ఇద్దరు ఎమ్మెల్యేల ‘కండువాల’ రచ్చ !

ఇద్దరు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అండ్ ఆరెకపూడి గాంధీ గొడవ ఇప్పుడు రాష్ట్రస్థాయి సమస్య అయింది. కేవలం ఇద్దరి మధ్య గొడవ స్టేట్ సమస్య టైపులో మారినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా…

ఇద్దరు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అండ్ ఆరెకపూడి గాంధీ గొడవ ఇప్పుడు రాష్ట్రస్థాయి సమస్య అయింది. కేవలం ఇద్దరి మధ్య గొడవ స్టేట్ సమస్య టైపులో మారినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు ఎలా అబద్ధాలు ఆడుతున్నారో, ప్రజల కళ్ళకు ఎలా గంతలు కడుతున్నారో, ఎంత చక్కగా మాయమాటలు చెబుతున్నారో అర్థమైంది.

ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను ఎలా దిగజార్చారో వీళ్ళ గొడవ నిరూపించింది. కౌశిక్ రెడ్డి, గాంధీ పత్తిత్తులు ఏమీ కాదు. ఇద్దరూ పార్టీలు మారి బీఆర్ఎస్ లోకి వచ్చినవారే. కాకపొతే గాంధీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కౌశిక్ రెడ్డి చివరగా కాంగ్రెస్ లో ఉండి అప్పట్లో అధికారంలో ఉన్న గులాబీ పార్టీలోకి వచ్చాడు.

గులాబీ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు చేయనంత హడావిడి, రచ్చ కౌశిక్ రెడ్డి చేస్తున్నాడు. ఎన్నికల్లో కూడా ఆయన వీరోచితంగా పోరాడి గెలిచిన నాయకుడు కాదు. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు. ఇప్పుడు మాత్రం పెద్ద లీడర్ మాదిరిగా ఫోజులు కొడుతున్నాడు.

గాంధీతో గొడవలో రెడ్డికి సపోర్టుగా హైదరాబాదు సిటీ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు రావడంలేదు. మరి కౌశిక్ రెడ్డిని పెద్ద లీడర్ గా పరిగణించడంలేదో లేదా మరో ఆలోచన చేస్తున్నారో తెలియదు. ఈ గొడవలో కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని, లోకల్, నాన్ లోకల్ అంశాన్ని కెలికాడు. దాంతో సెటిలర్ల మద్దతు పోతుందని సిటీ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అందుకే వాళ్ళు కల్పించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణలోకి టీడీపీ కూడా మళ్ళీ రంగప్రవేశం చేసే అవకాశం బాబు హింట్ ఇచ్చాడు కాబట్టి అదే జరిగితే సెటిలర్లు అటు మొగ్గే అవకాశం ఉంది. సరే …కౌశిక్ రెడ్డి తాను ఆంధ్ర వాళ్ళను ఏమీ అనలేదని అన్నాడనుకోండి. ఇక కౌశిక్ రెడ్డి, గాంధీ గొడవలో కండువాలు కప్పే విషయం రచ్చకు దారితీసింది. పార్టీ మారడం అంటే ఏమిటి ? జస్ట్ …ఆ పార్టీ కండువా కప్పుకోవడమే ! కేసీఆర్ గత పదేళ్లలో ఇతర పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరికీ కూడా పార్టీ కండువా కప్పలేదని కౌశిక్ రెడ్డి అడ్డంగా అబద్ధం చెప్పాడు.

ఇలా చెప్పడంవల్ల కేసీఆర్ మెచ్చి మేకతోలు కప్పుతాడని అనుకున్నాడో ఏమో. మరి కేసీఆర్ ఏం చేశాడు? ఎగ్జామ్ పెట్టి పాసైతే పార్టీలో చేర్చుకున్నాడా? తనకూ కప్పాడుగా. కేసీఆర్ కాకపొతే కేటీఆర్ కప్పి ఉంటాడు. కౌశిక్ రెడ్డి ఒక్కసారి పాత వీడియోలు చూస్తే, న్యూస్ పేపర్స్ చూస్తే తెలుస్తుంది.

రెడ్డి అబద్దం ఇలా ఉంటే, అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న సామెతలా, గాంధీ కూడా పచ్చి అబద్దం చెప్పాడు. రేవంత్ రెడ్డి తనకు కాంగ్రెస్ కండువా కప్పలేదని, దేవుడి కండువా కప్పాడని చెప్పాడు. ఏ దేవుడో చెప్పలేదు. యాదగిరి నర్సన్న? వేములవాడ రాజన్న? కొండగట్టు అంజన్న? కానీ గాంధీకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పాడు.

ఆ ఫోటో పార్టీ సోషల్ మీడియాలో వచ్చింది. టీవీల్లో, పేపర్స్ లో వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా గాంధీ గులాబీ పార్టీలోనే ఉన్నాడని, అందుకే ఆయన పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని చెప్పాడు. ముగ్గురూ అబద్దాలు చెప్పారు. వీళ్ళు మన నాయకులు అండ్ పాలకులు.

5 Replies to “ఇద్దరు ఎమ్మెల్యేల ‘కండువాల’ రచ్చ !”

Comments are closed.