మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్!

ఇక బీజేపీ క‌న్ను బెంగాల్ పై ప‌డిన‌ట్టే. ఇప్ప‌టికే సువేందు అధికారి నెక్ట్స్ బెంగాలే అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఉన్నాడు!

2024 లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి కాస్త ఎదురుదెబ్బ త‌గిలినా.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాత్రం వ‌ర‌స విజ‌యాలు ద‌క్కుతూ ఉన్నాయి! లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎంపీ సీట్ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. బీజేపీ సొంత బ‌లంతో అయితే కేంద్రంలో ప్ర‌భుత్వ‌మే నిల‌బ‌డే ప‌రిస్థితి లేదు. ఎన్డీయే కూట‌మిగా మాత్ర‌మే బీజేపీ కేంద్రంలో ప‌ట్టు నిలుపుకున్న‌ట్టు!

అయితే.. ప్ర‌తిష్టాత్మ‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాత్రం బీజేపీ సంచ‌ల‌న విజ‌యాలే న‌మోదు చేస్తూ ఉంది. మ‌హారాష్ట్ర‌లో అయితే.. బీజేపీ విజ‌యం అమితాశ్చ‌ర్యాల‌ను క‌లిగించింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అక్క‌డ ప్ర‌జ‌లు బీజేపీ గాలి తీశారు! అవే లెక్క‌ల ప్ర‌కారం అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్ర‌లో బీజేపీ చిత్త‌వ్వాలి! కానీ.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు చిత్త‌య్యాయి. బీజేపీ సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది! లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రిగిన ఆరు నెల‌ల్లోపే అక్క‌డ ప‌రిస్థితి మొత్తం త‌ల‌కిందుల‌య్యింది!

దేశ వాణిజ్య రాజ‌ధాని అన‌ద‌గ్గ ముంబైని రాజ‌ధానిగా క‌లిగిన మ‌హారాష్ట్ర‌లో ప‌ట్టును క‌లిగి ఉండ‌టం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కూడా చాలా కీల‌కం! అలాంటి చోట బీజేపీ త‌ను అనుకున్న‌ది సాధించింది. తిరుగులేని మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇక పుష్క‌ర‌కాలంగా బీజేపీకి కంట్లో న‌ల‌క‌లా ఉండిన కేజ్రీవాల్ ను కూడా బీజేపీ దెబ్బ కొట్టింది. 2014లో వార‌ణాసిలో మోడీపై పోటీ చేసి కూడా గ‌ట్టిగానే ఓట్ల‌ను పొందారు కేజ్రీవాల్. ఈ ద‌ఫా గ‌నుక ఢిల్లీలో ఆప్ విజ‌యం సాధించి ఉంటే.. బీజేపీపై క‌చ్చితంగా కేజ్రీవాల్ గ‌ట్టి విజ‌యం సాధించిన‌ట్టుగా అయ్యేది. దేశ‌మంతా నెగ్గినా కేజ్రీవాల్ చేతిలో దేశ రాజ‌ధానిలో బీజేపీ చిత్త‌యిన‌ట్టుగా అయ్యేది. అయితే అలాంటి అవ‌మానం ఏమీ లేకుండా.. మంచి మెజారిటీతో ఢిల్లీలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అనుకూలంగా ఫ‌లితం వ‌చ్చింది!

ఇక బీజేపీ ముందు వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లోపు ఒక పెద్ద లక్ష్య‌ముంది! అదే ప‌శ్చిమ బెంగాల్ లో పాగా వేయ‌గ‌ల‌గ‌డం! స‌రిగ్గా ఏడాది కాలం ఉంది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు. గ‌త ప‌ర్యాయ‌మే .. అదిగో ఇదిగో అన్న‌ట్టుగా అక్క‌డ బీజేపీ హ‌డావుడి సాగింది. అయితే.. మ‌మ‌త‌ను ఎమ్మెల్యేగా ఓడించినా, బెంగాల్ లో టీఎంసీ హ‌వాను కొంచెమైనా అడ్డుకోలేక‌పోయింది బీజేపీ.

ప్ర‌స్తుతం అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉంది. మ‌రి మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ ఎన్నిక‌ల్లో త‌ను అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధించిన నేప‌థ్యంలో.. ఇక బీజేపీ క‌న్ను బెంగాల్ పై ప‌డిన‌ట్టే. ఇప్ప‌టికే సువేందు అధికారి నెక్ట్స్ బెంగాలే అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఉన్నాడు! మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌మ‌త కూడా మూడు ప‌ర్యాయాల అధికార‌ప‌ర్వాన్ని పూర్తి చేసుకుంటుంది. కాబ‌ట్టి వ్య‌తిరేక‌త‌కు కూడా లోటు ఉండ‌దు.

6 Replies to “మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్!”

  1. జాతీయ రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు బీహార్లో గనుక కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేస్తే జేడీ పార్టీ కి కష్టమే

Comments are closed.