Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గుంటూర్‌ టాకీస్‌

సినిమా రివ్యూ: గుంటూర్‌ టాకీస్‌

రివ్యూ: గుంటూర్‌ టాకీస్‌
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: ఆర్‌.కె. స్టూడియోస్‌
తారాగణం: నరేష్‌, సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్‌, శ్రద్ధా దాస్‌, మహేష్‌ మంజ్రేకర్‌, రాజా రవీంద్ర, రఘుబాబు తదితరులు
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి
నిర్మాత: రాజ్‌కుమార్‌ .ఎం
రచన, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు
విడుదల తేదీ: మార్చి 4, 2016

తెలుగు సినిమాల్లో 'అడల్ట్‌ సర్టిఫికేషన్‌' ఇచ్చారంటే మితిమీరిన హింసకి మించిన కారణాలేం కనిపించవు. అచ్చమైన అడల్ట్‌ సినిమాలు తెలుగు మెయిన్‌ స్ట్రీమ్‌లో చాలా చాలా అరుదు. ఆ విధంగా 'గుంటూర్‌ టాకీస్‌' కొత్త ట్రెండ్‌ని స్టార్ట్‌ చేసిందనుకోవచ్చు. మన దర్శకులు పరుష పదజాలం జోలికి పోరు. విశృంఖలత్వాన్ని హైలైట్‌ చేసే సాహసం అస్సలే చేయరు. సినిమాలు చూసేదే తక్కువ శాతం అన్నప్పుడు ఇక వారిలోను అత్యంత తక్కువ మందికి అప్పీల్‌ అయ్యే సినిమాలు చేయడానికి ఎవరిష్టపడతారు?

ప్రవీణ్‌ సత్తారు మాత్రం పూర్తిస్థాయి అడల్ట్‌ సినిమా చేసే ధైర్యం చేసాడు. 'పిల్లల్ని, సెన్సిటివ్‌ జనాలని' తన సినిమాకి దూరంగా ఉండమని చెప్పాడు. రూల్స్‌ని బ్రేక్‌ చేయడానికి వెనకాడని అతని మనస్తత్వాన్ని మెచ్చుకుని తీరాలి. సినిమా అంటే ఇలాగే ఉండాలి అనే భ్రమలని తొలగించేందుకు గీత దాటడానికి వెనుదీయని అతని ధైర్యాన్ని ప్రశంసించాలి. ప్రతివారం వచ్చే తెలుగు సినిమాలన్నిటినీ ఒక చోట పేరిస్తే, వాటిలో తప్పకుండా 'గుంటూర్‌ టాకీస్‌' ప్రత్యేకంగా కనిపిస్తుంది. 

ఇంత రస్టిక్‌గా, ఇంత నేచురల్‌గా పరిస్థితులని, పాత్రలని తెరపైకి తేవడం కనిపించినంత సులువైతే కానే కాదు. పక్కింటి ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు హీరో (సిద్ధు). అదే ఆంటీ చెల్లెలిని (రష్మి) అటకాయిస్తూ, ఆమె కనిపించిన ప్రతిసారీ లైంగిక దాడికి పాల్పడుతుంటాడు. అతడిని అసలు హీరో అనాలా? అతడికో కొలీగ్‌ (నరేష్‌). అతని భార్య వేరే వాడితో వెళ్లిపోతుంది. భార్యని 'మిస్‌' అయినపుడల్లా బాత్రూమ్‌లోకి వెళ్లి బూతు కథల పుస్తకం చదువుతూ 'సంతృప్తి' పొందుతుంటాడు. సినిమాటిక్‌ లాంగ్వేజ్‌ మాట్లాడుకుంటే ఈ కథలో ఇతనూ హీరోనే. ఇలాంటి లక్షణాలున్న హీరోలు రెగ్యులర్‌గా మన తెలుగు సినిమాల్లో కనిపించరుగా? ఓ లేడీ డాన్‌ (శ్రద్ధ) మన యంగ్‌ హీరోని అదే పనిగా తన కామవాంఛ తీర్చుకోవడానికి వాడుకుంటూ ఉంటుంది. ఇటువంటి నింఫోమేనియాక్‌ క్యారెక్టర్‌ని తెలుగు సినిమాలో ఊహించగలమా? మెడికల్‌ షాప్‌లో అయిదు వేల లోపు జీతానికి పని చేసే హీరోలు అది చాలక రాత్రి పూట చిల్లర దొంగతనాలు చేస్తుంటారు. ఎప్పుడూ పెద్ద దొంగతనాల జోలికి పోని వాళ్లిద్దరూ ఒకసారి నియమం తప్పుతారు. అంతే వారి జీవితాలు తారుమారౌతాయి.

హీరోలుండే ఇళ్ల దగ్గర్నుంచి, వాళ్లు వేసే బట్టల వరకు అన్ని విషయాల్లోను డీటెయిలింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంది. అచ్చంగా స్లమ్‌లోని క్యారెక్టర్లని తెరపై చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ప్లాట్‌ దగ్గర్నుంచి ప్రొడక్షన్‌ డిజైన్‌ వరకు, కాస్టింగ్‌ దగ్గర్నుంచి కాస్టూమ్స్‌ వరకు అన్నీ సరిగ్గా కుదిరాయి కానీ కథ, కథనాలే ఎంగేజింగ్‌గా లేవు. చాలా లేజీగా సాగే ఫస్ట్‌ హాఫ్‌లో షాకింగ్‌ ఎలిమెంట్స్‌ అయితే ఉన్నాయి కానీ సినిమాలో ఇన్‌వాల్వ్‌ చేసే అంశాలేం ఉండవు. ఇంటర్వెల్‌ నుంచే కథ ట్రాక్‌ ఎక్కుతుంది. ఒక్కసారి డబ్బుతో హీరోలిద్దరూ పారిపోయాక వివిధ రూపాల్లో వారిని గతం వెంటాడుతూ వస్తుంది. ఈ ప్రాసెస్‌లో కొన్ని సీన్స్‌ ఫన్నీగా అనిపిస్తాయి. ఓవర్‌ ది టాప్‌ అనిపించినా కానీ నవ్వించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కానీ బ్యాలెన్స్‌ పాటించడంలో ఫెయిలవడం వల్ల కొంత సేపటికి మొత్తం సిల్లీగా తయారవుతుంది. క్లయిమాక్స్‌కి వచ్చేసరికి అలరించడానికి బాగా గట్టిగా ప్రయత్నిస్తున్న భావన కలుగుతుంది. 

బి గ్రేడ్‌ సినిమా అంటూ ఈజీగా బ్రాండ్‌ చేసేస్తారని తెలిసినా కానీ ఇలాంటి సంచలనాత్మక చిత్రాన్ని తలపెట్టిన దర్శకుడు బేసిక్స్‌ మీద కూడా శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. ముఖ్యంగా కథనం ప్రేక్షకుల్ని ఎంగేజ్‌ చేసే విధంగా రాసుకున్నట్టయితే ఇంతటి బోల్డ్‌ ఎటెంప్ట్‌కి కంప్లీట్‌ జస్టిస్‌ జరిగేది. సినిమా చాలా సహజంగా అనిపించడంలో సినిమాటోగ్రాఫర్‌ పాత్ర చాలా ఉంది. అలాగే సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. 

నటీనటుల్లో నరేష్‌కి అగ్రతాంబూలం దక్కుతుంది. బాలీవుడ్‌లో ఇలాంటి పాత్రల్ని అవలీలగా పోషించే పరేష్‌ రావల్‌ని తలపించాడు. చక్కని హావభావాలతో తాను కాకుండా తను పోషించిన గిరి పాత్ర మాత్రమే కనిపించేట్టు చేసాడు. సిద్ధు కూడా తన పాత్రకి తగ్గ వేషధారణ, బాడీలాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. రష్మిని చాలా  హాట్‌గా చూపించారు. మాటలు తక్కువైనా కానీ తన ప్రెజెన్స్‌ తెలిసేట్టు చేసింది. శ్రద్ధాదాస్‌ లేడీ డాన్‌ పాత్రకి సూట్‌ అయింది. మహేష్‌ మంజ్రేకర్‌, ఫిష్‌ వెంకట్‌, రాజా రవీంద్ర ఇలా ముఖ్య తారాగణమంతా తమ పాత్రలకి న్యాయం చేయడంతో 'గుంటూర్‌ టాకీస్‌' ఒకింత ఎంటర్‌టైన్‌ చేయగలిగింది. మరీ లిమిటెడ్‌ అప్పీల్‌ ఉన్న కంటెంట్‌ అండ్‌ ఎగ్జిక్యూషన్‌ కావడం వల్ల ఇది ఎలా ఫేర్‌ చేస్తుందనేది ఆసక్తికరమే. కమర్షియల్‌గా ఇలాంటి సినిమాలకి పొటెన్షియల్‌ ఉందని తెలిస్తే 'ఢిల్లీ బెల్లీ' బేస్‌ చేసుకుని ఆ తరహా అడల్ట్‌ క్రైమ్‌ కామెడీలు మరిన్ని వస్తాయి. 

బోటమ్‌ లైన్‌: డేరింగ్‌ అటెంప్ట్‌!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?