ఇండియాలో తెల్లవారగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపారనే సమాచారం కలకలం రేపుతోంది. పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉన్న ట్రంప్‌ను చంపేందుకు దుండగుడు కాల్పులు జరిపినట్టు వార్తలొస్తున్నాయి. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమై త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని సమాచారం.
అయితే ర్యాలీలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ దుండగుడిని ట్రంప్ అంగరక్షకులు చంపేశారు. ఇదిలా వుండగా దుండగుడి కాల్పుల్లో గాయాలపాలైన ట్రంప్ స్టేజీపై కూలబడ్డాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు భద్రతా సిబ్బంది తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దుర్ఘటన తీవ్ర దుమారం లేపే అవకాశాలున్నాయి. ట్రంప్‌నకు ఇది సానుభూతి తీసుకురానుంది. ఎన్నికల్లో విజయానికి ఈ ఘటన దోహదపడే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రంప్‌పై దుండగుల కాల్పులు, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం తదితర అంశాలపై ఆయన ప్రత్యర్థుల స్పందనపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది.