Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: చందమామ కథలు

సినిమా రివ్యూ: చందమామ కథలు

రివ్యూ: చందమామ కథలు
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్‌
తారాగణం: నరేష్‌, ఆమని, లక్ష్మి మంచు, కిషోర్‌, చైతన్య కృష్ణ, కృష్ణుడు, రిచా పనాయ్‌, షామిలి తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
కూర్పు: ధర్మేంద్ర
ఛాయాగ్రహణం: సురేష్‌ ఆర్‌.
నిర్మాత: బి. చాణక్య
రచన, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు
విడుదల తేదీ: ఏప్రిల్‌ 25, 2014

కొత్తతరం దర్శకుల్లో రొటీన్‌కి భిన్నమైన సినిమాలు తీయాలని ప్రయత్నించే వాళ్లలో ప్రవీణ్‌ సత్తారు ఒకడు. ‘ఎల్‌బిడబ్ల్యూ’ అనే చిన్న సినిమాని తనకున్న వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన ప్రవీణ్‌ ఆ తర్వాత రొటీన్‌ లవ్‌స్టోరీలో కూడా రొటీన్‌ పోకడల్ని విడిచిపెట్టాడు. అతడు చెప్పిన ఈ చందమామ కథలు ఎలా ఉన్నాయో చూద్దాం...

కథేంటి?

ఒక రచయిత తాను నిత్యం తన జీవితంలో చూసే పాత్రలతోనే ఒక కథ రాస్తాడు. ఆ కథలు అతను రాస్తుండగా ఆ పాత్రలు, సన్నివేశాలు ఈ సినిమా రూపంలో మనకి కనిపిస్తాయి. ఒక భిక్షగాడికి ఒక ఇల్లు కొనుక్కోవాలనే కల. యవ్వనంలో విడిపోయి అయిదు పదుల వయసు దాటిపోయాక తిరిగి కలిసిన జంట. టీనేజ్‌లోనే ఊరి కట్టుబాట్ల కోసం పెళ్లి చేసుకున్న మరో జంట. అడ్డదారిలో అందలం ఎక్కాలని చూసే ఒక యువకుడు. ప్రేమించిన వాడిని కాదని విదేశాల్లో సెటిలవ్వాలనే దురాశతో జీవితం కోల్పోయిన ఒక యువతి. లైఫ్‌లో ఎన్నో చూసి తర్వాత పతనమయ్యాక జీవితాన్ని ఎలా సాగించాలో తెలియక అయోమయంలో ఉన్న మోడల్‌. ముప్పయ్యేళ్లు వస్తున్నా పిల్ల దొరక్క పెళ్లి కోసం అవస్థలు పడుతున్న ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఈ కథలన్నీ సృష్టించి.. తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలో తెలియని దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న రైటర్‌. 

కళాకారుల పనితీరు!

వివిధ కథల సమాహారం కాబట్టి ఎవరికీ పెద్ద పాత్రలు దక్కలేదు. మంచు లక్ష్మి మోడల్‌ పాత్రలో ఫర్వాలేదనిపించింది. ఈ పాత్ర తాలూకు మానసిక సంఘర్షణని దర్శకుడు సరిగా తెరకెక్కించకపోవడంతో లక్ష్మికి అంతగా స్కోప్‌ దక్కలేదు. నరేష్‌, ఆమని ఏజ్డ్‌ పెయిర్‌గా బాగానే నటించారు. కృష్ణుడు షరా మామూలే. రచయితగా కిషోర్‌ నటన బాగుంది. చైతన్య కృష్ణ తన పాత్రలోని ట్రాన్స్‌ఫర్మేషన్‌ బాగా చూపించాడు. ఎవరికీ గుర్తుండిపోయే పాత్రలైతే లేవు కానీ ఉన్నంతలో అందరూ తమవంతు చేయగలిగింది చేసారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

మిక్కీ జె. మేయర్‌ మరోసారి తన పాత బాణీలనే వినిపించాడు. నేపథ్య సంగీతం కూడా అతని గత చిత్రాలనే తలపించింది. ఏమాత్రం వెరైటీకి ప్రయత్నించని మిక్కీ కంపోజిషన్స్‌ ఈజీగా క్యాచ్‌ చేయవచ్చు. మ్యూజిక్‌ విని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరో చెప్పేస్తున్నారంటే అది తన ట్రేడ్‌ మార్క్‌ అనుకోకుండా వీక్‌నెస్‌ అని మిక్కీ గ్రహించాలి. ఛాయాగ్రహణం, కూర్పు బాగున్నాయి. ఇన్ని కథలున్నా కానీ నిడివి తక్కువ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. అయితే కొన్ని అవసరమైన విషయాలు కూడా ఎక్స్‌ప్లెయిన్‌ చేయకుండా స్కిప్‌ చేసేసారు. 

దర్శకుడు ప్రవీణ్‌కి కొత్తగా చేయాలనే తపన ఉంది. అయితే తన పేరు గుర్తుండిపోయేలా ఒక అద్భుతమైన సినిమాని మాత్రం అతను తీయలేకపోతున్నాడు. ‘చందమామ కథలు’కి మంచి సినిమా కాగల పొటెన్షియల్‌ ఉంది కానీ అందుకు తగ్గ ఎఫర్ట్స్‌ స్క్రిప్ట్‌పై పెట్టినట్టు కనిపించలేదు. ఇన్ని కథలు రాసుకున్నప్పుడు, జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలని ఎంచుకున్నప్పుడు అవి హృద్యంగా ఉండాలి. కానీ వీటిలో ఏవీ కూడా ఆసక్తి కలిగించవు. వాటి గమ్యం ఎటుపోయినా కదిలించవు. అంటే దర్శకుడు ఫెయిలైనట్టే. 

హైలైట్స్‌:

  • కాన్సెప్ట్‌

డ్రాబ్యాక్స్‌:

  • ఎగ్జిక్యూషన్‌

విశ్లేషణ:

‘వేదం’ సినిమాలో ఇలాగే కొన్ని కథలన్నీ కలిసి ఒకే మజిలీకి చేరుకోవడమనేది చూసాం. ఆ చిత్రంలో క్రిష్‌ కొన్ని మరపురాని సన్నివేశాలని తెరకెక్కించాడు. ఆ పాత్రలు చిరకాలం గుర్తుండిపోయేలా ముద్రించాడు. ప్రవీణ్‌ తన కథల్ని అంత బలంగా చెప్పలేకపోయాడు. తన పాత్రలకి అంతటి జీవాన్ని ఇవ్వలేకపోయాడు. ఈ సినిమాలో రచయిత ఫెయిలయ్యాడంటే... ‘ఇలాంటి కథలు రాస్తే ఫెయిలవడా?’ అనిపించేలా దర్శకుడు తన కథలు రాసుకున్నాడు. 

కాన్సెప్ట్‌లో కొత్తదనం ఉన్నా కానీ ఆ కథల్లో మాత్రం కొత్తదనం లేదు. కాంటెంపరరీ విషయాలు కొన్ని టచ్‌ చేసాడు కానీ కన్విన్సింగ్‌గా తీయలేకపోయాడు. ఈ కథలు, ఆ పాత్రలు ఏమైపోతాయో... వాటి గమ్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఏ క్షణంలోను కలగదు. ఆ పాత్రల జీవితం ఎలా ఎండ్‌ అయినా, వారికి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కానీ కించిత్‌ బాధ అనిపించదు. దర్శకత్వంలో బలం లోపించింది అనడానికి ఇంతకంటే రుజువులు అక్కర్లేదు. 

నమ్మశక్యం కాకుండా ఉన్నా కానీ అంతో ఇంతో ఆసక్తిగొలిపింది మాత్రం భిక్షగాడి కథ ఒక్కటే. అతని కథ కంచికి చేరేటప్పుడే కాస్తో కూస్తో ఉత్కంఠ అనిపిస్తుంది. మిగిలిన కథలన్నీ అసందర్భంగా, అమాంతంగా మజిలీకి చేరిపోతాయి. వాటిలో కొన్ని లాజిక్‌కి కూడా అంతు చిక్కవు. ప్రయత్నం మంచిదే అయినా ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగించడంలో చందమామ కథలు విఫలమైంది. మరీ ఎనిమిది కథలు కాకుండా కొన్నిటిని తగ్గించుకుని వాటికే కాస్త ఎక్కువ సమయం కేటాయించి ఆకట్టుకునేలా తీర్చి దిద్దడానికి, హత్తుకునేలా ముగించడానికి ప్రయత్నించాల్సింది. 

చందమామ కథలు చూసేసి వస్తే... ఒక పుస్తకాన్ని అసంపూర్ణంగా మధ్యలో ఆపేసినట్టో.. లేదా ఏమాత్రం ఆసక్తి కలిగించని ఒక సాధారణ కథని బలవంతంగా చదివినట్టో అనిపిస్తుంది తప్ప ‘జీవితాన్ని చూసా’మనే భావన మాత్రం కలగదు. దర్శకుడు ‘లైఫ్‌’ని చూపించాలని ఈ ప్రయత్నం చేసినపుడు... అదే చూపించలేకపోవడం వైఫల్యమే. ఇక దానికి తోడు ఈ సినిమాకి రాసుకున్న క్లయిమాక్స్‌ అయితే వాస్తవాతీతంగా... ఈ సినిమా థీమ్‌కి దూరంగా ఉంది. ఇన్ని బలహీనతలతో చందమామ కథలు ఆకట్టుకోవడం కష్టమైన విషయమే! 

బోటమ్‌ లైన్‌: కాకమ్మ కథలు!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?