రాజధానిపై ‘కథ’న వ్యూహాలు

ఓ భూమికి వివాదం వుందని తెలుసు..లేదా ఆ భూమిని త్వరలో ప్రభుత్వం తీసుకోబోతోందని తెలుసు..తెలిసీ తెలిసీ,,ఎవరైనా ఆ భూమిని కొనుక్కోవాలి అనుకుంటారా? పైగా ఏ భూమి వివాదంలో వుందో, ఏ భూమి ప్రభుత్వం తీసుకుంటోందో…

ఓ భూమికి వివాదం వుందని తెలుసు..లేదా ఆ భూమిని త్వరలో ప్రభుత్వం తీసుకోబోతోందని తెలుసు..తెలిసీ తెలిసీ,,ఎవరైనా ఆ భూమిని కొనుక్కోవాలి అనుకుంటారా? పైగా ఏ భూమి వివాదంలో వుందో, ఏ భూమి ప్రభుత్వం తీసుకుంటోందో తెలియని అయోమయం వున్నపుడు అస్సలు వాటి జోలికి ఎవరైనా వెళ్తారా?

కానీ ప్రభుత్వం మాత్రం అలా చెప్పడం లేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిన రాజధాని ప్రాంతాల్లో బడా వ్యాపారులు వచ్చి భారీగా భూములు కోనేస్తున్నారు అంటోంది. పైగా దానిపై ఆరా తీస్తోందట. అవసరానికి ఎకరా, రెండు ఎకరాలు కొనుక్కోవడం వేరు, ఇలా కొనేయడం సరికాదు అంటోంది.

ఏమిటిదంతా? అంటే..మరేమీ లేదు. రైతులను అయోమయంలో పడేయడానికీ తమ తెలివితేటలు అన్నీ వాడి ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు..వాటిని ‘పచ్చ’పాత పత్రికలు వండి వారుస్తున్నాయి.

భూములు తీసుకోవడం రైతులకు లాభం అని వాదించే మంద చాలానే వుంది. ఇప్పుడు ఎ కరా కోటి రూపాయిలు వుంటే, రాజధాని వచ్చాక అది పదింతలు అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఎకరా వుంటే ఎంతో అప్పుడు గజం రెండు వేలు పైచిలుకు పడింది..అదే ఎకరా పది కోట్లు అంటే గజం ఇరవై వేల పైమాటే అంటున్నారు. అందు వల్ల రైతుకు వచ్చే వెయ్యి గజాలకు రెండు కోట్లు వస్తుంది అని చెబుతున్నారు.

కానీ ఇక్కడ డబ్బులు ఒకటే కాదు సమస్య, రైతుకు పొలంపై వున్న మక్కువ, అభిమానం, పచ్చని పంట చేలు, బియ్యం ఉత్పత్తి, వాటి ధరలు కూడా కీలకం అవుతాయని ఈ జనాలు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు.

సరే ఆ సంగతి అలా వుంచితే, రైతులు భూములు ఇవ్వడం లాభదాయకం అని నమ్మించడానికి ఇలాంటి కథనాలు వండుతున్నారు. ఎవరో వచ్చేసినట్లు, గంపగుత్తగా  భూములు కొనేస్తున్నట్లు, లాభం కోసం ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు ఆ కథనాల ద్వారా. లాభం లేకుంటే బడా బాబులు ఎందుకు కొంటారు. అంటే ప్రభుత్వానికి ఇవ్వడం లాభం అన్నమాట అని చిన్న రైతులు అనుకుని, రాజధానికి అనుకూలంగా భూములు ఇచ్చేయాలి అదీ ఈ కథనం ఉద్దేశం.

కానీ ఇక్కడ ఇలాంటి ఆలోచించాల్సింది ఏమిటంటే, అసలు ప్రభుత్వానికే భూమి ఇవ్వడానికి ఇష్టపడని వారు, ప్రయివేటుకు మాత్రం ఎందుకు ఇచ్చేస్తారు? పోనీ ప్రభుత్వం వెయ్యి గజాలే ఇస్తామంటోంది. వీరు మొత్తానికి డబ్బు లు ఇచ్చేస్తారనా? అలాంటి ఉద్దేశం వుంటే రైతులు ప్రభుత్వాన్ని, గ్రామ సభలు పెట్టే అధికారులనే అలా అడుగుతారు కదా. ప్రభుత్వం కూడా పూలింగ్ కాకుంటే అక్వయిర్ చేస్తామనే అంటోంది. అప్పుడైనా మార్కెట్ రేటు ఇవ్వాలి కదా. పైగా ప్రభుత్వ విధి విధానాలు ఇంతవరకు ఖరారు కాలేదు..చట్టబద్ధం కాలేదు. మరి బడాబాబులు వచ్చి ఎందుకు కొంటారు. వారికి ఏ విధమైన ధైర్యం వస్తుంది.

అలాంటపుడు ఇంకోలా ఆలోచించాల్సి వస్తుంది. అధికార పార్టీలో అనేకానేక మంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం తీసుకుంటే అపప్రధ రావడానికి అవకాశం వుంది. అదే ఈ బడాబాబులు రైతుల నుంచి కొంటే..వారినుంచి ప్రభుత్వం తీసుకుంటే..అప్పుడు వారికి అనుకూలంగా కాస్త వ్యవహరిస్తే ఉభయతారకంగా వుంటుంది కదా.

అందువల్ల ఇలాంటి కథనాలు రెండు సందేహాలకు దారితీస్తాయి. ఒకటి రైతులను తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశించినవా? లేక, ప్రభుత్వానికి ఇలాంటి వ్యూహం కూడా వుందని చెప్పీ చెప్పనట్లు చెప్పడానికా?