వ‌ర‌స‌గా మూడో ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సున్నా!

వ‌ర‌స‌గా మూడో ద‌ఫా ఎన్నిక‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఖాతా తెర‌వ‌లేక‌పోయింది!

2015లో జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆప్ సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్ల సంఖ్య సున్నా. ఆ త‌ర్వాత ఐదేళ్ల‌కు జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెర‌వ‌లేక‌పోయింది ఢిల్లీ అసెంబ్లీలో. చిత్రం ఏమిటంటే.. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత‌.. వ‌ర‌స‌గా మూడో ద‌ఫా ఎన్నిక‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఖాతా తెర‌వ‌లేక‌పోయింది! వ‌ర‌స‌గా మూడు ప‌ర్యాయాలు దేశ రాజ‌ధానిలో కాంగ్రెస్ పార్టీ సున్నాకు ప‌రిమితం అయ్యింది!

ఎక్క‌డైనా ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. ఏమో అనుకోవ‌చ్చు కానీ, ఢిల్లీ ఒక‌ప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట‌. కేంద్రంలో ఆ పార్టీకి అధికారం లేన‌ప్పుడు కూడా ఢిల్లీలో జెండా పాతింది. 1998 నుంచి 15 సంవ‌త్స‌రాల‌పాటు దేశ రాజ‌కీయ ప‌రిణామాల‌తో సంబంధం లేకుండా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని క‌లిగి ఉండేది. 2013లో ఆ పార్టీ ప‌త‌నం ప్రారంభం అయ్యింద‌క్క‌డ‌.

ఢిల్లీలో ఏ ముహూర్తాన కామ‌న్ వెల్త్ గేమ్స్ జ‌రిగాయో కానీ, అప్ప‌టి నుంచి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప‌త‌నం తీవ్ర స్థాయికి చేరింది. ఢిల్లీలో కామ‌న్ వెల్త్ గేమ్స్ జ‌రిగిన‌ప్పుడు వాటి నిర్వ‌హ‌ణ‌లో భారీ స్కామ్ వెలుగు చూసింది. కాంగ్రెస్ హ‌యాంలోనే ఆ విష‌యాల‌న్నీ విచార‌ణ‌కు వ‌చ్చాయి, కొంద‌రు జైళ్ల‌కు వెళ్లారు. చ‌ర్య‌లు బాగానే ఉన్నా.. చెడ్డ‌పేరు తీవ్రంగా వ‌చ్చింది. దాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటూ వ‌చ్చింది. ఢిల్లీ వ‌ర‌కూ అయితే బీజేపీ వైపు క‌న్నా ఆప్ వైపు జ‌నాలు మొగ్గు చూపించారు. కాంగ్రెస్ త‌ర‌ఫున 15 సంవ‌త్స‌రాల పాటు ఢిల్లీ సీఎంగా వ్య‌వ‌హ‌రించిన షీలా దీక్షిత్ కుమారుడిపై అవినీతి ఆరోప‌ణ‌లు కూడా అప్ప‌ట్లో దుమారం రేపాయి.

అలా కాంగ్రెస్ స్థానాన్ని 2013లోనే ఆప్ సొంతం చేసుకుంది. అయితే కాంగ్రెస్ మ‌ద్ద‌తుతోనే కేజ్రీవాల్ తొలి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత రెండేళ్ల‌కే కేజ్రీవాల్ ఎన్నిక‌ల‌కు వెళ్లి.. కాంగ్రెస్ స్థానాన్ని పూర్తిగా కైవ‌సం చేసుకున్నాడు. వాస్త‌వానికి ప‌ది సంవ‌త్స‌రాల పాల‌న త‌ర్వాత‌.. బీజేపీ నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటూ కేజ్రీవాల్ పార్టీ 22 సీట్లు సాధించ‌డం కూడా గొప్ప సంగ‌తేన‌ని చెప్పాలి. అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మం ద్వారా వెలుగులోకి వ‌చ్చిన ఆప్ తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ముఖ్య‌నేత‌లు జైలుకు వెళ్ల‌డంతో ఇమేజ్ డ్యామేజ్ జ‌రిగింది.

ఢిల్లీలో గెలుపు విష‌యంలో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా ప‌ని చేసింది. ఆఖ‌రికి ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో సైతం రాజ‌కీయ చ‌ర్చ‌లకు వెనుకాడ‌లేదు! ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ సీట్ల‌ను గెల‌వ‌లేక‌పోయినా, ఓట్ల‌ను అయితే చీల్చ‌గ‌లిగింది. ఆ ఓట్ల‌తో త‌ను సాధించింది వ‌ర‌స‌గా మూడో ప‌ర్యాయం కూడా సున్నా సీట్లే!

4 Replies to “వ‌ర‌స‌గా మూడో ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సున్నా!”

Comments are closed.