ఓవైపు ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమౌతుంటే, ఘోర విమాన ప్రమాదం అందర్నీ కలిచివేస్తోంది. దక్షిణ కొరియాలోని ముయూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 179 మంది మరణించారు.
బ్యాంకాక్ నుంచి బయల్దేరియన జేజు ఎయిర్ లైన్స్ విమానం, అనుకున్న సమయానికే దక్షిణ కొరియాలోని ముయూన్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అయితే ల్యాండింగ్ సమయంలో గేర్ ఫెయిల్ అవ్వడంతో రన్ వేపై దూసుకుపోయి, విమానాశ్రయం ప్రహారీ గోడను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురి సిబ్బంది ఉన్నారు. వీళ్లలో ఇద్దరు సిబ్బంది మినహా, మిగతావాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు.
ప్రతి ఏటా జరిగినట్టే, ఈ ఏడాది కూడా కొన్ని విమాన ప్రమాదాలు జరిగాయి. అయితే ఏడాది చివర్లో జరిగిన ఈ ప్రమాదమే అత్యంత పెద్దదిగా నిలవడం దురదృష్టకరం.
ఈ ఏడాది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను రవాణా చేస్తున్న రష్యా సైనిక విమానాన్ని, ఉక్రెయిన్ క్షిపణి కూల్చేసింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు సిబ్బందితో సహా, 65 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారు.
ఆగస్ట్‌లో, వోపాస్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం సావ్ పాలో సమీపంలో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది, 58 మంది ప్రయాణికులు మరణించారు.
ఇక తాజాగా అజర్ బైజాన్ లో కూడా విమాన ప్రమాదం సంభవించింది. బాకు నుండి గ్రోజ్నీకి వెళ్తున్న అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కజఖ్ నగరమైన అక్టౌ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
వీటితో పాటు సింగపూర్ ఎయిర్ లైన్స్, అలస్కా ఎయిర్ లైన్స్, జపాన్ ఎయిర్ లైన్స్ విమానాలు కూడా ఈ ఏడాది ప్రమాదాల బారిన పడ్డాయి. వీటన్నింటిలో ఈ ఏడాది అతిపెద్ద విమాన ప్రమాదంగా నిలిచింది దక్షిణ కొరియా ఘటన.