అవినీతి, కేసులు, దోపిడీ.. ఇలాంటి రాజకీయ విమర్శలకు కాలం చెల్లిపోయింది. ఎప్పుడూ ఒకటేమాట.. మళ్ళీ మళ్ళీ అదే మాట చెబుతూ వుంటే.. రాజకీయ నాయకుల మీద జనానికి విశ్వాసం సన్నగిల్లిపోతుంటుంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు గురించి ఎన్నో ఏళ్ళుగా రచ్చ జరుగుతూనే వుంది. అయినా, ఇంకా అదే కేసుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తూనే వున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.
లక్ష కోట్ల దోపిడీ.. అంటూ జగన్ మీద దాదాపు దశాబ్ద కాలంగా రాజకీయం చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ కేసుల లోతెంత.? అసలు ఆ రచ్చకు సంబంధించి విచారణల సంస్థలు తేల్చిందేంటి.? అన్న విషయాలపై జనానికి క్లారిటీ వుంది. టీడీపీ సంగతి సరే, పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో పయనించి.. చేతులు కాల్చుకున్నారు ఇటీవలి కాలంలో.. వైఎస్ జగన్‌పై విమర్శల పరంగా.
సాక్షాత్తూ జనసేన ముఖ్యనేతల్లో ఒకరైన మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ, వైఎస్ జగన్ మీద అక్రమాస్తుల ఆరోపణల్లో పెద్దగా పసలేదని తేల్చేశారు. చిత్రమేంటంటే, వైఎస్ జగన్‌పై అక్రమాస్తుల కేసుని డీల్ చేసింది ఆయనే. ఆ కేసుతోనే ఆయన 'హీరో' అన్పించుకున్నారు కొందరి దృష్టిలో. అదే కేసు, ఆయన ఇమేజ్‌నీ డ్యామేజ్ చేసిందనుకోండి.. అది వేరే విషయం. ఇంత జరిగాక కూడా, జైలు – కేసులు.. అంటూ 'తానా' సభల్లో జనసేనాని చేసిన ప్రసంగం ఇప్పుడు విమర్శల పాలవుతోంది.
సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కి నెటిజన్ల నుంచి పెద్దయెత్తున 'కౌంటర్లు' పడుతున్నాయి. 'ఇంకెన్నాళ్ళు జగన్‌ని విమర్శిస్తూ రాజకీయం చేస్తారు.?' అన్నది మెజార్టీ నెటిజన్స్ సంధిస్తోన్న ప్రశ్న. ప్రజాతీర్పు అంత స్పష్టంగా వచ్చాక, మళ్ళీ జగన్ అక్రమాస్తుల కేసు గురించి మాట్లాడటమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. తనకున్న సినీ గ్లామర్‌ని ఉపయోగించుకుని, జనంలో నిత్యం వుంటూ, జనం ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం చేయగలిగితే, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అనేది గట్టిగానే ఎమర్జ్ అయ్యేందుకు తగిన 'పొలిటికల్ వాక్యూమ్' అయితే క్రియేట్ అవుతోందిప్పుడు.
ఈ పరిస్థితుల్లో, కలిసొస్తున్న పరిస్థితుల్ని చెడగొట్టుకోవడం తప్ప, జగన్ మీద పవన్ చేసే విమర్శల వల్ల జనసేనకు ఉపయోగమేమీ వుండదు. 2014లో పార్టీ పెట్టి, 2018 చివరివరకూ కాలక్షేపం చేసి, ఎన్నికల ముందు హడావిడి చేసిన పవన్, ఇటీవలి ఎన్నికల తర్వాత మళ్ళీ టైమ్ పాస్ పాలిటిక్స్‌కే అలవాటుపడిపోయారు. ఇదే పద్ధతి ముందు ముందు కూడా కొనసాగిస్తే, 2024 నాటికి జనసేన పార్టీ ఉనికి దాదాపుగా కన్పించకపోవచ్చు.