వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే వారి జాబితాలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కూడా ఉన్నారు. ఈయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ కమిషనర్. చేతిలో అధికారం వున్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏం చేశారో, గుర్తించుకోడానికి ఏమీ లేవు. అలాంటి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్… ఎన్నికలకు ఆరు నెలల ముందు తానున్నానని ముందుకొచ్చారు.
చంద్రబాబునాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను నిమ్మగడ్డ క్రియేట్ చేశారు. ఇందులో జగన్ వ్యతిరేక బ్యూరోక్రాట్స్ (రిటైర్డ్) కొలువుదీరారు. ఈ సంస్థ ఆరంభం నుంచి పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకు నేరుగా పాలన తీసుకెళ్లేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయానికి, ప్రజలకు మధ్య వారధిగా వలంటీర్లు వ్యవహరిస్తున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని జగన్‌కు అనుకూలంగా మలచడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారనే భయంతో నిమ్మగడ్డ తన మార్క్ కుట్రలకు తెరలేపారు. చంద్రబాబు రాజకీయాన్ని మొదటి నుంచి పరిశీలిస్తున్న వారికి, తన చేతికి మట్టి అంటకుండా అవసరాలను బట్టి ఎవరో ఒకర్ని ముందు పెట్టి, నాటకాన్ని రక్తి కట్టించే సంగతి తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డను జగన్ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి వాడుకుంటున్నారు.
వాలంటీర్లను అడ్డుకోవడమే నిమ్మగడ్డకు చంద్రబాబు ఇచ్చిన టాస్క్. పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరం పెట్టేలా ఈసీకి నిత్యం ఫిర్యాదులు చేయాలనే చంద్రబాబు ఇచ్చిన టాస్క్‌ను నిమ్మగడ్డ విజయవంతంగా పూర్తి చేశారు. ఇదేదో వలంటీర్లు, జగన్ సర్కార్‌కు షాక్ అంటూ ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. చంద్రబాబు తమకు షాక్ ఇచ్చారని పింఛన్‌దారులు గ్రహించలేని అమాయక స్థితిలో లేరు. అయితే చంద్రబాబు ఎందుకు గ్రహించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఇలాంటి చర్యలు జగన్‌కు మరింత రాజకీయ ప్రయోజనం కలిగించడమే. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ప్రతినెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే ఇళ్ల వద్దకే వలంటీర్లు వెళ్లి పింఛన్ అందిస్తూ వచ్చారు. ఇప్పుడు వలంటీర్లను అడ్డుకోవడంతో పింఛన్ల పంపిణీ సరిగా జరగకపోవడం ద్వారా… జగన్ ప్రభుత్వ ప్రాధాన్యతను చంద్రబాబునాయుడు, నిమ్మగడ్డ రమేశ్‌కుమారే ప్రాక్టికల్‌గా చెప్పినట్టు అవుతుంది.
పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా అడ్డుకోవడం అంటే, వాళ్ల వ్యతిరేకతను చేజేతులా చంద్రబాబు కొని తెచ్చుకోవడమే. ఎన్నికల్లో భారీ మూల్యాన్ని కూటమి అభ్యర్థులు చెల్లించుకోవాల్సి వుంటుంది.