రివ్యూ: మనం
రేటింగ్: 4/5
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియ, లావణ్య, అఖిల్ (అతిథి పాత్రలో) తదితరులు
మాటలు: హర్షవర్ధన్
సంగీతం: అనూప్ రూబెన్స్
కూర్పు: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్
నిర్మాణం: అక్కినేని కుటుంబం
కథ, కథనం, దర్శకత్వం: విక్రమ్ కె. కుమార్
విడుదల తేదీ: మే 23, 2014
అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు నటించిన చిత్రం… నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం… ఒక సినిమాపై ఆసక్తి కలగడానికి, దానికోసం ఎదురు చూడడానికి ఇంతకంటే ఏం కావాలి? అయితే మనం కేవలం ఈ రెండు అంశాలతోనే ఆకట్టుకోలేదు. పోస్టర్స్ దగ్గర్నుంచి ట్రెయిలర్స్ వరకు… సాంగ్స్ దగ్గర్నుంచి విజువల్స్ వరకు అన్నీ సినిమాపై ఒక పాజిటివ్ ఫీల్ కలిగేట్టు చేసాయి. ఒక సినిమా ట్రెయిలర్ చూడగానే దీని కథ ఇది.. ఇలా ఉంటుంది.. అంటూ ఒక అంచనాకి రావచ్చు. కానీ మనం ట్రెయిలర్స్ చూస్తే… ‘ఇది ఎలా ఉండబోతుంది’ అనే ఆలోచన మొదలైంది. మూడు తరాల హీరోలు దొరికితే మూస కుటుంబ కథా చిత్రమొకటి తీసేసి చేతులు దులిపేసుకోవచ్చని అనుకుంటారు చాలా మంది. కానీ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఆ క్యాటగిరీకి చెందినవాడు కాదు. 13 బి, ఇష్క్‌లాంటి సినిమాల్తో ఇంప్రెస్ చేసిన విక్రమ్ కుమార్… అక్కినేని హీరోలందరినీ ఒకే కథలోకి తెచ్చే ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసి దానిని సక్సెస్‌ఫుల్‌గా అఛీవ్ చేసాడు. ‘మనం’ ఒక ఫిలిం కాదు… ఇదొక సెలబ్రేషన్. సినిమానైతే విశ్లేషించుకోవచ్చు కానీ… ఇలాంటి వేడుకని ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఆ అనుభవాన్ని అక్షరాల్లో పెట్టడానికి మా వంతు కృషి చేస్తాం… ఆ అనుభూతిని జస్ట్ ఈ అక్షరాల్లో తెలుసుకోడానికి ఆట్టే కష్టపడకుండా… అందుబాటులో ఉన్న మనం థియేటర్లో అడుగు పెట్టేయండి.
కథేంటి?
‘‘స్పాయిలర్ ఎలర్ట్’’ – (ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలంటే.. కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం ఉత్తమం. ఎక్కువ విషయాలు లీక్ చేయకుండా కేవలం ప్లాట్ మాత్రమే వివరించడానికి ట్రై చేస్తున్నాం కానీ.. ఇదీ తెలుసుకోకపోతే మంచిదని మా ఉద్దేశం)
రాధా మోహన్ (చైతన్య), కృష్ణవేణి (సమంత) దంపతులకి బిట్టు అనే కొడుకుంటాడు. ఇద్దరి మధ్య పరస్పర విబేధాల నేపథ్యంలో ఒక కార్ ప్రమాదంలో ఇద్దరూ చనిపోతారు. బిట్టు పెరిగి పెద్దయి సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్ నాగేశ్వరరావు (నాగార్జున) అవుతాడు. అనూహ్యంగా నాగేశ్వరరావుకి తన తల్లిదండ్రులు నాగార్జున, ప్రియ (చైతన్య, సమంత) ఎదురు పడతారు. వారిద్దరినీ ఒక్కటి చేసే ప్రయత్నాల్లో నాగేశ్వరరావు ఉండగా.. చైతన్య (నాగేశ్వరరావు) నాగేశ్వరరావుని, అంజలిని (శ్రియ) జంటగా చూసి షాక్ అవుతాడు. వారి వెనుక ఉన్న కథేంటి… ఈ పాత్రలన్నిటి మధ్య ఉన్న లింక్ ఏంటి అన్నదే మనం.
కళాకారుల పనితీరు!
నటించే ఓపిక, ఉత్సాహం ఉన్నప్పటికీ… 1990ల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు చాలా అరుదుగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. తన స్థాయికి, అనుభవానికి తగ్గ పాత్ర అనిపిస్తేనే ఆయన అంగీకరించారు. అంత అరుదుగా సినిమాలు అంగీకరించిన అక్కినేని.. తన కొడుకు, మనవడితో కలిసి నటించాలని అనుకున్నప్పుడు అల్లాటప్పా సినిమా ఎలా చేస్తారు? ‘మనం’ సినిమా విషయంలో ఏఎన్నాఆర్ అంగీకారం పొందడంతోనే దర్శకుడు విక్రమ్ కుమార్ సక్సెస్ అయ్యాడు. అక్కినేనికి సిసలైన నివాళిగా ఈ చిత్రం నిలిచిపోతుంది. నటుడిగా ఆయన ఏంటో ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఆయన సామర్ధ్యాన్ని పరీక్షించే పాత్రలు ఇప్పుడెవరూ రాయలేరు. ఆయన నటించడంతో మనం సినిమా పునీతమైంది.. తెలుగు సినీ చరిత్ర పుటల్లో చేరుతుంది.
నాగార్జున చాలా ఎంజాయ్ చేస్తూ చేసారని ఆయనని చూస్తేనే అర్థమవుతుంది. ఆర్టిస్ట్ తనకిచ్చిన జాబ్‌ని ఎంజాయ్ చేసాడంటే… అవుట్‌పుట్ ఖచ్చితంగా అద్దిరిపోతుంది. ఈమధ్య కొన్ని నాసి రకం పాత్రల్లో నాగార్జునని చూసాక… ఇందులో చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది. నాగార్జున కంటే కూడా ఈ సినిమాతో నాగ చైతన్య ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. నటుడిగా ఎంత పరిపక్వత సాధించాడనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తండ్రి, తాతతో నటించడం వల్ల తన కంఫర్ట్ లెవల్స్ పెరిగాయో… ఈ సినిమాని విపరీతంగా ప్రేమించడం వల్ల తన శాయశక్తులా దానికి న్యాయం చేయాలని చూసాడో తెలీదు కానీ… ఇంతవరకు నాగచైతన్యపై ఎలాంటి ఒపీనియన్ కానీ, ఏ విధమైన ఇంప్రెషన్ కానీ లేని వారికి ‘మనం’తో అక్కినేని వంశ వైభవాన్ని నిలబెట్టే సత్తా ఇతనికి ఉందనే అభిప్రాయం ఏర్పడుతుంది. సమంత మరోసారి ఆకట్టుకుంది. చైతన్యతో ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంకోసారి ఇంప్రెస్ చేస్తుంది. శ్రియ తన పాత్రకి న్యాయం చేసింది. ఒక్కసారి అలా తళుక్కున మెరిసిన అఖిల్ ఆ కొద్ది క్షణాల్లోనే ఫ్యూచర్‌లో స్టార్ కాగల మెటీరియల్ అనిపిస్తాడు.
సాంకేతిక వర్గం పనితీరు:
అనూప్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణ వాయువుగా మారింది. పాటలన్నీ వీనుల విందుగానే కాక కనువిందు చేసాయి కూడా. ఇక నేపథ్య సంగీతమైతే… ‘మనం’ సినిమాకి తానే సంగీతమందించానని పది కాలాల పాటు అనూప్ గర్వంగా చెప్పుకుని తిరగొచ్చు. అంత గొప్పగా దీనికి జీవం పోసాడు. పి.ఎస్. వినోద్ ఛాయాగ్రహణం దర్శకుడి ఊహలకి ఊపిరినిచ్చింది. ఆ కాలాన్ని, ఈ కాలాన్ని తన కెమెరా కంటితో స్పష్టంగా వేరు చేయడమే కాకుండా… ప్రతి ఫ్రేమ్‌కీ కళ తెచ్చాడు. మనం సినిమా ఒక అందమైన పాట అనుకుంటే… సంగీతం, ఛాయాగ్రహణం దీనికి శృతి, లయలు. కథలేక, కదల్లేక పోయే సినిమాల్ని ఎడిట్ చేసేయడం ఈజీ. ఇంత విషయమున్న సినిమాని వీలయినంత పొందిగ్గా… ఫ్లో మిస్ కాకుండా ఎడిట్ చేయడం మాత్రం పెద్ద టాస్క్. ఎడిటర్ ప్రవీణ్ తనవంతుగా మనం సినిమాకి ఆసక్తి సడలని గమనంతో అండగా నిలిచాడు. సంభాషణల రచయిత హర్షవర్ధన్ తనలోని మెచ్యూర్డ్ కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. రచయితగా నాలుగైదు మెట్లు ఒకేసారి ఎక్కే అవుట్‌పుట్ ఇది.
తన కెరీర్‌లో నాగార్జున ఎప్పుడూ ప్రయోగాలకి వెరవలేదు. కొత్త కథలతో వస్తే రిజల్ట్ గురించి ఆలోచించి వెనుకాడలేదు. అందుకే తన తరంలో ఏ హీరోకీ లేనన్ని మెమరబుల్ మూవీస్ తనకే ఉన్నాయి. మనం సినిమా నిర్మించడానికి మరో నిర్మాత అయితే తటపటాయించే వాడేమో కానీ… నాగార్జునలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మాత్రమే కథ వింటూనే దానిని తెరపై చూడగలడు.
దర్శకుడు విక్రమ్ కుమార్ ఇంతకుముందే తన ప్రతిభ చాటుకున్నాడు. మనం సినిమాతో అతను కేవలం ప్రతిభావంతుల సరసన కాదు… భారతీయ చిత్ర పరిశ్రమ చూసిన గొప్ప దర్శకుల సరసన చేరిపోతాడు. ఇలాంటి కథని ఊహించడమే కష్టమంటే… దానిని ఒక దారిన పెట్టడం… అంతే సమర్ధవంతంగా తెర మీదకి తీసుకు రావడం… అన్నిటికీ మించి వినోద భరితంగా తీర్చిదిద్దడం అందరి వల్ల అయ్యే పని కాదు. కేవలం మనంతో మెప్పించడమే కాకుండా సమకాలీన దర్శకులకి విక్రమ్ సవాల్ విసిరాడు. అంతే కాదు… దర్శకుడిగా తనకి కూడా హై స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నాడు. తను విసిరిన సవాల్‌కి బదులివ్వడం ఇతర దర్శకులకి ఎంత కష్టమో… ఇప్పుడు తనకి తాను నిర్దేశించుకున్న ప్రమాణాలకి సరితూగేట్టు మనంని తలదన్నే ఇంకో సినిమా తీయడం విక్రమ్‌కీ అంతే కష్టం. ‘మే 23న మనం కలుద్దాం’ అంటూ ఊరించిన విక్రమ్ మలి సినిమా ఎప్పుడొస్తుందా అని మనం ఎదురు చూద్దాం.
హైలైట్స్:
- కథ, కథనం
- సంగీతం, ఛాయాగ్రహణం
- అక్కినేని హీరోలంతా కలిసి నటించడం
- నాగార్జున – సమంత కాంబినేషన్‌లోని సీన్స్
- నాగేశ్వరరావు – చైతన్య మధ్య డైలాగ్స్
డ్రాబ్యాక్స్:
- చైతన్య, సమంత గతం తెలుసుకునే సీన్స్ ఎఫెక్టివ్‌గా లేవు
- పోసాని, అలీపై తీసిన సీన్స్‌లో కామెడీ పండలేదు
విశ్లేషణ:
మూడు తరాల అక్కినేని హీరోల్ని పెట్టి ఇతనేం సినిమా తీసాడా అనుకున్న వారికి ‘మనం’ అడుగడుగునా సర్‌ప్రైజ్ ఇస్తుంది. పాత్రల పేర్లు దగ్గర్నుంచీ… వాటిని రిలేట్ చేసి తీరు వరకు దర్శకుడు విక్రమ్ కుమార్ తానొక జీనియస్‌నని చూపించాడు. కథగా ఆలోచించడానికి కూడా అసాధ్యమనిపించే దానిని తెరపైకి ఇంత అందంగా తీసుకు రాగలిగాడంటే… విక్రమ్ సామాన్యుడు కాదు. అతను ఈ కథ చెప్పినప్పుడు నాగార్జునకి ఎలా అనిపించిందో… ఏం కనిపించిందో కానీ దర్శకుడి మీద పూర్తి నమ్మకం ఉంటే తప్ప ఎవరూ ఈ కథపై ఇంత కాన్ఫిడెంట్‌గా ఇన్వెస్ట్ చేయలేరు. ముందుగా ఈ ఆలోచనని సమర్ధనీయంగా తెరకెక్కించిన దర్శకుడిని, ఇది తెరకెక్కడానికి కారణమైన నిర్మాతని మెచ్చుకోవాలి.
తెలుగులో అన్నీ రొటీన్ సినిమాలే వస్తుంటాయని… తెలుగు దర్శకులు కొత్తగా ఆలోచించరని అనే వారికి ‘మనం’ తిరుగులేని ఆన్సర్‌గా నిలుస్తుంది. తెలుగు తెర మీదే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో వచ్చిన చిత్రాల్లో ‘మనం’ ఒక స్పెషల్ మూవీ అనిపించుకుంటుంది. అత్యంత క్లిష్టమైన కథాంశాన్ని దర్శకుడు చాలా సింప్లిఫై చేసి.. అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించిన విధానం అబ్బుర పరుస్తుంది. మనుషుల మధ్య బంధాలు జన్మ జన్మలకీ కొనసాగితే ఎలా ఉంటుందనే ఆలోచనలోంచి పుట్టిన మనంకి అద్భుతమైన కథనం రాసుకున్నాడు దర్శకుడు. క్లాక్ టవర్… పది ఇరవై టైమ్‌కి లింక్ చేస్తూ అతను ఆడిన ప్లే విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఎమోషన్స్‌తో నిండిన ఈ చిత్రాన్ని ఎక్కడా భారం కాకుండా నడిపించడం మరో ఆర్టు. ఆద్యంతం వినోద భరితంగా సాగిన మనం ఓవైపు హృద్యమైన సన్నివేశాలతో మనసు తడుపుతూనే… పెదాలపై చిరునవ్వుని చెరగనీయకుండా చివరంటా అలాగే ఉంచేస్తుంది. రొమాంటిక్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాగార్జున, శ్రియల మధ్య సీన్స్ చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. నాగార్జున, సమంత మధ్య సన్నివేశాలు, సంభాషణలు… చైతన్య, నాగేశ్వరరావు మధ్య అల్లర్లు, సరదాలు.. ‘మనం’ని ఫుల్ టైమ్ ఎంటర్‌టైనర్‌గా మలిచాయి. దర్శకుడి మేథస్సుకి లీడ్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న రియల్ లైఫ్ కెమిస్ట్రీ కూడా తోడైతే దాని ఎఫెక్ట్ ఎలాగుంటుందనేది మనంతో తెలుస్తుంది. ముందే చెప్పినట్టు మనం ఒక సగటు సినిమా కాదు… విశ్లేషణలతో అదెలాగుందనేది వివరించడానికి. ఇదొక ఎక్స్‌పీరియన్స్… ఎవరికి వారు స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే.
బోటమ్ లైన్: ‘మనం’ గర్వపడే తెలుగు చిత్రం!
-జి.కె.