జానా సారూ..ఏం సెప్తిరి..ఏం సెప్తిరి

సిఎల్పీ నేత జానా… తాజాగా చేసిన గానా .. చాలా బాగుంది. సభలో అధికార పక్షాన్ని తన దైన శైలిలో ఎండగడుతూ మార్కులు కొట్టేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ…

సిఎల్పీ నేత జానా… తాజాగా చేసిన గానా .. చాలా బాగుంది. సభలో అధికార పక్షాన్ని తన దైన శైలిలో ఎండగడుతూ మార్కులు కొట్టేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అన్నారు. సరే పెద్దవయసు వస్తోంది.. ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటాడు, యువకులకు అవకాశం కల్పిస్తాడని మీడియాతో పాటు ఆయన వెంట ఉన్న నేతలంతా అలా ఆలోచిస్తుండగానే మరో బాంబులాంటి మాటేసారు. ముఖ్యమంత్రి పదవి వస్తే మాత్రం కాదనను సుమా.. అన్నారు. 

అదేంటి ఎన్నికల్లోనే పోటీ చేయనంటే ఇక విశ్రాంతి తీసుకుంటారనుకుంటే మళ్లీ ఈ ట్విస్టేంటి.. పోటీ చేయకుండా ఎలా సిఎం అవుతారని ప్రశ్నించింది మీడియా.. భలేగున్నారండీ… ఇప్పటి వరకు ఎలాంటి పోటీ చేయకుండా ఎంత మంది ముఖ్యమంత్రులు, మంత్రులు కాలేదు చెప్పండి.. అందుకే వచ్చే సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక నేనే సిఎంను అంటూ చెప్పేసి ఇప్పటికే ఆ పార్టీలో ఆ పదవి కోసం మసాలా నూరుతున్న సవాలక్ష మందికి షాకిచ్చారు జానా…

అంతే కాదండోయ్.. ఆయనకు తెలంగాణపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదన్నారు. సభలోను అదే ప్రస్తావిస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతయినా అధికార పక్షంతో భేష్ అనిపించుకుంటున్నారు. ఇప్పడదే అస్త్రంతో తన ఇమేజి పెంచుకునే పని చేయబోతున్నట్లు కూడా క్లియర్ చేసారు. ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇమేజి అవసరం, ప్రజల్లో పట్టు అవసరం కాని ఈయనకెందుకు అన్న అనుమానమైతే అందరికి రావచ్చనుకోండి…కాని రేపు పెద్ద పదవికే ఎసరు పెట్టబోతున్న ఆయనకు పార్టీలో మరెవరు ఆపోటీకి పోటీ రావద్దంటే అవసరమే కదా… అందుకే తెలంగాణకు మేలు చేసేందుకు రంగంలోకి దిగుతానన్నారు. 

పోటీ చేయనంటూనే ఏ పదవిలో ఉన్నా.. ఆపదవికి న్యాయం చేస్తాను, ఆపదవిని తెలంగాణకోసమే ఉపయోగిస్తానన్నారు. సభలో విద్యుత్ కోతలపై సర్కారును తెగ ఇబ్బంది పెట్టిన జానా… మీడియా ముందు మాత్రం అవసరమైనంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం, ఏపి నుంచి రావాల్సినంత కరెంట్ రాకపోవడమే కారణమంటూ సర్కారును వెనుకేసుకొచ్చారు. ఇలా అప్పుడే సర్కారుకు అనుకూలంగా, అంతలోనే ప్రభుత్వాన్ని తూర్పారా బడుతూ ఆయన అంతరంగం, అసలు వ్యూహం ఎవరికి అర్థం కాని విధంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే… అవకాశం వస్తే అధికారం కోసం టిఆర్ఎస్ లోకి దూకినా దూకుతాడేమో అన్న అనుమానాలయితే ఓ మూలన కలిగాయి కొందరికి. 

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో పోరాడుతా.. అన్నారు కాని కాంగ్రెస్ వారమంతా కలిసి పోరాడుతాం అనలేదు. అంటే ఏదో మూలన ఆయన క్షేమమే చూసుకుంటున్నారన్న మాట. అందుకే కాంగ్రెస్ ను టిఆర్ఎస్ సభలో ఎంత ఎండగడుతున్నా… దానికి మాత్రం కౌంటర్ ఇవ్వడం లేదు. పైగా అది నిజమే అన్నట్లుగా తెలివిగా మాట్లాడుతూ తాను తప్పుగా మాట్లాడలేదు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే మాట్లాడాల్సి వచ్చింది అని భావించేలా తన మాటల చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తాము అంటే కాంగ్రెస్ ద్రోహమే చేసింది, మేము ద్రోహులమే అంటూ తిట్టిపోసుకుని అంతలోనే మీరు మాత్రం అలా కావద్దు అంటూ టిఆర్ఎస్ కు చురకలంటించడమే దీనికి ఉదహరణ. మొత్తం మీద భలే కొత్త గానం అందుకున్న జానా.. అసలు అంతరంగమేమిటో మున్ముందు కాని తెలియదు.