రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిజ స్వరూపమేంటో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుబ్రహ్మణ్య శ్రీరామ్ తేల్చి చెప్పారు. హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చిన వెంటనే వ్యక్తుల కంటే వ్యవస్థలు గొప్పవని, మునుపటి మాదిరే తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని ధర్యోపన్యాసాలు చేసిన నిమ్మగడ్డ…ఆచరణకు వచ్చే సరికి తాను ఎలాంటి వాడో చెప్పకనే చెప్పారు. తనకు తానుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రకటించుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడ్డం ఆయనకే చెల్లింది.
వీటి అన్నింటికి మించి ఏజీ చెప్పిన ఓ విషయం నిమ్మగడ్డ ఎంత అహంకారో, రానున్న రోజుల్లో ఎస్ఈసీగా విధులు ఎలా నిర్వర్తిం చనున్నారో తేట తెల్లమైంది. ఎన్నికల కమిషనర్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవ్యాది వీవీ ప్రభాకర్‌రావుకు నిమ్మగడ్డ స్వయంగా ఫోన్ చేసి ….స్టాండింగ్ కౌన్సిల్ పోస్టుకు రేపటిలోగా రాజీనామా చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌లో కొత్త రక్తం నింపా లని భావిస్తున్నట్టు ప్రభాకర్‌రావుకు నిమ్మగడ్డ చెప్పారు. అంతేకాదు, కొత్త స్టాండింగ్ కౌన్సిల్‌ను సోమవారం కల్లా నియమిం చనున్నట్టు కూడా నిమ్మగడ్డ ఆయనతో చెప్పారు.
అయితే కొంత సమయం కావాలని ప్రభాకర్‌రావు కోరగా, అది సాధ్యం కాదని నిమ్మగడ్డ స్పష్టం చేశారని విలేకరుల సమావేశంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పారు. అంటే తనకు ఇష్టం లేకపోతే ఒక న్యాయవాదినే మార్చుకోవాలని నిమ్మగడ్డ గట్టి పట్టుదలతో ఉండడాన్ని చూస్తున్నాం. మరి నిమ్మగడ్డకు అంత అహంకారం ఉన్నప్పుడు….అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వాళ్లకు ఎలా ఉండాలి? నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అనే వ్యక్తి కేవలం సెలెక్ట్ చేయగా నియమితుడైన అధికారి. ఇదే జగన్‌మోహ న్‌రెడ్డి విషయానికి వస్తే అలా కాదే! జగన్ ఎలెక్ట్ అయిన నేత. ఎంపికకు, ఎన్నికకు చాలా తేడా ఉంటుంది.
సెలెక్ట్ అయిన నిమ్మగడ్డ ఎక్కడ? ఎలెక్ట్ అయిన జగన్ ఎక్కడెక్కడ? ఏమైనా పోలిక ఉందా? ఒక న్యాయవాదినే మార్చు కోవాల న్నంత అక్కసు నిమ్మగడ్డలో ఉంటే…ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారనే భావన ఉంటే, వారిని మార్చా లని అధికారంలో ఉన్న వాళ్లు అనుకోవడంలో తప్పెక్కడ? జగన్ చేస్తే కక్ష? నిమ్మగడ్డ చేస్తే మాత్రం శిక్షా? ఇదేనా నిమ్మగడ్డను సమర్థించే రాజకీయ పార్టీలు, మీడియా చెబుతున్నది?