Advertisement

Advertisement


Home > Politics - Opinion

భయమే ఓటమి బాట!

భయమే ఓటమి బాట!

కాపురం చేసే కళ కాలు తొక్కిననాడే తెలుస్తుందని అంటారు పెద్దలు. ఎన్నికల్లో విజయం సాధించే కళ.. ప్రచార పర్వంలోనే అర్థమైపోతుంది. ప్రచారంలో ప్రజలతో దగ్గరినుంచి మెలిగేప్పుడే.. వారి స్పందన నాయకులకు సరైన సంకేతాలను అందిస్తుంది. గెలుపు సంకేతాలు అందితే.. వారి ప్రవర్తన- ప్రసంగం యావత్తూ ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో సాగిపోతాయి. అదే సమయంలో.. ఓటమి సంకేతలు అందితే.. వారి మాటల్లో అణువణువునా భయం కనిపిస్తుంది!

రోజుకు నాలుగైదు సభల పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న సుడిగాలి పర్యటనల్లో, ఆయన మాటల్లో పుష్కలంగా భయం కనిపిస్తోంది. ఈ భయం ఎందుకు పుట్టింది? ఎటు దారితీయబోతోంది? అనే కోణంలో విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్రవర్ స్టోరీ ‘భయమే ఓటమి బాట!’

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో తన ముద్ర చూపించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. తన గులాబీదళాన్ని జాతీయ పార్టీగా రూపుమార్చారు. ఇతర రాష్ట్రాలలో సభలు నిర్వహించి సమరనినాదాలు చేశారు. తను ఇష్టంగా ధరించే ‘పనామా హ్యాట్’ కు ఆకుపచ్చ రిబ్బను చుట్టి.. దాని మీద ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని ముద్రించి మరీ.. కేంద్రంలో అధికార మార్పు అవసరం ఉన్నదని తన వేషధారణ ద్వారా కూడా ప్రజల్లోకి సంకేతాలు పంపడానికి ఆయన ఉత్సాహపడ్డారు. 

పదేళ్ల మోడీ పాలనకు చరమగీతం పాడాలనే ఉబలాటాన్ని దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో నాటగలనని అనుకున్నా కేసీఆర్.. అదే మాదిరి  ఆలోచన తన సొంత రాష్ట్ర ప్రజల్లో కూడా వస్తుందని ఎందుకు ఊహించలేకపోయారో తెలియదు. ‘అగలీ బార్.. బదల్‌నా సర్కార్’ అనే నినాదం అప్రకటింతగా ప్రజలలో వ్యక్తం కాగలదనే అనుమానం ఆయనకు ఎందుకు రాలేదో తెలియదు. తెలంగాణలో అద్భుతాలు సృష్టించినట్టుగా ప్రచారం చేసుకుంటూ.. తెలంగాణ మోడల్ పాలననే దేశమంతా తీసుకువస్తాం అనే అందమైన మాటలను.. ఇతర రాష్ట్రాల్లో చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ.. ఆయన పాలన గురించి ఆయన అనుకుంటున్నంత ఘనంగా ప్రజలు అనుకుంటున్నారా? అనేది ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్న!

ప్రభుత్వ యంత్రాంగంలో విపరీతమైన అవినీతి తాండవిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు ఏ చిన్న పని కోసం వెళ్లినా సరే.. ప్రజలకు ప్రభుత్వ అవినీతి స్వయంగా స్వానుభవంలోకి వస్తున్నది. ప్రభుత్వం ద్వారా ఏ పనులు జరుగుతున్నా.. కొందరు మాత్రమే లబ్ది పొందుతున్నారని.. ప్రభుత్వ పైరవీలు అనేవి కొందరికి మాత్రమే పరిమితం అవుతున్నాయనే వాదన పార్టీలో చాలా బలంగా ఉంది. ఒక కులానికి ప్రాధాన్యం అన్నట్టుగా కూడా కాకుండా.. కేవలం కొందరు వ్యక్తుల మాట మాత్రమే చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉన్నదనే అసంతృప్తి పార్టీ కింది స్థాయి నాయకుల్లో కూడా ఉంది. అయిదేళ్లపాటూ కింది స్థాయి నాయకులకు విలువ ఇవ్వకుండా, వారిని చులకనగా చూస్తూ.. ఎన్నికల వేళ వారిని ఎంతగా వాటేసుకున్నా సరే.. వారు ఎంత మాత్రం శ్రద్ధతో పనిచేయగలరు? అనేది ఒక కీలకాంశం. ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయి!

అహంకారమే ప్రధాన శత్రువు

కల్వకుంట్ల తండ్రీకొడుకులు.. అహంకారానికి ముద్ర పడ్డారు. 2014లోనే వారికి విజయం పట్ల కాస్త సంశయం ఉండేది. ఎంతగా తాము తెలంగాణ నినాదాన్ని పట్టుకు వేళ్లాడినప్పటికీ.. రాష్ట్రం ఇచ్చిన సోనియా మీద అభిమానంతో, కాంగ్రెసు పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారనే భయం ఉండేది. అయినా సరే అధికారం దక్కింది. 2018 వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన వారినందరినీ కూడా ప్రలోభపెట్టి తమకు ప్రభుత్వానికి తగిన పూర్తి మెజారిటీ ఉన్నాసరే.. తమ జట్టులో కలిపేసుకున్నారు. తద్వారా కాంగ్రెసు పార్టీ మళ్లీ మళ్లీ తెలంగాణలో నిలదొక్కుకునే పరిస్థితి లేకుండా చేసేశామనే భావనకు వచ్చారు. 2018 ఎన్నికలలో వారికి అనూహ్యమైన మెజారిటీ లభించింది. స్థానాల్లో గెలవడం మాత్రమే కాకుండా.. చాలా నియోజకవర్గాల్లో మెజారిటీలు కూడా వారి ఊహకు మించి వచ్చాయి. అక్కడితో కల్వకుంట్ల తండ్రీకొడుకులకు అహంకారం ఎక్కువైంది.

కేసీఆర్ లో పెరిగిన అహంకారానికి తొలి నిదర్శనం.. హరీష్ రావును లూప్ లైన్ లో పెట్టడం. కేసీఆర్ వారసుడిగా ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? అనే విషయంలో హరీష్, కేటీఆర్ రెండు పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఈ పోటీ అనేది పార్టీమీద ప్రభావం చూపుతుందనే వాదన కూడా ఉండేది. అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగా, అహంకారాన్ని అందించిన మెజారిటీ తరువాత, హరీష్ రావుకు అసలు మంత్రి పదవి కూడా లేకుండా కొన్నాళ్లుంచారు. వారసత్వం విషయంలో సందిగ్ధాలు తొలగిపోయాయి. అన్ని రకాలుగానూ క్లారిటీ ఇచ్చారు.

ఆ తర్వాత తండ్రీ కొడుకుల అహంకారపూరిత వ్యవహార సరళి ఇంకా శృతిమించిందనే వాదన ఉంది. ముఖ్యమంత్రి అయితే అసలు మంత్రులకు కూడా అందుబాటులో ఉండని నాయకుడుగా అయిపోయారు. ఎమ్మెల్యేల సంగతి సరేసరి. తెలంగాణ రాష్ట్రానికి భౌగోళికంగా, వాతావరణం పరంగా ఉన్న అనేక అనుకూలతల దృష్ట్యా, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇక్కడకు కొన్ని పరిశ్రమలు, సంస్థలు ఎక్కువగా రావడం జరిగింది. అదంతా తమ ఘనతగా డప్పు కొట్టుకోవడంలో వీరు హద్దులు దాటారు. ఎంతటివారినైనా చులకనగా చూడడం, చులకనగా మాట్లాడడం వారికి ఒక అలవాటుగా మారిందనే వాదన పార్టీలోనే ఉంది.

ఎమ్మెల్యేలకు కూడా కేటీఆర్ అపాయింట్మెంట్ దొరకడం కూడా ఒక అద్భుతమైన సంగతిగా తయారైంది. మునిసిపల్ చైర్మన్లు స్థాయి వారికైతే.. అసలు అది మహాప్రసాదం. అంత ఈజీగా దొరికేదే కాదు. ఈ అహంకారం వారి ప్రవర్తనను కూడా పూర్తిగా మార్చేసింది. సూటిగా మాట్లాడుతున్నాం అనే ముసుగులో పొగరుగా మాట్లాడడం, వ్యవస్థలను లెక్క చేయకుండా.. తమను మించిన వారు ఎవరూ లేరన్నట్లుగా చెలరేగడం అలవాటు అయింది. ఈ అహంకారాన్ని కేవలం పార్టీలోని వారు మాత్రమే కాదు.. ప్రజలందరూ కూడా గమనిస్తూ వచ్చారు. మరి ఇన్నాళ్లు గమనించిన తీరుగురించి  ఇప్పుడు ప్రజలు తీర్పు చెప్పే సందర్భం వచ్చింది. ఆ అహంకారం వారికి ప్రధాన శత్రువుగా పరిణమించిన వాతావరణం ఏర్పడింది. 

బుజ్జగింపుల్లో వారు సక్సెస్

గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకుంటే.. ఒక పార్టీ పూర్తిగా సర్వనాశనం అయిపోతుందనే సిద్ధాంతం నిజమయ్యేట్లయితే గనుక.. ఏడున్నర దశాబ్దాలు దాటిన సుదీర్ఘ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటికి కొన్ని వందల పార్టీలు కనుమరుగు అయిపోయి ఉండేవి. గెలిచిన తర్వాత.. కొందరు నాయకులు ప్రలోభాలకు భయాలకు గురికావొచ్చు గాక.. కానీ గెలుపోటములు అనేవి ప్రజలలో ఉండే ఆదరణ మీదనే ఆధారపడి ఉంటాయనేది నిజం. ఆ సత్యం ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు బోధపడే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచిన వారిని భారాసలో కలిపేసుకుని మురిసిపోయిన సందర్భంలో.. ఆ కాలవ్యవధిలో కాంగ్రెస్ బలహీన పడినట్టుగా తయారై ఉండొచ్చు గాక. కానీ.. ఎన్నికలు సమీపించే సమయానికి ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.

కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధానమైన బలహీనత.. ఐక్యతాలోపం! ముఠా తగాదాలు, గ్రూపుల మధ్య విభేదాలు, ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకోవడం లాంటివి! కానీ ఈ సారి ఎన్నికలకు సిద్ధం కావడంలో వారు చాలా జాగ్రత్త పడ్డారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే తొలి సన్నాహక సమావేశంలోనే.. ముఠా తగాదాల పరంగా రాహుల్ గాంధీ వారికి చాలా స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. పార్టీ నాయకులకు కూడా వాస్తవాలు అర్థమయ్యాయి. ఈ ఎన్నికల్లో పార్టీని సమష్టిగా గెలిపించుకోలేకపోతే.. ఇక ఎప్పటికీ తిరిగి లేవలేనంతగా పార్టీ కుదేలైపోతుందని వారు భయపడ్డారు. అందుకే సమైక్య గానం ఆలపించారు. నాయకుల మధ్య సయోధ్య కనబడుతూ వచ్చింది.

అభ్యర్థిత్వాల ప్రకటన తర్వాత.. చాలా సహజంగా అసంతృప్తులు మళ్లీ రేగాయి. చాలా చోట్ల తిరుగుబాటు అభ్యర్థుల నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే.. కేవలం సర్వేల మీద ఆధారపడి మాత్రమే అభ్యర్థిత్వాలను ఎంపిక చేస్తున్నట్టుగా తొలినుంచి చెబుతూ వచ్చిన కాంగ్రెస్ పెద్దలు.. తిరుగుబాటు చేస్తున్న వారిని బుజ్జగించడంలో సఫలం అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే.. అలా తిరుగుబాటు ప్రకటించిన వారికి కూడా గత్యంతరం లేదు.

ఇప్పటికిప్పుడు భారాసలోకి వెళ్లినా.. అక్కడ దక్కేదేమీ ఉండదు. అదే ఇన్నాళ్లు సేవ చేసిన కాంగ్రెసునే నమ్ముకుని ఉంటే.. రేపటికైనా భవిష్యత్తు దక్కుతుందనే ఆశతో వ్యవహరించారు. ఈ బుజ్జగింపులు సక్సెస్ అయ్యాయి. చాలా చోట్ల విత్ డ్రా చేసుకున్నారు. ఒకరిద్దరు ఆ తర్వాత కూడా రాజీనామాలు చేశారు. ఈ మాత్రం దెబ్బలు ఎటూ తప్పవు.

అయితే ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే.. భారాస, బిజెపి లనుంచి రకరకాల కారణాల వలన బయటకు వెళ్లదలచుకున్న  మెజారిటీ నాయకులకు కాంగ్రెస్ మాత్రమే దిక్కుగా కనిపించింది. ఇది ఆ పార్టీకి ఒక ఆశావహ పరిణామం. కాంగ్రెసులో ఇక ఎప్పటికీ తమకు భవిష్యత్తు ఉండదని అంతిమ నిర్ణయానికి వచ్చిన పొన్నాల లక్ష్మయ్య లాంటి వారు కూడా ఫిరాయించేశారు. కానీ స్థూలంగా చూసినప్పుడు.. అనేక చోట్ల బుజ్జగింపులు ఫలించాయి. 

అన్ని శక్తులు ఒక్కటై…

తెలంగాణలో కేసీఆర్ ను బలంగా వ్యతిరేకించే ప్రతి నాయకుడికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దిక్కుగా మారిందనడంలో సందేహం లేదు. తెలంగాణలో పోటీ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా నడిపించింది. తుట్టతుదకు కాంగ్రెసుకు మేలు చేసే లోపాయికారీ ఒప్పందంతో పోటీనుంచి పూర్తిగా తప్పుకునేలా చంద్రబాబునాయుడు జైలునుంచే డైరక్షన్ చేశారు. దానివలన కాసాని జ్ఞానేశ్వర్ వెళ్లిపోవడం మినహా పార్టీకి పెద్దగా నష్టం జరగలేదు. కాకపోతే.. తెలుగుదేశం కాంగ్రెసు కోసమే ఈ నాటకం ఆడిందన్నది స్పష్టం. సర్వవిదితం. అందరికీ తెలిసిన సంగతే అయినప్పటికీ.. మాంసం తిన్నట్లు తెలిసేందుకు ఎముకలు మెడలో వేసుకుని తిరిగినట్టుగా..  ఖమ్మంలో తెలుగుదేశం నాయకులు.. పసుపు కండువాలు కప్పుకుని మరీ.. ఒక పెద్ద సభ పెట్టి.. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మలను గెలిపించాలని ప్రతిజ్ఞలు చేశారు.

కేవలం తెలుగుదేశం మాత్రమే కాదు.. తెలంగాణలోని కేసీఆర్ వ్యతిరేకత ఉన్న సీరియస్ శక్తులన్నింటినీ.. కాంగ్రెసు అనుకూలంగా మార్చడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. ప్రొఫెసర్ కోదండరాం, వైఎస్ షర్మిల పోటీనుంచి తమ పార్టీలను పూర్తిగా తప్పించి.. కాంగ్రెసుకు మద్దతు ప్రకటిస్తున్నామని.. కేసీఆర్ పతనం రాష్ట్రానికి అవసరమని నినాదాలు చేశారు. ఇక పోతే వారందరూ కూడా.. కాంగ్రెసుకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో అంతే సీరియస్ గా తిరిగితే కాస్త ఫలితం ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది.

ఏపీ రాజకీయాలతో పోల్చి చూసినప్పుడు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కల్యాణ్ దాదాపు ఏడాదికిపైగా రంకెలు వేస్తూనే ఉన్నారు. పొత్తులు ప్రకటించిన తర్వాతనైనా ఆ పరిస్థితి వచ్చిందో లేదో తెలియదు. వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందో.. లేదా, జనసేన పార్టీనే చీలిపోతుందో కూడా అర్థం కావడం లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుది ఘడియలు వచ్చేదాకా చాలా సైలెంట్ గా ఉండిపోయి, చివరి క్షణాల్లో వ్యతిరేక ఓటు చీలకుండా బాగానే చక్రం తిప్పారు. తమ మార్కు మంత్రాంగం ఏమిటో చూపించారు. అది వారికి అదనపు బలంగా మారింది. ఎటూ పవన్ కల్యాణ్ ను గానీ, బిజెపిని గానీ.. సీరియస్ గా కేసీఆర్ వ్యతిరేక శక్తులుగా ప్రజలే గుర్తించడం లేదు. 

ఆ ప్రచారం ప్రజలు నమ్ముతున్నారు!

నిజమే.. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, భారాసతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతోందనే ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు యావత్తూ నమ్ముతున్నారు. ఆ రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రోకో నడుస్తున్నదని ప్రజల సందేహం. దేశంలో కీలక ప్రాంతాల్లో మోడీ వ్యతిరేక ఓటును  చీల్చడానికి కేసీఆర్ భారాసను స్థాపిస్తే.. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓటును చీల్చడానికి భాజపా ఉపయోగపడుతున్నదనే వాదన ప్రజల్లోకి వెళ్లింది. మరో కోణంలోంచి చూసినప్పుడు.. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే సందేహం ప్రజల్లో ఎంతగా పాపులర్ అయిందో.. భాజపా సారధిగా బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? అనే సందేహం కూడా తెలంగాణ ప్రజల్లో పాపులర్ అయింది. ఇందుకు ఆ పార్టీ సరైన కారణాలు చూపలేకపోయింది.

ఆరెస్సెస్ బౌద్ధిక్ ప్రసంగాలలో మాట్లాడే పడికట్టు పదజాలంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సాగించే పసలేని ప్రసంగాలు, ఆ ప్రసంగాల్లోని పేలవమైన విమర్శలు.. పార్టీ కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారని జనం నమ్మడానికి మరో కారణమైంది. దానికి తగ్గట్టుగానే కేసీఆర్, మోడీ ఇద్దరూ కూడా కాంగ్రెస్ మీదనే విమర్శలు ఎక్కు పెడుతున్నారు. భారాస ఏర్పాటు సమయంలో కేంద్రంలోని బిజెపి మీద ఏ స్థాయిలో కేసీఆర్ విరుచుకుపడ్డారో.. ఇప్పుడు అదంతా మర్చిపోయారు. 

కేవలం కాంగ్రెసు మాత్రమే శత్రువు అంటున్నారు. ఇదంతా ఒప్పందంలో భాగమే అన్నది.. పలువురి సందేహం. ప్రభుత్వానికి అవసరమైన సింపుల్ మెజారిటీ కోసం భారాసకు సీట్లు తక్కువ పడితే గనుక.. ఎంఐఎం వారికి సహకరించినట్లే.. బిజెపి కూడా మద్దతిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలాంటి చవకబారు నిర్ణయానికి.. ‘కాంగ్రెస్ ముక్త దేశాన్ని ఆవిష్కరింపజేయడమే లక్ష్యం’ అనే అసంబద్ధ వాదనను తెరపైకి తెస్తారనే నమ్మకం కూడా పలువురిలో ఉంది. అందుకే.. సాంప్రదాయ బిజెపి, హిందూత్వ ఓటు బ్యాంకు తప్ప.. కేసీఆర్ వద్దనుకునే ఏ ఒక్క ఓటు కూడా ఇవాళ బిజెపికి పడే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. 

ముస్లింలకు ఒవైసీ మాట ఖురాన్ కాదు కదా!

ముస్లిం ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తగా కేసీఆర్ కు పడుతుందనే గ్యారంటీ లేదు. ముస్లిం మతస్తులు అందరికీ మజ్లిస్ అధినేత ఒవైసీ ఆరాధ్యుడు అనుకోడానికి కూడా వీల్లేదు. ఆయన మాట వారు ఖురాన్ వాక్కులా పాటిస్తారని అనుకోలేం. బిజెపితో కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయం ముస్లింలలో కూడా ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉంది. పైగా ఒవైసీ మాటలు అలవాటుగా వారి పార్టీ గెలిచే సీట్లను ప్రభావితం చేయగలవేమో తప్ప.. యావత్తు తెలంగాణను ప్రభావితం చేయగలవని అనుకోలేం. 

ఇలాంటి అనేక కారణాలు కలిసి.. భారాస ఓడిపోవచ్చుననే సంకేతాలను అందిస్తున్నాయి. వీటన్నింటినీ మించి.. కేసీఆర్ లో భయం కనిపిస్తోంది. కాంగ్రెస్ మీద ఆయన దాడి చేస్తున్న తీరు.. ధరణి విషయంలో గానీ.. ఇతర హామీల విషయంలో గానీ.. కాంగ్రెసు హామీలను సూటిగా విమర్శించలేక వాటిని కేసీఆర్ వక్రీకరిస్తున్న తీరు ఆయనలోని భయానికి చిహ్నాలుగా కనిపిస్తున్నాయి. 

‘నేను ఓడిపోతే నాకేం ఫరవాలేదు.. ఇంట్లో కూర్చుండిపోతాను.. రాష్ట్రమే నష్టపోతుంది’ అనే మాట తొమ్మిదేళ్లకుపైగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నోటినుంచి రావడం అనేది ఖచ్చితంగా భయానికి చిహ్నమే. కేసీఆర్ లోని ఆ భయమే .. భారాస ఓటమిని శాసించే ప్రమాదం ఉంది. 

..ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?