పోవాలనుకుంటే పోండి.. టీడీపీకి నష్టమేమీ లేదు.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చేసరికి.. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజా వేదిక కూల్చివేత ఒక్కటీ ఆయన అనుకోని సంఘటన. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం…

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చేసరికి.. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజా వేదిక కూల్చివేత ఒక్కటీ ఆయన అనుకోని సంఘటన. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం అన్నది ఆయనకి కొత్త విషయమూ కాదు.. ఆయనకి ఆశ్చర్యం కలిగించే విషయం అంతకన్నా కాదు. ఎందుకంటే, చంద్రబాబు భక్తుడు సుజనా చౌదరి.. సీఎం రమేష్‌ కూడా అంతే. వాళ్ళిద్దరూ చంద్రబాబుకి చెప్పకుండా నిర్ణయం తీసుకోగలరా.? 

అత్యంత పకడ్బందీగా చంద్రబాబే అన్నీ ప్లాన్‌ చేసి, ఎంచక్కా రైట్‌ టైమ్‌కి విదేశాలకు చెక్కేశారన్నది కేవలం వైఎస్సార్సీపీ నుంచి వస్తున్న సాధారణ విమర్శగా మాత్రమే ఎలా చూడగలం.? ఇలాంటి రాజకీయ వ్యూహాలు రచించడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ప్రజా వేదిక కూల్చి వేతకు సంబంధించి జగన్‌ హెచ్చరికల్ని మాత్రం తొలుత చంద్రబాబు లైట్‌ తీసుకున్నారట. కూల్చివేత ప్రారంభమయ్యేవరకూ చంద్రబాబు, 'అదెప్పుడు కూల్చాలి.?' అనే ధీమాతోనే వున్నారట. 

'ఇది నిజంగానే అనూహ్యమైన పరిణామం. అయినా, ఇక్కడే వుండి.. మీరెందుకు అప్రమత్తం కాలేదు.? ఎందుకు చెయ్యాల్సిన రీతిలో యాగీ చేయలేదు.?' అంటూ చంద్రబాబు, తెలుగు తమ్ముళ్ళను నిలదీశారట. తెలుగు తమ్ముళ్ళ నుంచి మాత్రం, చంద్రబాబుకి సరైన సమాధానం రాలేదట. ఇక, పార్టీ ఫిరాయింపుల గురించి ఒకరిద్దరు నేతలు, చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తే.. 'పోవాలనుకుంటే పోండి.. టీడీపీకి నష్టమేమీ లేదు..' అన్న అర్థంలో నిష్టూరంగా మాట్లాడారంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ టీడీపీ నేత, మీడియాకి లీకులు అందించారు. 

మరోపక్క, ఎన్నికల తర్వాత చంద్రబాబు వ్యవహార శైలి నచ్చని పలువురు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలతో టచ్‌లోకి వెళుతున్నారు. 'పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేయాల్సిందే..' అని వైసీపీ చెబుతుండడంతో, 'ఎమ్మెల్యే పదవులు పోకుండా వుంటేనే వస్తాం..' అనే మాట చెప్పి మరీ, బీజేపీ వైపుకు కొందరు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. 

రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీడీపీ ఎంపీలను బీజేపీ సభ్యులుగా గుర్తించడం.. అన్నది బీజేపీ చేతుల్లో వ్యవహారం. అసెంబ్లీలో అలా కుదరదు కదా.! ఇదే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోన్న బీజేపీ అదిష్టానం రైట్‌ టైమ్‌లో తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ తీయబోతోందట. అయితే, 'ఇది కూడా చంద్రబాబు వ్యూహమే..' అని టీడీపీలోనే కొందరు పెదవి విరిచే స్థాయికి ఆ పార్టీలో అసహనం పెరిగిపోయిందన్నమాట.