వైర‌స్ బారిన చైనా.. ఆస్ప‌త్రుల కిట‌కిట‌!

చైనాలో కోవిడ్‌తో పాటు ఇన్‌ప్లుయెంజా-ఎ, HMPV, మైకోప్లాస్మా న్యూమోనియా తదిత‌ర వైరస్‌లు శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న‌ట్టు విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది.

క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన పెను విప‌త్తును మ‌రిచిపోక‌నే, మ‌రో వైర‌స్ భ‌య‌పెడుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారికి చైనా పుట్టినిల్లైన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి అదే దేశంలో మ‌రో వైర‌స్ వ్యాపిస్తోంద‌న్న వార్త‌లు భ‌య‌పెడుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో గ‌త చేదు అనుభ‌వాల దృష్ట్యా ప్ర‌పంచం అప్ర‌మ‌త్తంగా వుండాల్సిన ఆవ‌శ్య‌కత ఏర్ప‌డింది.

చైనాలో ప్ర‌స్తుతం ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించ‌డం .. ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తున్నాయి. తాజాగా అందుతున్న స‌మాచారం మేర‌కు చైనాలో కోవిడ్‌తో పాటు ఇన్‌ప్లుయెంజా-ఎ, HMPV, మైకోప్లాస్మా న్యూమోనియా తదిత‌ర వైరస్‌లు శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న‌ట్టు విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ స‌మ‌స్య‌ల‌తో భారీ సంఖ్య‌లో రోగులు ఆస్ప‌త్రుల పాల‌వుతున్నార‌ని తెలిసింది. దీంతో ఆస్ప‌త్రులు రోగుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయ‌ని స‌మాచారం. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నార‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో చైనా అప్ర‌మ‌త్త‌మైంది. హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించి, రోగుల‌కు స‌త్వ‌ర వైద్యం అందించే చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌తంలో చైనాలో కోవిడ్ పుట్టి, ఆ త‌ర్వాత ప్ర‌పంచ‌మంతా అల్లుకుని, ల‌క్ష‌లాది మంది ప్రాణాల్ని బ‌లిగొంది. అందుకే చైనాలో చోటు చేసుకున్న అనారోగ్య వాతావ‌ర‌ణం దృష్ట్యా ఏ మాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు.

రోగాల‌బారిన ప‌డిన త‌ర్వాత‌, జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కంటే, వాటికి దూరంగా వుండ‌డ‌మే ఉత్త‌మం. ఆ దిశ‌గా ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించి, న‌డుచుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

6 Replies to “వైర‌స్ బారిన చైనా.. ఆస్ప‌త్రుల కిట‌కిట‌!”

Comments are closed.