Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: హృదయ కాలేయం

సినిమా రివ్యూ: హృదయ కాలేయం

రివ్యూ: హృదయ కాలేయం
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: అమృతా ప్రొడక్షన్స్‌, వి.ఎస్‌.ఎస్‌. క్రియేషన్స్‌
తారాగణం: సంపూర్ణేష్‌ బాబు, కావ్యా కుమార్‌, ఇషికా సింగ్‌ తదితరులు
సంగీతం: ఆర్‌.కె.
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: చిరంజీవి
రచన, నిర్మాత, దర్శకత్వం: స్టీవెన్‌ శంకర్‌ (సాయి రాజేష్‌)
విడుదల తేదీ: ఏప్రిల్‌ 4, 2014

శామ్‌ ఆండర్‌సన్‌, ‘పవర్‌స్టార్‌’ శ్రీనివాసన్‌ లాంటి వాళ్లు తమిళనాడులో చాలా పాపులర్‌ అయ్యారు. హీరో ఫీచర్స్‌ అస్సలు లేకపోయినా కానీ వారు చేసే విన్యాసాలు ఆడియన్స్‌ని విపరీతంగా నవ్విస్తుంటాయి. అలాంటి ఓ ‘కామెడీ పీస్‌’ని కనుగొన్నాడు హృదయ కాలేయం దర్శకుడు స్టీవెన్‌ శంకర్‌. అతనే సంపూర్ణేష్‌ బాబు. సింగిల్‌ స్టిల్‌తో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్స్‌లో సూపర్‌ పాపులర్‌ అయిపోయాడు. బహుశా సంపూకి ఇంత పాపులారిటీ వస్తుందని ఈ చిత్ర దర్శకుడు... ఆ ‘హీరో’ కూడా ఊహించి ఉండరు. కమర్షియల్‌ సినిమాల్లో ఉండే అతిశయాలని మరో లెవల్‌కి తీసుకెళ్లి ‘అన్‌ఇన్‌టెన్షనల్‌ ఫన్‌’ రాబట్టడం అనేది ఈ చిత్ర దర్శకుడి టార్గెట్‌. ఇందుకోసం స్టీవెన్‌ శంకర్‌ ఎంత అతిని చూపించవచ్చో అంతా చూపించేసాడు... ఏ స్థాయికి  వెటకారం చేయవచ్చో ఆ స్థాయిని దాటిపోయాడు. అయితే ఇది ఏ సినిమాకీ స్పూఫ్‌ కాకపోవడం విశేషం. 

కథేంటి?

నగరంలో కలకలం సృష్టిస్తున్న దొంగ సంపూర్ణేష్‌బాబు అలియాస్‌ సంపూ (సంపూర్ణేష్‌ బాబు) కారణంగా పోలీసులకి కంటి మీద కునుకు దూరం అవుతుంది. అతడిని పట్టుకోవడానికి విఫలయత్నం చేసి ఫైనల్‌గా అతని ఆచూకీ తెలుసుకుని రౌండప్‌ చేస్తారు. అప్పుడే సంపూ గురించి వారికో షాకింగ్‌ న్యూస్‌ తెలుస్తుంది. అదేంటి? 

కళాకారుల పనితీరు!

ముందే చెప్పుకున్నట్టు సంపూర్ణేష్‌ బాబు ఒక మంచి ‘కామెడీ పీస్‌’. చూడ్డానికి పొట్టిగా, వింత తలకట్టుతో విచిత్రంగా ఉన్నా.. ‘ఎవరు నువ్వు?’ అని అడిగితే మెడపై చెయ్యి పెట్టి రుద్దుకుంటూ ‘హీరో’ అంటాడు. అతడిని చూస్తేనే చాలా మందికి ఆటోమేటిగ్గా నవ్వు వచ్చేస్తుంది. అతను హీరోనంటూ పంచ్‌ డైలాగులు చెబుతుంటే, పిచ్చి డాన్సులు వేస్తుంటే, మాస్‌ ఫైటింగులు చేస్తుంటే కామెడీ దానంతట అదే పుట్టుకొస్తుంది. సెంటిమెంట్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో అతని ఎక్స్‌ప్రెషన్స్‌ హైలైట్‌ అయ్యాయి. సెంటిమెంట్‌ సీన్‌ అయినా, హైలీ ఎమోషనల్‌ సీన్‌ అయినా కానీ కామెడీ పుట్టిందంటే అందుకు సంపూనే కారణం. అయితే ఈ ఇన్‌స్టంట్‌ పాపులారిటీని ఎంత కాలం స్ట్రెచ్‌ చేసుకోగలడనేది అతని చేతుల్లోనే ఉంది. ఇలాగే కంటిన్యూ అయితే త్వరగా బోర్‌ కొట్టేసే ప్రమాదం ఉంది కాబట్టి సంపూర్ణేష్‌ చాలా జాగ్రత్తగా తన నెక్స్‌ట్‌ స్టెప్స్‌ వేయాలి.     

సంపూర్ణేష్‌ ఒక్కడే బ్యాడ్‌ యాక్టింగ్‌పై డిపెండ్‌ అయి ఉంటే బాగుండేదనిపించింది. ఈ చిత్రంలోని నటీనటులు అందరూ కూడా ఓవరాక్షన్‌ని ఆశ్రయించారు. వారు నవ్వించకపోగా ఇరిటేట్‌ చేసారు. వారిలో హీరోయిన్‌ కావ్య నటన వర్ణనాతీతం. పోలీస్‌ పాత్ర చేసిన ఆ పొట్టి వ్యక్తి కూడా దారుణంగా హింసించాడు. 

సాంకేతిక వర్గం పనితీరు:

టైటిల్‌ సాంగ్‌ మినహా మిగతావేమీ బాలేదు. అయితే వాటి చిత్రీకరణలో మాత్రం దర్శకుడు తన చాతుర్యం చూపించాడు. అతిశయానికి అవకాశం ఉన్న ఏ ఒక్క ఫ్రేమ్‌ని దర్శకుడు విడిచిపెట్టలేదు. అతి తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమా అయినా కానీ సినిమాటోగ్రాఫర్‌ మంచి అవుట్‌పుట్‌ ఇచ్చాడు. సాంకేతికంగా ఈ చిత్రం గొప్పగా ఉందని అనకూడదు, ఉంటుందని అనుకోకూడదు. టీవీ సీరియల్‌, షార్ట్‌ ఫిలింస్‌ స్టాండర్డ్స్‌లోనే టెక్నికల్‌ యాస్పెక్ట్స్‌ ఉన్నాయి.

డైరెక్టర్‌ స్టీవెన్‌ శంకర్‌ (సాయి రాజేష్‌) వెటకారం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. అతనిలో వెటకారం పాళ్లు ఎంత హై లెవల్లో ఉంటే అతను ఇలాంటి సీన్లు రాసి మెప్పించగలడు అనిపిస్తుంది. సంభాషణల్లో చాలా వరకు సినిమా జోనర్‌కి తగ్గట్టుగా ఉంటూ అలరిస్తాయి. ఈ చిత్రానికి మెయిన్‌ ఎస్సెట్‌ సాయి రాజేష్‌ డైలాగ్స్‌. సంపూర్ణేష్‌తో తనకి కావాల్సినట్టుగా చేయించుకుంటూ... అతనిలోని ఆ విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌ని క్యాప్చర్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రథమార్థంలో కామెడీ బాగా పండించిన దర్శకుడు ద్వితీయార్థంలో మాత్రం శృతి మించిపోయాడు. 

హైలైట్స్‌:

  • సంపూర్ణేష్‌ 
  • డైలాగ్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • సెకండాఫ్‌ మరీ ఓవర్‌ అయింది
  • క్లయిమాక్స్‌ పీక్స్‌కి వెళ్లిపోయింది

విశ్లేషణ:

‘హృదయ కాలేయం’ అందరికీ నచ్చే సినిమా కాదు. దీని గురించి ఎలాంటి ఐడియా లేకుండా ఒక రెగ్యులర్‌ కామెడీ సినిమా చూడబోతున్నామంటూ వచ్చి కూర్చుంటే నిరాశ తప్పదు. ఈ సినిమాకి వెళ్లే ముందు కాస్త ‘ప్రిపరేషన్‌’ అవసరం. ఇది ఎలాంటి సినిమా, ఈ హీరో ఎవరు.. అనే వాటిపై కాస్త అవగాహన ఉండాలి. లేదంటే తెరపై ఆ ‘కామెడీ పీస్‌’ కనిపించగానే థియేటర్లో వినిపించే నవ్వులకి, అతను చెప్పే డైలాగులకి జరుగుతున్న హంగామాకీ కారణం ఏమిటో అర్థం కాక తెల్లమొహం వేయాల్సి వస్తుంది. 

‘హృదయ కాలేయం’ కాన్సెప్ట్‌, సంపూర్ణేష్‌ అనే యాక్టర్‌... సినిమా విడుదల కాకముందే సోషల్‌ నెటవర్క్‌లో సూపర్‌హిట్‌. అందుకే మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి మొదటి రోజే అంత సందడి నెలకొంది. ఈ సినిమాని ఎంజాయ్‌ చేయాలంటే ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటంటే... ఈ సినిమాని, హీరోని సీరియస్‌గా తీసుకోకూడదు. అలా తీసుకున్నట్టయితే ‘ఛీ ఛీ’ అనిపించి చివరి వరకు కూర్చోవడం కూడా కష్టమే. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌తో అసలు టచ్‌ లేని వారు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది ఆసక్తికరం. 

అయితే ఈ చిత్రాన్ని ఏ టార్గెట్‌తో అయితే తెరకెక్కించారో దానిని మాత్రం అఛీవ్‌ చేశారు. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక కొత్త జోనర్‌ పరిచయం అయింది. అయితే ఈ జోనర్‌ని హ్యాండిల్‌ చేయడం కనిపించినంత ఈజీ కాదు. హృదయ కాలేయం సినిమాకి పడ్డ బేస్‌ అన్ని చిత్రాలకీ వస్తుందని గ్యారెంటీ లేదు. దర్శకుడు సాయి రాజేష్‌ చాలా పెద్ద రిస్కే చేసాడు. లక్కీగా అది వర్కవుట్‌ అయింది. కాకపోతే ద్వితీయార్థంలో మరీ అవధులు దాటిపోయాడు దర్శకుడు. 

ఆకు పసరలతో కంప్యూటర్‌ తయారు చేయడం, ఆ కృత్రిమ గుండె తయారు చేసే ప్రహసనం, చివర్లో చితిలోంచి లేచి వచ్చే సన్నివేశం... ఫస్టాఫ్‌లో చూపించిన బ్యాలెన్స్‌ని సెకండాఫ్‌లో పూర్తిగా కోల్పోయారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఫస్టాఫ్‌లో మాటలు, చేష్టలు అతిగా ఉన్నా కానీ కామెడీ బ్రహ్మాండంగా పండింది. కానీ ద్వితీయార్థానికి వచ్చే సరికి నవ్వించడానికి అవధులు దాటిపోయి డెస్పరేట్‌ అయిపోయారని అనిపిస్తుంది. ఈ మైనస్‌ పాయింట్స్‌ని కవర్‌ చేసుకుని ఉన్నట్టయితే సంపూ హృదయం కాలేయాల్ని పూర్తిగా కాజేసి ఉండేది. 

బోటమ్‌ లైన్‌: చిత్ర విచిత్రమైన వినోదం!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?