అసలు నేరగాళ్లపై పోలీసుల నజర్!

ప్రచారం చేసిన వారితో ఎవరు మాట్లాడి డీల్ కుదుర్చుకున్నారు? ఎవరు డబ్బులు చెల్లించారు? ఎలా చెల్లించారు?

బెట్టింగ్ యాప్ లకు అనుకూలంగా ప్రచారం నిర్వహించినందుకు సినిమా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద నమోదైన కేసుల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. నిజానికి ఇది కరెక్ట్ టర్న్ అని చెప్పాలి. అలాంటి బెట్టింగ్ యాప్ లను నిర్వహిస్తున్న వారిపై తొలుత కేసులు నమోదు చేసి, వారిని విచారించి ఆ తరువాత ప్రచారం చేసిన వారి వద్దకు రావాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి.. 19 బెట్టింగ్ యాప్ ల మీద కేసులు నమోదు చేశారు.

వీరిలో అయిదు యాప్ ల నిర్వాహకుల్ని ఆల్రెడీ గుర్తించినట్టు తెలుస్తోంది. వారి జాడ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ప్రచారకర్తలుగా పనిచేసిన వారి మీద కేసులు పెట్టడం వల్ల పెద్దగా ఫలితం దక్కేది ఉండదు. వారిని అరెస్టు చేసినా సరే.. బెట్టింగ్ యాప్ లు అనేవి ఆగవు కదా– అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతూ వచ్చింది. ఇప్పుడు పోలీసు దర్యాప్తు సరైన దిశలో సాగుతున్నదని.. అసలు నిర్వాహకులనే పట్టుకోవాలని నిర్ణయించడం మంచి పరిణామం అని పలువురు అంటున్నారు.

బెట్టింగ్ యాప్ లు యువతరాన్ని సర్వనాశనం చేస్తున్నాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. స్వల్పలాభాలను ఎరగా వేసి ఆకట్టుకుంటూ.. ఆశపడుతున్న వారిని నెమ్మదిగా వ్యసనపరులుగా మార్చేసి వారిని అప్పుల ఊబిలోకి దించేసి.. ఆత్మహత్యలు చేసుకునే వరకు ఈ బెట్టింగ్ యాప్ లు ప్రేరేపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలోనే.. ప్రచారకర్తలుగా వ్యవహరించిన యాడ్స్ చేసిన సెలబ్రిటీలకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించారు.

విచారణకు పిలిచిన నటుల్లో ఒకరిద్దరు తప్ప.. అందరూ విచారణలో పోలీసులకు సహకరించారు. తమ ద్వారా తప్పు జరిగిందని, తెలియక తప్పు చేశామని, బెట్టింగ్ యాప్ ల ద్వారా జరిగే నష్టం గురించి తెలిసిన తర్వాత.. వాటి మీద నిషేధం గురించి తెలిసిన తర్వాత అలాంటి పని చేయడం లేదని, చేయబోమని వారిలో చాలా మంది లెంపలు వేసుకున్నారు. అయితే ఒకరిద్దరు మాత్రం.. తాము చేసినది లీగల్ గానే చేసినట్టు.. తమ తమ లీగల్ టీమ్ ల ద్వారా పెడసరపు సమాధానాలు పోలీసులకు ఇప్పించారు.

అదే సమయంలో.. విచారణకు హాజరైన వారు కూడా పోలీసులకు తమ బాధలు చెప్పుకున్నట్లు తెలిసింది. అసలు యాప్ లు నిర్వహిస్తున్న వారిని వదిలేసి.. తెలిసో తెలియకో తప్పు చేసిన తమనే శిక్షించడం కరెక్టు కాదని వారు చెప్పుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వారినుంచే.. యాప్ ల నిర్వాహకుల గురించిన సమాచారాన్ని పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.

ప్రచారం చేసిన వారితో ఎవరు మాట్లాడి డీల్ కుదుర్చుకున్నారు? ఎవరు డబ్బులు చెల్లించారు? ఎలా చెల్లించారు? అంతా వైట్ లో చెల్లించారా? హవాలా వ్యవహారాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? లాంటి వివరాలు సేకరించి.. ముందుగా యాప్ నిర్వాహకుల మీద కేసులు నమోదు చేసి ఆ తర్వాత మళ్లీ వీళ్ల సంగతి చూడాలని ప్లాన్ చేస్తున్నారు. యాప్ నిర్వాహకులనే గనుక పోలీసులు పట్టుకోగలిగితే.. అప్పుడు నిజంగానే బెట్టింగ్ యాప్ ల ఉధృతికి కొంత మేరకైనా బ్రేకులు పడతాయని ప్రజలు అనుకుంటున్నారు.