గతంలో పెట్రోల్ ధరలు పెరిగితే..కేంద్ర ప్రభుత్వంపై నాటి గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో శ్రీ నరేంద్రమోడీ ఏ స్థాయిలో విరుచుకుపడే వారో వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ వాళ్లు అవినీతి చేస్తూ ప్రజలపై భారం మోపుతూ ఉన్నారంటూ బీజేపీ విరుచుకుపడేది. మరి కాంగ్రెస్ వాళ్లంటే దోచుకుని ప్రజలపై భారం వేశారని ప్రజలను గట్టిగా నమ్మించగలిగింది బీజేపీ.
తాము అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ ముప్పై రూపాయలకే దొరుకుతుందంటూ కూడా ప్రచారం చేసుకున్నారు కమలనాథులు. కట్ చేస్తే.. కాంగ్రెస్ హయాంలో పెట్రో ధరలు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ మీద డిపెండ్ కాగా, బీజేపీ హయాంలో మాత్రం అంతర్జాతీయ విపణిలో పెట్రో చార్జీలు పాతాళానికి చేరినా, దేశంలో మాత్రం పెట్రో ధరలు పతాక స్థాయికి చేరుతూ ఉన్నాయి.
ఇదీ మోడీ మార్కు ఉద్ధరింపు. తాజాగా లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలకు చేరువైంది. రోజువారీగా పెంపుదల చేస్తూ.. మెత్తగా పీల్చేస్తున్న మోడీ ప్రభుత్వం.. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను ఆల్ టైమ్ హై కు తీసుకెళ్లింది.
పెట్రోల్ సర్ చార్జీలను తమ ఇష్టానుసారం పెంచుకునేందుకు అనుగుణంగా పార్లమెంట్ లో గత ఏడాది బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించుకుంది మోడీ ప్రభుత్వం. ఆ తర్వాత ప్రజలు కరోనా కష్టాల్లో పడ్డా, అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పతనావస్థకు చేరినా.. పెంపే కానీ, తగ్గింపు లేకుండా విజృంభిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఇలా పెట్రోల్, డీజిల్ లు ఆల్ టైమ్ కు చేరాయి.
రెండేళ్ల కిందట ఒకసారి ఆల్ టైమ్ హై కు తీసుకెళ్లింది మోడీ ప్రభుత్వం. ఆ తర్వాత కొంత తగ్గించి.. ఇప్పుడు పాత రికార్డును కూడా అధిగమించేశారు. ఇలా విజయవంతంగా లీటర్ పెట్రోల్ ధరను 90 రూపాయలకు తీసుకెళ్లారు.
ఇదే సమయంలో ప్రీమియమ్ రకం పెట్రోల్ అడిగితే బంకుల్లో దాన్ని వంద రూపాయలు చెప్పేలా ఉన్నారు. ఇలా చూస్తే లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు చేరినట్టే! మామూలు రకం పెట్రోల్ కూడా అతి త్వరలోనే వందకు చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి.
ఎవరైతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. పెట్రోల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారో, ఆయన ప్రధాన మంత్రి అయ్యాకా.. అవే పెట్రో ధరలు ఆల్ టైమ్ హై రేంజ్ చేరడమే సిసలైన విశేషం.
పెట్రోల్ ధరలే కాదు.. ప్రజల నుంచి వీలైనంతగా దండుకునే మార్గాల్లో వేటినీ మోడీ ప్రభుత్వం వదులుకోవడం లేదని వేరే చెప్పనక్కర్లేదు. జాతీయ రహదారుల టోల్ గేట్ల వద్ద వసూళ్లు శాశ్వతం అని కేంద్రం స్పష్టం చేస్తోంది.
అనునిత్యం గేటు దాటిన ప్రతి వాహనం నుంచి వందల రూపాయలను వసూలు చేస్తూనే ఉన్నారు. వాటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది అనే ప్రాతిపదికన కాకుండా.. శాశ్వతంగా వసూలు చేస్తామని, ఇంకా జీపీఎస్ విధానాన్ని తెచ్చి..దుమ్మరేపుతామంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మధ్యనే సెలవిచ్చారు.
ఇదీ మోడీ ప్రభుత్వ మార్కు విధానం. ఎవ్వరి కష్టాలూ కేంద్రానికి అవసరం లేదు. ప్రజల పరిస్థితి ఏమనేది కూడా తెలుసుకోకుండా.. కనీస లాజిక్ కూడా లేకుండా వీలైనంతగా దండుకోవడమే పరమావధిగా కేంద్రం పని చేస్తూ ఉన్న వైనం అడుగడుగునా స్పష్టం అవుతూనే ఉంది.