సాధారణంగా ఎవరినైనా హేళన చేయడానికి డేఢ్ దిమాగ్ అని అంటుంటారు. హేళన మాట పక్కన పెడితే.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ‘ఏక్’ అంటే కాంగ్రెస్ పార్టీ సారథి షర్మిల ‘డేఢ్’ అంటున్నారు. చంద్రబాబునాయుడు ఏపీలో ప్రజల్ని బురిడీ కొట్టించడానికి సూపర్ సిక్స్ అంటూ ఆరు హామీలను ఇస్తోంటే.. తానేం తక్కువ తిన్నానా అన్నట్టుగా వైఎస్ షర్మిల ఏకంగా తొమ్మిది గ్యారంటీలు అందిస్తున్నారు. అంటే చంద్రబాబు ఒకటి అంటే.. ఆమె ఒకటిన్నర అనేట్టున్నారన్నమాట.
తమ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోవడం లేదు.. అనే క్లారిటీ ఉంటే.. రాష్ట్ర ప్రజలకు ఎంత ఘనం హామీలనైనా ఇవ్వవచ్చు. ఇప్పుడు షర్మిల కూడా అదే పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే (రాష్ట్రంలోనా? దేశంలోనా? అనేది క్లారిటీగా చెప్పడం లేదు) రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా ఇచ్చేస్తారట.
పెట్టుబడిపై యాభైశాతం లాభంతో రైతులకు మద్దతు ధర ఇస్తారట. పెట్టుబడి అనేది ఒక్కోప్రాంతం రైతుకు ఒక్కోతీరుగా ఉంటుంది. మరి ఈ మద్దతుధరను ఎలా డిసైడ్ చేస్తారో?
రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసేస్తారట. రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.8500 వంతున ఏడాదికి లక్ష రూపాయలు పంచిపెట్టేస్తారట. చంద్రబాబునాయుడు ప్రతినెలా 18 దాటిన ప్రతి అమ్మాయికీ నెలకు రూ.1500 ఇస్తానంటున్నారు. షర్మిల చంద్రబాబునాయుడు ప్రకటించిన ఓటు రేటును అయిదారు రెట్లు పెంచేశారు. ఆయన నెలకు రూ.1500 అంటే.. ఆమె 8500 ఇస్తారట.
2.25 లక్షల ఉద్యోగాల భర్తీ ఫైలుపైనే తొలిసంతకం చేస్తారట. ఇంట్లో అర్హులు ఎందరుంటే అందరికీ పెన్షన్లు ఇస్తారట. వృద్ధుల పెన్షను 4 వేలకు, వికలాంగులకు 6 వేలకు పెంచుతారుట. వృద్ధుల పెన్షను మాత్రం చంద్రబాబు చెప్పినంత రేటునే ఆమె ప్రకటించారు.
అలవిమాలిన హామీలు ప్రకటించడంలో చంద్రబాబునాయుడే అందరినీ మించిపోతున్నారంటే.. వైఎస్ షర్మిల ఆయనను మించిపోతున్నారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకు డబ్బు ఎక్కడినుంచి వస్తుందనే సందేహమే ప్రజలను వీడడం లేదు. అలాంటిది.. షర్మిల రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇచ్చేస్తాననడం హామీలాగా కాదు. కామెడీలాగా ఉంది.
జగన్ అనుకూల ఓటను చీల్చాలనే కుట్రతో చంద్రబాబు స్కెచ్ ప్రకారం బరిలోకి దిగిన షర్మిల చంద్రబాబును మించిన హామీలతో దూసుకెళ్లిపోతుండడమే తమాషా. మొత్తానికి షర్మిల హామీలను గమనించి ప్రజలు నవ్వుకుంటున్నారు.