ఆమె పేరు సృజన. సీనియర్ ఐఏఎస్ అధికారిణి. అది మాత్రమే కాదు ముక్కు సూటి అధికారిణిగా వృత్తిలో ఘనమైన పేరు తెచ్చుకున్నారు. ఆమె గత కొన్నేళ్ళుగా విశాఖ జిల్లాలోనే వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఆమె విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. అదే విధంగా మహా విశాఖ కార్పోరేషన్ కి కమిషనర్ గా గత కొంతకాలంగా సేవలు అందిస్తున్నారు. ఆమె సమర్ధవంతమైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. తన వారూ పర వారు అన్న భేదం లేకుండా ఆమె తీసుకున్న చర్యలు కొందరికి కంటగింపుగా మారాయని అంటున్నారు. ఫలితంగా ఆమె బదిలీ అని ప్రచారం సాగుతోంది.
సృజన జీవీఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలని కూల్చేయడంలో ఏ మాత్రం సంకోచించలేదు. అలసత్వం చూపించలేదు. దీంతో ఆమె కొందరికి కన్నెర్ర అయ్యారని టాక్. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం ఆమెను బదిలీ చేసి తీరాలని ఒక విచిత్రమైన డిమాండ్ అయితే వచ్చింది.
అయితే ఆమె పనితీరుని ఎవరూ వేలెత్తి చూపించలేని పరిస్థితి. దాంతో ఆమె ఇప్పట్లో బదిలీ కారు అని అంతా భావించారు. అయితే సడెన్ గా ఆమెను ట్రాన్స్ ఫర్ చేస్తూ తీసుకున్న నిర్ణయం విశాఖవాసులను ఆశ్చర్యపరచింది.
ప్రభుత్వ అధికారి అంటే బదిలీ తప్పదు, కానీ విశాఖను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తూ అవినీతి, అక్రమాలకు చెక్ చెబుతూ తనదైన శైలిలో కొరడా ఝలిపిస్తున్న సృజన బదిలీ కావడం మాత్రం స్మార్ట్ సిటీకి పెద్ద లోటే అంటున్నారు. మరి ఆమె ప్లేస్ లోకి వస్తున్న చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టెర్ లక్ష్మీ షా మరింతగా విశాఖ కీర్తి ప్రతిష్టలను పెంచుతారు అనే అంతా ఆశిస్తున్నారు.