కడప లోక్‌సభ అభ్యర్థిగా బలమైన అభ్యర్థిని నిలబెట్టి, జగన్‌ను కట్టడి చేసేందుకు చంద్రబాబునాయుడు తీవ్రంగా కసరత్తు చేశారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డిని ఓడించేందుకు కడప ఎంపీ అభ్యర్థి కోసం ఎవరెవరి పేర్లో పరిశీలించారు. చివరికి ఎవరూ దొరక్క, ఓడిపోయేందుకు ఎవరైతేనేం అన్నట్టుగా జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జ్ భూపేష్‌రెడ్డి పేరు ప్రకటించడం గమనార్హం. తనను ఇలా బలి పెడతారని భూపేష్ కలలో కూడా ఊహించి వుండరు.
జంతువులను బలి పెట్టే సమయంలో వాటికి నీళ్లు తాగిస్తారు. పసుపు, కుంకుమ పెట్టి పూజిస్తారు. ఇదంతా జంతుప్రేమ అనుకుంటే ఎలా? కడప బరిలో భూపేష్‌రెడ్డి పరిస్థితి కూడా ఇంతే. జమ్మలమడుగు ఎమ్మెల్యే కావాలనే తన కలను, కొడుకు రూపంలో సాకారం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తహతహలాడారు. గత మూడేళ్లుగా జమ్మలమడుగులో భూపేష్‌రెడ్డి టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ వచ్చారు.
పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటును కేటాయించారు. దీంతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి కేటాయించారు. అయితే భూపేష్‌రెడ్డికి ఏదో ఒకటి ఇవ్వకపోతే, జమ్మలమడుగులో ఆదికి చేయరని చంద్రబాబు భావించారు. కేవలం ఆదినారాయణరెడ్డి శ్రేయోభిలాషిగా భూపేష్‌ను కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతే తప్ప, భూపేష్‌కు మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనే ఆశయంతో కానే కాదనే చర్చకు తెరలేచింది. లోకేశ్‌నే ఇట్లే బలిపెడతారా? అనే ప్రశ్న జమ్మలమడుగు టీడీపీ శ్రేణుల నుంచి వస్తోంది.
జమ్మలమడుగులో కమలం గుర్తుకు ఆదరణ ఏ మాత్రమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు సీటు తీసుకుని తన అన్న కుమారుడిని రాజకీయంగా నష్టపరుస్తున్నారనేది బహిరంగ రహస్యమే. కడప ఎంపీగా ఆదినారాయణరెడ్డి ఎందుకు పోటీ చేసి వుండకూడదని భూపేష్ అభిమానులు నిలదీస్తున్నారు. ఆదినారాయణరెడ్డి ఉద్దేశంతోనే భూపేష్‌ను సర్వనాశనం చేయడానికి ఇలా చేస్తున్నారని అతని కుటుంబ సభ్యులు ఆగ్రహంగా వున్నారు.
ఈ నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి ప్రకటించగానే, టీడీపీ శ్రేణులు ఉస్సూరుమన్నాయి. పోటీ లేదని అనుకోకుండా భూపేష్‌ను నిలిపారని టీడీపీ శ్రేణులు అంటున్న మాట. ఏది ఏమైతేనేం కడపలో జగన్‌ను కట్టడి చేయాలని బాబు పట్టుదలతో ఉన్నప్పటికీ, ఆయన్ను నమ్మి ఎవరూ ముందుకు రాలేదని తాజా పరిణామాలే చెబుతున్నాయి.