తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకునే నాయకుడు ఆంధ్రలో ఎవరైనా వున్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన కొన్ని భ్రమల్లో బతికేస్తుంటారు లేదా తనను గుడ్డిగా అనుసరించే జనసైనికులను భ్రమల్లో వుంచాలనుకుంటారు. మనల్నెవడురా ఆపేది అన్నది ఆయన స్లోగన్.
నిజానికి ఎవరూ ఆపే ప్రయత్నమూ చేయరు. చేయలేదు. కానీ ఆయనే అలా హూంకరించి, సంతృప్తి చెందుతూ, తన వెనుక వున్న మాస్ జనాలను సంతృప్తి పరుస్తూ వుంటారు. వారాహి యాత్ర సాగిస్తా, ఎవరు ఆపుతారో చూస్తా అన్నారు. ఎవరు ఆపారు? ఎవ్వరూ ఆపలేదు. కానీ ఆయనే పాపం ఈస్ట్, వెస్ట్ తప్ప మరెక్కడా తిరగడానికి తెలుగుదేశం నుంచి పర్మిట్ తీసుకోలేకపోయారు.
ఇప్పటికీ ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. తనను పిఠాపురంలో ఓడించానికి ఓటుకు లక్ష ఖర్చు చేస్తున్నారు అంటారు. మిధున్ రెడ్డి, ద్వారపురెడ్డి కుట్ర అంటారు. పవన్ ను ఓడించడానికి అంత మన్ను, మిన్ను ఏకం చేయాలా? పవన్ గెలిస్తే సిఎమ్ ఏమన్నా అయిపోతారా? భయపడడానికి. అంతా గెలిస్తే, జస్ట్ ఓ ఇరవై మంది ఎమ్మెల్యేల కూటమికి నాయకుడు. ఆ కూటమిలోనూ సగం మంది చంద్రబాబు పురమాయించి పంపిన వారే. వారిలో ఒకరికో ఇద్దరికో మంత్రి పదవులు వస్తాయి. అది కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తే. అదే అధికారంలోకి రాకపోతే పవన్ మినహా ఒక్కరు మిగలరు.
ఈ మాత్రం దానికి పవన్ ఒకటే బీరాలు. దమ్ముంటే టచ్ చేయండి. దమ్ముంటే ఓడించండి.. ఇలా అంటూ నీడతో యుద్దం చేస్తున్నారు. పవన్ సినిమాలు చూసో, కులం చూసో గుడ్డిగా ఫాలో అవుతున్న వారంతా ఇదంతా నిజమే, తమ నాయకుడు మహా వీరుడు అని అనుకోవాలనేది పవన్ భావన.
నిజానికి ఇది ఒకప్పుడు వుండేదేమో? తెలుగుదేశంతో పొత్తు తరువాత పైకి చెప్పినా, చెప్పకున్నా, జనసైనికులు చాలా మందికి మబ్బులు విడిపోయాయి. నాయకుల రేంజ్ లో వున్న వారికి పవన్ ఏమిటో క్లారిటీ వచ్చింది. ఇక కేడర్ కు రావాల్సి వుంది. వన్స్ అది వచ్చేస్తే, ఇక పవన్ ఎన్ని బీరాలు పలికినా ప్రయోజనం లేదు. లాంగ్ టెర్మ్ లీడర్ షిప్ కోరుకునేవారు వాస్తవం పునాదుల మీద పార్టీ నిర్మాణం చేసుకుంటారు. కానీ పవన్ కేవలం ఈ భ్రమల మీద పార్టీని నిర్మిస్తున్నారు. ఆ భ్రమలు తీరిపోతే, పార్టీ అనేదే వుండదు.