అల్లు అర్జున్ రాక‌ముందే… ఫైన‌ల్ వార్నింగ్‌!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

హైద‌రాబాద్ సంధ్య థియేట‌ర్ వ‌ద్ద పుష్ప‌-2 బెన్‌ఫిట్ షో సంద‌ర్భంగా తొక్కిస‌లాట‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా ఆ దుర్ఘ‌ట‌న‌లో త‌ప్పు త‌మ‌ది కాద‌ని పోలీసులు, అలాగే హీరో అల్లు అర్జున్ చెబుతున్నారు. పోలీసులు మ‌రో అడుగు ముందుకేసి ఆ రోజు ఏం జ‌రిగిందో వీడియోను కూడా విడుద‌ల చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆ వీడియోతో సంబంధం లేకుండా మ‌రికొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

అస‌లు అల్లు అర్జున్ థియేట‌ర్ వ‌ద్ద‌కు రాక ముందే తొక్కిస‌లాట జ‌రిగింద‌ని, మ‌హిళ మృతి చెందింద‌నే సమాచారాన్ని చేర‌వేసే వీడియోలు వైర‌ల్ కావ‌డంపై హైద‌రాబాద్ సిటీ పోలీసులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ మేర‌కు త‌ప్పుడు వీడియోలు సృష్టించే వారిని సోష‌ల్ మీడియా వేదిక‌గా హెచ్చ‌రిస్తూ ఒక పోస్టు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ పోస్టులోని కీల‌క అంశాల గురించి చ‌ర్చించుకుందాం.

“సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు …. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది.

ఈ ఘటన పై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. ఐనా, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది.

కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం”అని పోస్ట్ చేసింది.

ఒక మ‌హిళ మ‌ర‌ణం, అలాగే ఆమె కుమారుడు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం ప‌క్క‌కు పోయింది. ఇత‌రేత‌ర అంశాలు తెర‌పైకి వ‌చ్చి రాజ‌కీయ టర్న్ తీసుకున్నాయి. దీంతో ఒక ర‌క‌మైన న్యూసెన్స్ క్రియేట్ అయ్యింది. చివ‌రికి అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర కామెంట్స్ చేసే వ‌ర‌కూ వెళ్లింది. ఈ నేప‌థ్యంలో పోలీసుల ప్ర‌క‌ట‌న‌ను ఫైన‌ల్ వార్నింగ్‌గా చూడాల్సి వుంటుంది. ఇక‌పై ఈ ఎపిసోడ్‌కు ముగింపు ప‌ల‌కాలంటే, స‌మ‌స్య‌ను కాలానికి వ‌దిలేయ‌డం మంచిది.

One Reply to “అల్లు అర్జున్ రాక‌ముందే… ఫైన‌ల్ వార్నింగ్‌!”

Comments are closed.