నిన్నటి నుంచి ఒక అద్భుతమైన మిక్సింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ముందుగా నారా లోకేశ్‌కు నమస్కారం పెడుతూ ఒకామె ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత వరినారు నాటుతూ నవ్వుతూ కనిపిస్తారామె.
అనంతరం అనగనగా మహానటి అంటూ బంపర్ హిట్ సాధించిన మహానటి సినిమాలో ఓ సీన్ ప్రత్యక్షమవుతుంది. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో సదరు నాయకురాలు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను చూపుతూ ….మహానటి అంటూ శ్రావ్యమైన ధ్వని పలుకుతుంది. ఇంతకూ మహానటి సావిత్రిని నటనలో మించిపోయిన ఆ రాజకీయ నటి ఎవరో తెలుసుకుందాం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై ఓ పథకం ప్రకారం కొన్ని దుష్టశక్తులు దాడులు జరపుతుండం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని రామతీర్థంలోని కోదండ రాముని విగ్రహాన్ని నరకడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఇందులో భాగంగా బీజేపీ మహిళా నాయకురాలు సాదినేని యామిని ఏడుస్తూ ఏదో జరిగిపోతోందన్నట్టు చేసిన డ్రామాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
నిన్న మొన్నటి వరకు టీడీపీ అధికార ప్రతినిధిగా ఓ వెలుగు వెలిగిన సాదినేని యామిని, మారిన రాజకీయ పరిస్థితుల్లో సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. టీడీపీలో ఉన్నంత వరకూ సాదినేని యామినిగానే గుర్తింపు పొందిన ఆమె… పార్టీ ఫిరాయించగానే పేరు చివర శర్మను కలుపుకుని రాజకీయ లబ్ధికి వెంపర్లాడుతున్నారని విమర్శలను మూట కట్టుకున్నారు.
గతంలో ఆమె మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను తెరపైకి తెచ్చి సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ యామినీకి మహానటి బిరుదు ఇచ్చారు. తాట తీస్తాము, తోలు తీస్తామని, ఇంకా మరేదో తీస్తామని అంటున్నారు.. ఎవరి తాట తీస్తారండి, మల్లెపూలను తప్ప మరేదేన్నీ నలపలేరు అంటూ జనసేనాని పవన్‌కల్యాణ్ గారి చేసిన ఘాటు విమర్శలను తెరపైకి తెచ్చారు.
అలాగే పవన్‌ను ఒక పొలిటీషియన్‌గా కంటే, ఒక సినీ నటుడిగా మాత్రమే గుర్తిస్తానన్న యామిని మాటలను గుర్తు చేశారు. అలాగే ప్రధాని మోడీపై ఆకాశమే హద్దుగా సాదినేని ఘాటు విమర్శలు చేసిన సంగతిని నెటిజన్లు గుర్తు చేశారు.
కేంద్రం వైఖరిని నిరసిస్తూ గతంలో టీడీపీ ఢిల్లీ వేదికగా ధర్మదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆ దీక్షలో సాదినేని యామిని తెలుగు తల్లి వేషధారణలో ఆకట్టుకున్నారు. నా తల్లి భారతమాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకి అన్యాయం చేస్తున్న కేంద్రం …అని రాసిన ఫ్లెక్సీని చేతబూని ప్రధాని మోడీపై నోరు పారేసుకున్న వైనాన్ని నెటిజన్లు సందర్భోచితంగా ప్రదర్శనకు పెట్టారు.
నాడు యామిని ఏమన్నారంటే… గుజరాత్ కార్పొరేట్ మాఫియా అంతా సోషల్ మీడియాను ఉపయోగించుకుని చదువు, సంస్కారం, మానవత్వం లేని , ప్రజల పట్ల ప్రేమ , ఒక అభిమానం లేని నాయకుడు ఈ దేశానికి ప్రధాన మంత్రిని చేసిందని తీవ్ర విమర్శలు చేయడాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి యామిని వైఖరిని చీల్చి చెండాడుతున్నారు. అలాంటి నాయకుడిని మన నెత్తిన రుద్దిన పాపానికి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని తీవ్ర స్థాయిలో దూషించారు.
ఇదే యామిని బీజేపీలోకి మారిన తర్వాత …నిజంగా ఇలాంటి వ్యక్తినా అన్నదని అనుకున్నా అన్నారు. మోడీని విమర్శించినందుకు ఫీల్ అయ్యినట్టు వాపోవడం మహానటనను తలపిస్తోందని నెటిజన్లు ఆమెకు మంచి బిరుదు ఇచ్చారు. ఇప్పుడు ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఆమె ఏడుస్తూ మాట్లాడ్డం అంతా మహానటన అని నెటిజన్లు విరుచుకుపడడం గమనార్హం.
“ఇంతకంటే దారుణాలను చూసే ఓపిక, భరించే శక్తి లేదు. ప్రతి గుండెలో కూడా హిందూ జ్యోతి అనేది ఒక అఖండ దీపమై వెలుగొందుతుంది. దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంతో హిందువుల గుండె రగులుతోంది. హిందువులు కారుస్తున్న ప్రతీ కన్నీటి చుక్కా ముష్కరులను అంతం చేసే త్రిశూలంలా మారుతుంది. హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతీఒక్కరూ ముందుకు రావాలి” అని సాదినేని యామినీ కన్నీటిపర్యంతమవుతూ వేడుకున్నారు.
పార్టీ మారినప్పుడల్లా సిద్ధాంతాలు మార్చుకోవడం సాదినేనికే చెల్లింది. సినిమా సినిమాకు స్క్రిప్ట్ మారినట్టు, ఒక్కో పార్టీలో ఒక్కో రకమైన స్క్రిప్ట్ చదువుతూ మహానటికి మించిన నటన యామిని ప్రదర్శిస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి నిన్న దిగ్విజయంగా యామిని తన నటనా షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. అన్నట్టు ఇంటిపేరుకు తగ్గట్టు …యామిని ఏదైనా రాజకీయాల్లో సాధించిందా? అంటే మహానటి అనే బిరుదు మాత్రమే అని చెప్పక తప్పదు.