ఇది ఆంధ్రా ‘భూ కైలాస్’

ఇప్పుడంటే రంగారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ ఢమాల్ మంది..కొనేవాడు లేక ఫ్లాట్లు ఖాళీగా పడి ఏడుస్తున్నాయి. లే అవుట్ లు అయితే బావురుమంటున్నాయి. కానీ పదేళ్ల క్రితం ఇలా లేదు వ్యవహారం. బ్రోకర్లు మూడు…

ఇప్పుడంటే రంగారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ ఢమాల్ మంది..కొనేవాడు లేక ఫ్లాట్లు ఖాళీగా పడి ఏడుస్తున్నాయి. లే అవుట్ లు అయితే బావురుమంటున్నాయి. కానీ పదేళ్ల క్రితం ఇలా లేదు వ్యవహారం. బ్రోకర్లు మూడు సైట్లు, ఆరు రిజిస్ట్రేషన్లు అన్నంతగా కళకళలాడుతూ వుండేవారు.  

అడ్డగోలుగా పెరిగిన రేట్లకు భూములు అమ్ముకున్నవారు, ఇళ్లలో చేరిన నోట్ల కట్టలతో ఉబ్బి తబ్బిబ్బయ్యేవారు. అందరూ జాగ్రత్త చేసుకోకున్నా కొందరు జాగ్రత్త పడ్డారు. కానీ చాలా మంది బార్లను, కార్ల కంపెనీలను, ఇంకా రకరకాల వ్యాపారాలను పోషించారు.  మైకం దిగిన చాలా మందికి ఇటు భూమీ కనిపించలేదు…అటు డబ్బూ కనిపించలేదు….మరోపక్క అక్కర్లేని దందాల పెరిగాయి.

ఇప్పటికిప్పుడు ఇంత సీన్ కనిపీంచడం లేదు అనుకున్నా…పైగా తెలంగాణ రైతుల కన్నా, దక్షిణ కోస్తా, గుంటూరు ప్రాంత రైతులు కాస్త తెలివైన వారు కాబట్టి, మరీ ఎక్కువ భయపడక్కర లేదు అనుకున్నా..కూడా…నవ్యాంధ్ర కొత్త రాజధాని ప్రాంతంలో మరో భూకైలాస్ ను చూసే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.

ఇప్పుడు తుళ్లూరు తదితర ప్రాంతాల్లో నల్ల డబ్బు ప్రవాహమై పారుతోంది. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ‘పచ్చ’పాత పత్రికలు దీన్ని, మాబాబు తెచ్చిన ప్రగతి వైభవం అన్నట్లు ముచ్చట్లు ముచ్చట్లుగా రాస్తున్నాయి.  అంతే కానీ , భూ సమీకరణ అనేది రైతుల బతుకుల పాలిట అద్భుత సంజీవినిగా పనిచేస్తుందన్న నమ్మకం బలంగా వున్నపుడు, ప్రభుత్వం రిజస్ట్రే షన్లు ఆపేసి, నల్లడబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునే వ్యవహారానికి, రైతులకు ఆలస్యమైనా న్యాయం జరిగే ప్రక్రియకు తెర తీయచ్చు కదా?

 లేదూ..భూ సమీకరణ పూర్తి విధి విధానాలను అంటే, అసలు ఏయే ప్రయోజనాలు, ఏ విధంగా, ఎప్పుడు, ఏయే దశలవారీగా అందిస్తారు..ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు ఎలా ముగుస్తాయి అన్నది వివరించవచ్చు కదా. అప్పుడు రైతుల్లో అయోమయం పోయి, భూములు ఇవ్వాలా వద్దా, అమ్ముకోవాలా, వుంచుకోవాలా అన్నది నిర్ణయమైపోతుంది కదా.

అలా చేయకుండా వారిని మబ్బులో వుంచడం ద్వారా అయోమయానికి, బడా వ్యాపారుల భూ దందాకు దారి తీస్తున్నట్లయింది. దీని వల్ల ఇప్పుడు ఏమవుతోంది. గోడవులు ఘర్షణలు తలెత్తున్నాయి. పురోణి(అమ్మకపు ఒప్పందం) జరిగిన చోట్ల, అమ్మకాలు జరపాలని, జరపమని గొడవలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల బెదిరింపుల వరకు వెళ్తోంది.

మరీ అందులో పెద్ద మొత్తం వ్యవహారాలు వుంటే ఎంతవరకు దారి తీస్తాయో అనుమానమే. ఈ రోజు ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తుంటే, మరి కొద్ది రోజులు ఇదే  అయోమయ పరిస్థితి కొనసాగితే, భూ దందాలు, గొడవలు, ఘర్షణలతో పోలీసు రికార్డులు నిండిపోయే అవకాశం కనిపిస్తోంది.

విధి విధానాలు స్పష్టంగా,దృఢంగా ప్రకటించకపోవడం అన్నది కేవలం ఈ భూ వ్యాపారులకు, నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేవారికి సహరించడం కోసమే అనిపిస్తోంది. నిజానికి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక వున్నపుడు అది ప్రకటించి అభిప్రాయ సేకరణ చేయాలి కానీ, అరకొర వ్యవహారాలు ప్రకటించి, జనాలను అయోమయానికి గురిచేసి, గ్రామాలకు మంత్రులను, వారి వెంట పోలీసులను పంపడం అంటే ఏమనుకోవాలి. ప్రభుత్వం జనాలను మరింత అయోమయానికి గురిచేయాలనే అనుకుంటోందనిపిస్తుంది. 

దీని వల్ల చిన్న సెంట్లు, అరఎకరా భూములు వున్నవారు, అమ్ముకుని చేతులు దులిపేసుకుంటారు. వచ్చిన వాటితో పెళ్లి పేరంటాలు, ఇల్లు వంటి వ్యహారాలకు ఖర్చు చేసేస్తారు. ఇన్నాళ్లు భూమిపై అప్పు తెచ్చి, పనులు కానిచ్చుకుని, తరువాత మెల్లగా తీర్చుకునేవారు. ఇప్పుడు భూమినే తీర్మానం చేసేసుకుంటే, ఇంక భవిష్యత్ ఎలా వుంటుందో ఆలోచించుకోవాల్సిందే. మొత్తానికి రాజధాని వచ్చిన సంతోషం కంటే, అది తెచ్చిన అయోమయమే ఎక్కువగా వుంది గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో.