సామాజిక పింఛన్‌దారులకు మరోసారి చంద్రబాబు మార్క్ పాలన కష్టాలు మొదలయ్యాయి. జగన్ పాలనలో 58 నెలల పాటు సామాజిక పింఛన్‌దారులకు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము ఇచ్చేవారు. అయితే వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని, వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని చంద్రబాబు తన నమ్మకస్తుడైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో బ్యాంక్ ఖాతాలున్న వారికి జమ చేయాలని, లేని వారికి నగదు పంపిణీ చేయాలంటూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సూచించారు. అలాగే బ్యాంక్ ఖాతాలకు పంపిణీ చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఈసీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు, అలాగే ప్రతిపక్షాల వినతి మేరకు ఈసీ ఏపీ ప్రభుత్వానికి సుమారు 66 లక్షల మంది సామాజిక పింఛన్‌దారులకు నగదు పంపిణీపై దిశానిర్దేశం చేసింది.
ఈ మేరకు బ్యాంక్ ఖాతాలున్న వారికి అధికారులు డీబీటీ ద్వారా లబ్ధి చేకూర్చారు. బ్యాంక్ ఖాతాలు లేని వారు సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే పింఛన్ సొమ్ము తీసుకోడానికి బ్యాంక్‌లకు లబ్ధిదారులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల వృద్ధులు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. అయితే పండుటాకుల ఇబ్బందులకు జగన్ ప్రభుత్వమే కారణమని చెప్పేందుకు ఎల్లో మీడియా తెగ ఉబలాట పడుతోంది.
ఇటు బ్యాంకులు, అటు సచివాలయాల వద్దకు క్యూ కట్టడానికి కారకులెవరో సామాజిక పింఛన్‌దారులకు బాగా తెలుసు. ప్రతి ప్రతికూల అంశాన్ని జగన్ సర్కార్‌పై నెట్టేయడం ఎల్లో మీడియాకు అలవాటైన విద్య అని ఏపీ ప్రజానీకానికి అనుభవమే. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో సామాజిక పింఛన్‌దారులకు తెలుసు కాబట్టే, వారంతా చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు.
ఎన్నికల కోడ్ వల్ల జగన్ చేతిలో రెండు నెలలు అధికారం లేకపోవడం, అలాగే వలంటీర్లను బాబు అడ్డుకోవడం వల్లే తమకు ఇబ్బందులు తలెత్తాయని పింఛన్‌దారులు మండిపడుతున్నారు. తాము రాసింది నమ్మి జగన్‌పై ఆగ్రహంతో వైసీపీకి వ్యతిరేకంగా పింఛన్‌దారులు ఓటు వేస్తారని ఎల్లో మీడియా భ్రమల్లో ఉన్నట్టు కనిపిస్తోంది.