ఉత్తరాంధ్రలో సైలెంట్ వేవ్!

ఉత్తరాంధ్రలో ఈసారి అనూహ్యమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ కీలకమైన రీజియన్ గా ఉంది అని చెప్పాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇవి…

ఉత్తరాంధ్రలో ఈసారి అనూహ్యమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ కీలకమైన రీజియన్ గా ఉంది అని చెప్పాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇవి మొత్తం ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లలో అయిదవ వంతు. అంటే ఇరవై శాతం సీట్లు అని కూడా చెప్పాలి.

ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి వస్తాయో ఆ పార్టీయే ఏపీలో అధికారం సాధిస్తుంది అన్న లెక్క కూడా ఉంది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారూ అంటే టీడీపీకి పాతిక సీట్లు ఉత్తరాంధ్ర జిల్లాలలో వచ్చాయి.  2019లో జగన్ సీఎం కావడానికి ఉత్తరాంధ్ర తన భుజం కాసింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి 28 అసెంబ్లీ సీట్లు దక్కితే టీడీపీకి ఆరు మాత్రమే లభించాయి.

ఈసారి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తామని వైసీపీ ధీమాగా చెబుతోంది. వైసీపీ ధీమా వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర అంతా పూర్తిగా గ్రామీణ నేపధ్యం ఉన్న ప్రాంతం. బీసీలు నూటికి ఎనభై శాతం పైగా ఉంటారు.

మహిళా ఓటింగ్ శాతం మూడు జిల్లాలలో ఎక్కువ. పోలింగ్ కూడా ఎక్కువగా జరిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఉంది. ఇక్కడ తూర్పు కాపులు వెలమలు, యాదవులు, కాళింగులు గవరలు, ఇతర బీసీ వర్గాలు రాజకీయంగా ముఖ్య భూమికను పోషిస్తాయి. ఉత్తరాంధ్రలో ఎప్పుడూ కూడా అభిమానం చూపిస్తే అది ఏకపక్షంగా ఉంటుంది.

సగం సగం ప్రేమను వారు చూపించరు అని గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీకి 2019లో కంటే 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో మరింతగా జనాదరణ లభించింది. ఈసారి కూడా వైసీపీ పక్షం ఉత్తరాంధ్రా వహిస్తుందని ఆ పార్టీ ధీమాగా వ్యక్తం చేస్తోంది.

గతంలో తాము గెలిచిన సీట్లతో పాటు గెలవని సీట్లలో కూడ ఈసారి పాగా వేస్తామని చెబుతోంది. విశాఖ రాజధాని నినాదంతో సిటీలో భారీ మార్పు కనిపిస్తోంది. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంతో విజయనగరం, మూలపేట పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లాలలో అభివృద్ధి జరిగిందని అవి వైసీపీకి అనుకూలంగా మారుతాయని అంటున్నారు.

అయిదేళ్ళ పాటు వైసీపీ నేతలు జనంలో ఉండడం కూడా సానుకూలతను పెంచే అంశం అంటున్నారు. సైలెంట్ వేవ్ వైసీపీకి ఉందని ఆ పార్టీ వారు చెబుతున్నారు. ఈసారి వైసీపీ అనూహ్యమైన ఫలితాలను సాధిస్తుందని ప్రత్యర్ధి పార్టీల నుంచి పోటీలో ఉన్న పెద్ద తలకాయలు సైతం ఓటమి పాలు అవుతారు అని చెబుతున్నారు

మహిళలతో పాటు బీసీలు పెద్ద ఎత్తున వైసీపీ వైపు ఉన్నారని అంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్రాలోని బొబ్బిలి, చోడవరం, పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల సభలు సూపర్ హిట్ కావడంతో మరోసారి ఫ్యాన్ గిర్రున తిరుగుతుంది అని అంటున్నారు.