‌డ‌ప‌ న‌గ‌రం చుట్టూ రియ‌ల్ వ్యాపారుల హ‌డ‌ల్‌!”

Comments are closed.