అది చంద్రబాబు నాయుడి సొంతిళ్లు ఏమీకాదు. హెరిటేజ్ లాభాలతో చంద్రబాబు నాయుడు కుటుంబం నిర్మించుకున్న ఇల్లు కూడా కాదు. అది కేవలం ఒక అద్దె ఇల్లు. ఆ అద్దె ఇల్లు అక్రమ కట్టడం అని ప్రభుత్వం తేల్చింది. అది జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాకా కాదు, అంతకు ముందే అది అక్రమ కట్టడం. దానికి కేంద్రం పర్యావరణ శాఖ నుంచి కూడా అప్పట్లోనే నోటీసులు వచ్చాయి. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఆ నోటీసులు ఆయన ఇంటికి వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో అధికారం ఉండటంతో అడిగేనాథుడు లేకుండాపోయాడు.
ఇప్పుడు ఆయన చేతిలో అధికారం లేదు కాబట్టి.. అది అక్రమ కట్టడం అనే అంశంపై ఇంత చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆ అక్రమ కట్టడాన్ని రక్షించుకోవడానికి పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా అద్దెకు ఉన్న ఇల్లుకు సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే దాన్ని తక్షణం ఖాళీ చేస్తారు. ఎందుకంటే.. కట్టుకున్నోడికి ఒకటే కొంప, అద్దెకు ఉండే వాడికి బోలెడన్ని! అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అద్దె ఇంటి విషయంలో ఇంత ఇష్యూ చేస్తూ ఉండటం విడ్డూరంగా ఉంది!
అందులో ఏముందో.. అని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఏదీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ అక్రమ కట్టడాన్ని ఖాళీ చేయడానికి ఎందుకు మొగ్గుచూపడం లేదు, ఆదర్శంగా నిలవాల్సిన ఆయన.. ఎందుకు అక్రమ కట్టడం అనే వివాదం ఉన్న దాంట్లోనే బస చేయడానికి ఇంతగా శ్రమిస్తున్నారు? అనే అంశం మీద చర్చ జరుగుతూ ఉంది సామాన్య ప్రజల్లో!