నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై చిగురించిన ఆశ‌లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఆశ‌లు చిగురించాయి. దేశ వ్యాప్తంగా జ‌నాభా గ‌ణ‌నను వ‌చ్చే ఏడాది నుంచి చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఆశ‌లు చిగురించాయి. దేశ వ్యాప్తంగా జ‌నాభా గ‌ణ‌నను వ‌చ్చే ఏడాది నుంచి చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఇదే సంద‌ర్భంలో విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను పెంచాల్సి వుంది. జ‌నాభా గ‌ణ‌న చేసిన త‌ర్వాతే, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను పెంచుతామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతూ వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో 2021లో జ‌ర‌గాల్సిన జ‌నాభా గ‌ణ‌న …క‌రోనా కార‌ణంగా చేప‌ట్ట‌లేదు. ఎట్ట‌కేల‌కు నాలుగేళ్ల త‌ర్వాత జ‌నాభా గ‌ణ‌న చేప‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 175 అసెంబ్లీ సీట్ల‌ను 225కు, అలాగే తెలంగాణాలో 119 నుంచి 153కు పెంచాల్సి వుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త‌ప్ప‌నిస‌రిగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయ‌ని చెప్ప‌డం ఎందుకంటే… 2022లో రాజ్య‌స‌భ‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన స‌మాధానమే కార‌ణం.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుద‌ల‌పై జీవీఎల్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్న వేయ‌గా .. 2022లో కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి స‌మాధానం ఇచ్చిందో తెలుసుకుందాం. ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. సీట్లు పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని, అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వ‌డం విశేషం.

2026 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, సీట్లు పెంచే ఆలోచన లేదని కేంద్రం తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం.. 2026 తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని రాత మూల‌కంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.

“ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి.. ఈ చట్టంలోని సెక్షన్ 15 ఎలాంటి పక్షపాతం లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెరుగుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య తిరిగి సర్దుబాటు ఉంటుంది” అని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి స్ప‌ష్టం చేయ‌డం నేడు మళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.

ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఉత్సాహం చూపిస్తున్న నాయ‌కుల‌కు జ‌నాభా గ‌ణ‌న తీపి క‌బురుగానే చెప్పాలి. ఎందుకంటే ఇది పూర్త‌యితే విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు త‌ప్ప‌ని స‌రి అని చెప్పొచ్చు. ఇందుకోస‌మే రాజ‌కీయ నాయ‌కులు ఎదురు చూస్తున్నారు.

7 Replies to “నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై చిగురించిన ఆశ‌లు!”

  1. జగన్ రెడ్డన్న కి షాక్..

    అసలే 11 కాండిడేట్లు కూడా దొరకని పార్టీ కి ఇప్పుడు 175 కాదు.. 225 ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన పరిస్థితి..

    అసలే సావు కి దగ్గరగా ఉన్న పార్టీ.. ఈ దెబ్బతో.. సమాధిలోకి వెళ్ళిపోతుంది..

    కానీ ఒకటి మాత్రం నిజం.. 2029 లో వై నాట్ 175 స్లోగన్ కాస్తా.. వై నాట్ 225.. గా మారిపోతుంది..

    ప్రతిపక్ష హోదా కోసం 23 తెచ్చుకోవాల్సిన పరిస్థితి..

    ముక్కి మూలిగే నక్క మీద.. తాటికాయ పడి సచ్చినట్టుంది.. జగన్ రెడ్డన్న పరిస్థితి..

Comments are closed.