గెలిచే సీన్ లేదని డిసైడైన గులాబీదళాలు!

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటి కోసం జరగబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు, సందడి మొదలవుతోంది. ప్రస్తుతం ఉన్నవారిలో మెదక్-కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూరరఘోత్తమ్…

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటి కోసం జరగబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు, సందడి మొదలవుతోంది. ప్రస్తుతం ఉన్నవారిలో మెదక్-కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూరరఘోత్తమ్ రెడ్డి (పీఆర్టీయూ), వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి (యూటీఎఫ్) స్థానాలతో పాటు, మెదక్- కరీంనగర్, ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం సీటు కూడా ఖాళీ అవుతోంది.

ఎన్నికల సూచన కనపడగానే పార్టీల్లో హడావుడి మొదలు కావడం సహజం. కానీ భారాసలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉన్నదంటే.. పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ సీటుకోసం మాత్రం పోటీ దండిగా ఉంది. అదే సమయంలో టీచరు ఎమ్మెల్సీ సీటు గురించి పట్టించుకుంటున్న వారు లేరు. టీచరు ఎమ్మెల్సీగా భారాస మద్దతుతో గెలిచేంత సీన్ లేదని మొత్తం గులాబీ అభిమానులందరూ డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది.

గతంలో కూడా టీచరు ఎమ్మెల్సీల విషయంలో భారాస డైరక్టుగా అభ్యర్థుల్ని దించలేదు. పీఆర్టీయూకు మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం పీఆర్టీయూ- భారాస మధ్య సత్సంబంధాలు లేవు. అందువల్ల టీచరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా భారాస సైలెంట్ గా ఉంటుందనే వాదన ఒకటి ఉంది.

కానీ వాస్తవం ఏంటంటే.. ఉపాధ్యాయ వర్గాల్లో కేసీఆర్ కు అపరిమితమైన చెడ్డపేరు ఉంది. టీచర్లకు పీఆర్సీ వేతనాల పెంపు విషయంలో కూడా చాలా అపకీర్తిని వ్యతిరేకతను కేసీఆర్ మూటగట్టుకున్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో కూడా టీచర్లంతా కేసీఆర్ పట్ల తమ వ్యతిరేకతను చాటుకున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉపాధ్యాయవర్గంలో మంచిపేరు ఉంది.

బదిలీలు చేపట్టిన తీరుతో పాటు, పదోన్నతులు ఇవ్వడం, డీఎస్సీ వేసి వేల టీచరు ఉద్యోగాలను భర్తీచేయడం, ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై ఒత్తిడి తగ్గించడం ఇవన్నీ కూడా రేవంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పైగా విద్యాశాఖ ప్రస్తుతం ఆయన వద్దనే ఉంది. టీచర్లతో ఆయన తరచూ సమావేశం అవుతున్నారు. వారితో ఇంటరాక్ట్ అవుతూ సూచనలు సలహాలు చెబుతున్నారు. మిమ్మల్ని మించిన వాళ్లు లేరంటూ ప్రభుత్వ టీచర్లందరినీ పదేపదే పొగుడుతూ ఉన్నారు. మీకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తాం అనే మాట చెబుతున్నారు. ఇలా అన్ని రకాలుగానూ టీచరు వర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు ఉంది.

ఇలాంటి నేపథ్యంలో తలకిందులుగా తపస్సు చేసినా సరే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఎన్నిక అంటూ జరిగితే.. గులాబీ దళానికి చెందిన వ్యక్తి గెలవడం అసాధ్యం. అందుకే రెండు ఖాళీలు ఉన్నప్పటికీ భారాస నాయకులు పట్టించుకోకుడా.. ఉన్న ఒక్క పట్టభద్ర ఎమ్మెల్సీ సీటుకోసం పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు.

4 Replies to “గెలిచే సీన్ లేదని డిసైడైన గులాబీదళాలు!”

Comments are closed.