వక్ఫ్ బిల్లు చట్టబద్ధతపై స్టే ఇచ్చేందుకు నిరాకర‌ణ‌

వ‌క్ఫ్ బిల్లు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది.

వ‌క్ఫ్ బిల్లు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు తీసుకొచ్చింది. ప్ర‌తిప‌క్షాల తీవ్ర వ్య‌తిరేక‌త‌ల మ‌ధ్య బిల్లు ఉభయ చ‌ట్ట‌స‌భ‌ల్లో ఆమోదం పొందింది. అయిన‌ప్ప‌టికీ దేశ వ్యాప్తంగా వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై ముస్లింలు, ఇత‌ర మైనార్టీలు నిర‌స‌న ర్యాలీలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఆందోళ‌న‌లు ఉద్రిక్త‌త‌కు దారి తీశాయి.

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును స‌వాల్ చేస్తూ వైసీపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌, టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, ఆప్‌, డీఎంకే, టీవీకే త‌దిత‌ర పార్టీల నేత‌లు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు వేశారు. ఈ పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, జస్టిస్ సంజ‌య్‌కుమార్‌, జస్టిస్ కేవీ విశ్వ‌నాథ‌న్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించారు. ఆర్టిక‌ల్ 25, 26ల‌కు వ్య‌తిరేకంగా వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం ఉంద‌ని న్యాయ‌స్థానం దృష్టికి సిబ‌ల్ తీసుకెళ్లారు. మ‌త విశ్వాసంలో కీల‌క‌మైన అంత‌ర్భాగ అంశాల‌లో ఎన్డీఏ ప్ర‌భుత్వం త‌ల‌దూర్చింద‌ని క‌పిల్ సిబ‌ల్ వాదించారు. చట్టం ప్రకారం అనే పదబంధం ఇస్లాం మత‌ మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు.

ఆర్టిక‌ల్ 26 అనేది సెక్యుల‌ర్ అని, ఇది అన్ని మ‌తాల‌కు వ‌ర్తిస్తుంద‌ని చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా పేర్కొన్నారు. హిందువుల‌కు సంబంధించిన వార‌స‌త్వ విష‌యాల్లో కూడా ప్ర‌భుత్వం చ‌ట్టం చేసింద‌ని చీఫ్ జ‌స్టిస్ గుర్తు చేశారు. ముస్లిం స‌మాజం కోసం కూడా పార్ల‌మెంట్ చ‌ట్టం చేసింద‌ని, ఇందులో త‌ప్పేంట‌ని చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శ్నించారు. పార్ల‌మెంట్‌కు చ‌ట్టం చేసే అధికారం లేదా? అని చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ప్ర‌తిపాదించింది. వ‌క్ఫ్‌గా ప్ర‌క‌టించిన ఆస్తుల్ని డినోటిఫై చేయ‌కూడ‌దని సుప్రీం పేర్కొంది. వ‌క్ఫ్ బై యూజ‌ర్ అయినా, వ‌క్ఫ్ బై డీడ్ అయినా స‌రే వాటిని డినోటిఫై చేయ‌వ‌ద్ద‌ని ప్ర‌తిపాదించింది.

వ‌క్ఫ్ భూమా? ప్ర‌భుత్వ భూమా అనే అంశంపై క‌లెక్ట‌ర్ విచార‌ణ జ‌రుపుతున్న‌పుడు దానికి వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టంలోని నిబంధ‌న‌ల్ని అమ‌లు చేయ‌వ‌ద్ద‌ని సుప్రీం తెలిపింది. అలాగే వ‌క్ఫ్ బోర్డు, సెంట్ర‌ల్ వ‌క్ఫ్ కౌన్సిల్‌లో ఎక్స్ అఫీషియో స‌భ్యులు మిన‌హా మిగిలిన వాళ్లంతా తప్ప‌నిస‌రిగా ముస్లింలు మాత్ర‌మే స‌భ్యులుగా వుండాల‌ని సుప్రీంకోర్టు ప్ర‌తిపాదించ‌డం గ‌మ‌నార్హం. ఇదే సంద‌ర్భంలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై స్టే ఇవ్వ‌డానికి న్యాయ స్థానం నిరాక‌రించింది. విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది.

3 Replies to “వక్ఫ్ బిల్లు చట్టబద్ధతపై స్టే ఇచ్చేందుకు నిరాకర‌ణ‌”

  1. Wow.. నేను మా అన్న సుప్రీం కోర్టు మెడలు కూడా వంచుతాడు అని అనుకున్నాను. Sad

Comments are closed.