‘సహజీవనం’ రిజిస్ట్రేషన్ సాధ్యమేనా?

భారతీయ జనతా పార్టీ పాలనలో దేశాన్ని బహుముఖంగా కుదిపేస్తున్న అనేకానేక వ్యవహారాలలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ- యూనిఫామ్ సివిల్ కోడ్) కూడా ఒకటి. భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తెస్తున్న బిల్లులు…

భారతీయ జనతా పార్టీ పాలనలో దేశాన్ని బహుముఖంగా కుదిపేస్తున్న అనేకానేక వ్యవహారాలలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ- యూనిఫామ్ సివిల్ కోడ్) కూడా ఒకటి. భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తెస్తున్న బిల్లులు ముస్లిం మతస్తులను టార్గెట్ చేస్తున్నట్టుగా ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో దేశమంతటా చాలా వివాదాలు రేగుతున్నాయి. 

యూసీసీ కూడా అలాంటి వాటిలో ఒకటి. కేవలం ముస్లిం వర్గాల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత కారణంగానే.. అది అమలులోకి రావడం, చట్టరూపం దాల్చడం ఆలస్యం అవుతోందనే వాదనలు కూడా ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో యూసీసీని అమలు చేయడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా రికార్డు సృష్టించడానికి ఉత్తరాఖండ్ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటుచేసి తమ రాష్ట్రంలో రెండు లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా ఇందునిమిత్తం స్వీకరించారు. ఆ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత.. వెంటనే యూసీసీ అమలులోకి తెస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. ఈ బిల్లుకు చట్టం రూపం తెస్తారుట.

ఉత్తరాఖండ్ లో అమలు కాబోతున్న యూసీసీలో బహుభార్యత్వంను రద్దుచేయడం అనేది ప్రధాన అంశంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ముస్లింల మతానుగుణమైన పద్ధతులకు వ్యతిరేకం. సింపుల్ గా చెప్పాలంటే.. ముస్లిముల్లో ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే సాంప్రదాయాన్ని కట్టడి చేసేందుకే ఈ నిబంధన. అయితే దీని పట్ల ముస్లిం వర్గాలనుంచి కూడా భిన్నాభిప్రాయాలే వ్యక్తం కావొచ్చు. మతపరంగా ఇది తమ హక్కులకు భంగకరం అని కొందరు వాదించినా, సామాజిక కోణంలో చూసినప్పుడు…  ముస్లిం మహిళలకు కుటుంబ భద్రత అందించే మంచి ప్రయత్నంగా కొందరు హర్షిస్తారు.

అయితే సహజీవనం (లివింగ్ టుగెదర్) చేసేవారు ఇకపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధనను కూడా యూసీసీ కింద అమలు చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సహజీవనం అనేది విచ్చలవిడితనంగా మారుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాటు బాగుందనే అభిప్రాయం పలువురికి కలగవచ్చు. కానీ, ఆచరణలో అది సాధ్యమేనా అనే అనుమానం ఉంది. 

ఎందుకంటే- భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 ను సుప్రీం కోర్టు రద్దుచేసిన తర్వాత.. వ్యభిచారం కూడా నేరం కాకుండ పోయినట్టే. ఒక మహిళ- ఒక పురుషుడు తమ ఇష్టం కొద్దీ సెక్స్ లో పాల్గొంటే గనుక.. అది నేరం కాబోదని సుప్రీం తేల్చి చెప్పేసింది. 

వివాహితకైనా, యువతికైనా ఇది వర్తిస్తుంది. కాబట్టి అసలు సెక్షన్ 497 అనేదే లేకుండా పోయాక.. సహజీవనం కు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి అని ఎలా నిర్దేశించగలరు? లీగల్ గా అది ఎలా సాధ్యం అనేది అర్థం కావడం లేదు. యూసీసీ ముసుగులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలాంటి చట్టం తెచ్చినాసరే.. న్యాయస్థానం ఎదుట నిలవదని పలువురు విశ్లేషిస్తున్నారు. సహజీవనం అనే టాిపక్ జోలికి పోకుండా.. యూసీసీని తెస్తేనే అది నిలబడుతుందని కూడా అంటున్నారు.