ఏడాది చివర్లో హీరోల బాధలు

ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మాత్రం కొంతమంది హీరోలు మిస్సవుతున్నారు.

కొత్త సంవత్సర వేడుకలు వస్తున్నాయంటే చాలు, 3-4 రోజుల ముందే తమకిష్టమైన ప్రాంతాల్లో వాలిపోతుంటారు స్టార్స్. ఎక్కువమంది ప్రైవసీ కోసం విదేశాలకు వెళ్లిపోతుంటారు. ఏటా జరిగే తంతే ఇది. అయితే ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మాత్రం కొంతమంది హీరోలు మిస్సవుతున్నారు.

ఉదాహరణకు ప్రభాస్ నే తీసుకుంటే, అతడు రీసెంట్ గా షూటింగ్ లో గాయపడ్డాడు. ఆ గాయం వల్ల జపాన్ పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు. గాయం నుంచి త్వరగానే కోలుకుంటున్నాడు కానీ కొత్త ఏడాది సంబరాల కోసం విదేశాలకు వెళ్లేంత సీన్ లేదు. ఏం చేసినా ఇంట్లోనే.

రామ్ చరణ్ ది మరో బాధ. అతడికి కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ఉంది కానీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఉన్నాయి. మరో 12 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని న్యూ ఇయర్ వేడుకల కోసం ఎక్కడికో వెళ్లలేడు. అందుకే క్రిస్మస్ ను కూడా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. డిసెంబర్ 31 రాత్రి కూడా ఇంట్లోనే ఉంటాడు.

వీళ్లిద్దరి కంటే భిన్నమైనది అల్లు అర్జున్ పరిస్థితి. ఏటా అల్లు అర్జున్ న్యూ ఇయర్ వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ ఈసారి అతడు వేడుకలు చేసుకోకపోవచ్చు. ఎందుకంటే, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అతడు నిందితుడిగా ఉన్నాడు. పోలీస్ విచారణతో పాటు, కోర్టు కేసు కూడా ఉంది. మీడియా అంతా బన్నీపైనే ఫోకస్ పెట్టిన వేళ, అంత పెద్ద దుర్ఘటన తర్వాత తను సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్తే తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుంది. కాబట్టి అల్లు అర్జున్ కూడా ఇంట్లోనే.

మిగతా నటీనటుల సంగతేంటి?

ఎన్టీఆర్ ఆల్రెడీ బ్రిటన్ లో వాలిపోయాడు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లిన ఎన్టీఆర్.. న్యూ ఇయర్ వేడుకలను అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఇప్పటికే లండన్ వీధుల్లో ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల టైమ్ కు అతడు ఎక్కడ ల్యాండ్ అవుతాడో చూడాలి.

టైమ్ దొరికితే కుటంబంతో విదేశీ పర్యటనలు చేయడానికి ఇష్టపడే మహేష్ కూడా ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు గట్టిగా ప్లాన్ చేశాడు. ఆల్రెడీ నమ్రతా శిరోద్కర్ తో పాటు, పిల్లలంతా స్విట్జర్లాండ్ లో వాలిపోయారు. త్వరలోనే మహేష్ కూడా జాయిన్ అవుతాడు.

నాగచైతన్య కూడా ఈసారి న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే, అతడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. తన భార్య శోభితతో కలిసి అతడు ఎక్కడ ల్యాండ్ అవుతాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సెలబ్రేషన్ మాత్రం పక్కా. నటుడు రానా ముంబయిలో ఓ ప్రైవేట్ పార్టీకి హాజరుకాబోతున్నాడు.

హీరోయిన్ల విషయానికొస్తే, రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ తన భర్తతో కలిసి లండన్ వెళ్లింది. ముంబయిలో మనీష్ మల్హోత్రా ఇచ్చే న్యూ ఇయర్ పార్టీకి హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అనన్య పాండే హాజరుకాబోతున్నారు. ఇక హైదరాబాద్ నోవోటెల్ లో జరగనున్న సెలబ్రేషన్స్ కు హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక అతిథిగా హాజరుకానుంది.

One Reply to “ఏడాది చివర్లో హీరోల బాధలు”

Comments are closed.