Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఆటోనగర్‌ సూర్య

సినిమా రివ్యూ: ఆటోనగర్‌ సూర్య

రివ్యూ: ఆటోనగర్‌ సూర్య
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌
తారాగణం: నాగ చైతన్య, సమంత, సాయికుమార్‌, మధు, జయప్రకాష్‌ రెడ్డి, బ్రహ్మానందం, అజయ్‌ తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ సరోజ్‌
నిర్మాత: అచ్చిరెడ్డి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా
విడుదల తేదీ: జూన్‌ 27, 2014

షూటింగ్‌ దశలో చాలా ఇబ్బందులు పడి, విడుదల కోసం నానా తంటాలు పడి.. ఎట్టకేలకు విడుదలైన ‘ఆటోనగర్‌ సూర్య’ ఇంతకాలం పడ్డ కష్టానికి తగ్గ సినిమాయేనా? వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దేవా కట్టా తనపై సినీ ప్రియులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? యాక్షన్‌ సినిమాలతో తడబడుతోన్న నాగ చైతన్య ఈసారైనా గాడిన పడ్డాడా?

కథేంటి?

చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న సూర్య (నాగ చైతన్య) ఆటోనగర్‌లో మెకానిక్‌గా జీవనం సాగిస్తాడు. అతడి స్నేహితుడిని ఒక రౌడీ అన్యాయంగా చంపేస్తే... అతడిని చంపి టీనేజ్‌లోనే జైలుకెళతాడు సూర్య. జైలు నుంచి తిరిగొచ్చి బాధ్యతాయుతంగా జీవితం సాగించాలని చూస్తే రౌడీ వ్యవస్థలో అడుగడుగునా అతనికి ఎవరో ఒకరు అడ్డు తగుల్తారు. దానికి సూర్య ఎలాంటి సమాధానం ఇస్తాడు? తన సమస్యని ఎలా పరిష్కరించుకుంటాడు?

కళాకారుల పనితీరు:

నాగచైతన్య తన శక్తి మేర కృషి చేసి సూర్య పాత్రకి న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని సీన్స్‌లో చక్కగా పర్‌ఫార్మ్‌ చేసాడు కూడా. అయితే తన వయసుకి మించిన పాత్రని చేస్తున్నాడనే ఫీలింగ్‌ అయితే దూరం చేయలేకపోయాడు. డైలాగ్‌ డెలివరీ పరంగా కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. మరీ లెంగ్తీ డైలాగులు ఇవ్వడం కూడా అతడిని ఇబ్బంది పెట్టినట్టుంది. సమంత కాంబినేషన్‌లో చేసిన సీన్స్‌లో అతనికి ఉన్న కంఫర్ట్‌ లెవల్స్‌ చూస్తే రొమాంటిక్‌ సినిమాలు ప్రస్తుతం తన జోన్‌ అనేది స్పష్టమవుతుంది. 

సమంతకి నటించడానికి స్కోప్‌ లేదు. ఉన్నంతలో బాగానే చేసింది. ద్వితీయార్థంలో అయితే ఆమె పాత్రకి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. మామూలుగా కోట లేదా ప్రకాష్‌రాజ్‌ చేసే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రోల్‌ సాయికుమార్‌ చేసాడు. అతని నటన బాగుంది. రుతురాగాలు ఫేమ్‌ మధు విలన్‌గా మెప్పించాడు. జయప్రకాష్‌రెడ్డి, అజయ్‌, జీవా తదితరులు తమకి అలవాటైన పాత్రలు పోషించారు. హీరో స్నేహితుడి పాత్రలో నందుకి ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ దక్కింది. నటీనటులంతా తమవంతు న్యాయం చేసారు. అయితే బ్రహ్మానందం, వేణుమాధవ్‌ ట్రాక్‌ మాత్రం నవ్వించలేకపోయింది. 

సాంకేతిక వర్గం పనితీరు:

అనూప్‌ రూబెన్స్‌ పాటలు సోసోగా ఉన్నాయి. మంచలీ తప్ప మిగతావి అంతగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. 1990ల నాటి కాలాన్ని ప్రతిబింబించేలా సినిమాటోగ్రాఫర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ జాగ్రత్తలు తీసుకున్నారు. సాంకేతికంగా ఈ చిత్రం గొప్పగా లేకున్నా డీసెంట్‌ ప్రోడక్ట్‌ అనిపిస్తుంది. దేవా కట్టా దర్శకుడిగా కంటే సంభాషణల రచయితగా రాణించాడు. జీవిత సారాన్ని, వేదాంతాన్ని డైలాగుల్లో రాసే దేవా కట్టా కొన్ని మంచి డైలాగ్స్‌ రాసాడు. అయితే డైలాగులు మరీ సగటు సినీ ప్రేక్షకుడి మేథస్సుకి అందని రేంజ్‌లో ఉన్నాయి. పైగా చాలా వరకు లెంగ్తీ అయిపోయాయి. సాహితీ ప్రియులకి దేవా కట్టా సంభాషణలు నచ్చుతాయి. దర్శకుడిగా అక్కడక్కడా మెరుపులు చూపించాడు కానీ కథ, కథనాల పరంగా చేసిన పొరపాట్ల వల్ల ప్రస్థానం చిత్రం స్థాయిలో రాణించలేకపోయాడు. 

హైలైట్స్‌:

  • సంభాషణలు
  • ఇంటర్వెల్‌ ముందు పదిహేను నిముషాలు

డ్రాబ్యాక్స్‌:

  • కథనం
  • భారంగా కదిలే ద్వితీయార్థం

విశ్లేషణ:

రౌడీయిజం రాజ్యమేలుతోన్న రోజుల్లో (1980-90ల కాలం) ఈ కథని సెట్‌ చేసారు. ఇప్పటి రోజుల్లో ఇలాంటి రౌడీయిజం లేదు కాబట్టి తన కథకి నేపథ్యంగా దేవా కట్టా ఆ టైమ్‌ పీరియడ్‌ ఎంచుకున్నాడు. కథా నేపథ్యం ఏదైనా కానీ దానిని చెప్పే విధానం ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే ఉండాలని విస్మరించాడు. తాను ఎంచుకున్న కాలమానానికి తగ్గట్టే తన కథనం కూడా రాసుకున్నాడు. దాంతో 90ల నాటి సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. 

సీన్‌కీ, సీన్‌కీ మధ్య లింక్‌ లేకుండా కథనం ముందుకు సాగుతుంటుంది. కథకి అవసరం లేని కామెడీ ట్రాక్‌ ఒకటి అడ్డు తగులుతూ ఉండగా... కొన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా, మరికొన్ని ఏమో నీరసం పుట్టించేలా సాగుతూ సినిమాపై పూర్తి ఆసక్తి కలగనివ్వవు. ఫస్టాఫ్‌లో సమంత, చైతన్య మధ్య నడిచే సన్నివేశాలు, యూనియన్‌ మీటింగ్‌లో జరిగే సీన్‌ ఆకట్టుకుంటాయి. 

అసలు నిలబెట్టాల్సినదంతా ద్వితీయార్థంలోనే ఉండగా... ఈ పార్ట్‌లో డైరెక్టర్‌ కంప్లీట్‌గా ట్రాక్‌ తప్పాడు. సూర్య ఎదుగుదలకి సంబంధించిన సన్నివేశాలు ఏమాత్రం ఇంప్రెస్‌ చేయవు. రౌడీలకి, హీరోకి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఏదో రెండున్నర గంటలకి సరిపడా స్టఫ్‌ ఏదొకటి ఉండాలన్నట్టుగా తీసినట్టనిపిస్తాయి కానీ ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతిని కలిగించవు. పతాక సన్నివేశాల్లో అయినా జోరందుకుంటుందని అనుకుంటే అదీ జరగదు. ఎమోషన్స్‌ పండించాలని చూసినా అది కూడా బలవంతంగా తెచ్చి పెట్టినట్టే అనిపిస్తుంది తప్ప ఏ విధంగాను కదిలించవు. 

బోటమ్‌ లైన్‌: సూర్య గ్రహణం!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?