ఆ అనుమతి సాధిస్తే అభినందించాల్సిందే!

వెడల్పు మాత్రం 150 మీటర్లుండాలనే అంచనాతోనే అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ సర్కారు పట్టుబడుతోంది.

ఏపీ రాజధాని అమరావతి చుట్టూ దాదాపు అయిదు జిల్లాలను అనుసంధానిస్తూ 190 కిలోమీటర్ల పొడవున అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపడమూ, వారు కొన్ని మార్పులతో ప్రాథమికంగా ఓకే చెప్పడమూ కూడా జరిగింది. అయితే ఈ అవుటర్ రింగ్ రోడ్డు 150 మీటర్ల వెడల్పుతో ఉండేలా ఏపీ ప్రతిపాదించగా.. కేవలం 70 మీటర్ల వెడల్పుతో ఉండేలా.. దానికి తగ్గట్టుగా 1702 ఎకరాల మేర భూసేకరణ చేయడానికి కేంద్రం గతంలో అనుమతించింది.

అయితే.. ఏపీ సర్కారు తాజాగా మరోసారి కేంద్రానికి విన్నపాలు పంపింది. అవుటర్ రింగ్ రోడ్డు 150 మీటర్లు ఉండాల్సిందేనంటూ, దానికి తగ్గట్టుగా భూసేకరణకు అనుమతివ్వాలని కోరింది. కేంద్రం ఒకసారి 70 మీటర్లకు ఓకే చెప్పిన తర్వాత.. తిరిగి 150 మీటర్ల ఓఆర్ఆర్ కు అనుమతి సాధించడం అనేది క్లిష్టమే. అయితే రాష్ట్రంలో నడుస్తున్నది డబుల్ ఇంజిన్ సర్కారు గనుక.. కేంద్రంలోని పెద్దలను ఒప్పించి 150 మీటర్లకు అనుమతులు రాబట్టగలిగితే.. ఏపీ ప్రభుత్వాన్ని అభినందించవచ్చు.

హైదరాబాదు నగరం చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు వెడల్పు 150 మీటర్ల దాకా ఉంది. ఇంచుమించుగా అంతే వెడల్పుతో ఉండేలా ఏపీ ప్రతిపాదించింది. కానీ అందులో సగం వెడల్పుకు మాత్రమే కేంద్రం అనుమతించడం చిత్రమైన విషయం. ఆరువరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్ మెంట్ విషయంలో అయిదు చోట్ల మార్పులు కూడా సూచించిన కేంద్రం వెడల్పు విషయంలో మాత్రం.. ఏపీ విజ్ఞప్తిని పట్టించుకోలేదు.

అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం వాదన ఇంకో రకంగా ఉంది. ముందు ఆరు వరుసలుగా నిర్మించే ఓఆర్ఆర్ ను భవిష్యత్తులో ఎనిమిది వరుసలుగా విస్తరించడానికి, అలాగే ఓఆర్ఆర్ వెంబడి రైల్వేలైను వేసి సబర్బన్ రైళ్లు నడిపేందుకు ఈ మాత్రం అవసరం అని ఏపీ భావించింది. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు ఆమోదించలేదు. ఓఆర్ఆర్ వెంబడి రైల్వేలైను కావాలనుకుంటే, అందుకోసం విడిగా రైల్వేశాఖను సంప్రదించాలని.. ఈ రెండింటినీ ఒకటేగా కలపడానికి వీల్లేదని పేర్కొంది.

అయినప్పటికీ.. వెడల్పు మాత్రం 150 మీటర్లుండాలనే అంచనాతోనే అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ సర్కారు పట్టుబడుతోంది. భవిష్యత్తులో రవాణా వినియోగ అవసరాలు పెరుగుతాయని, దానిని దృష్టిలో పెట్టుకుని.. భవిష్యత్తులో భూసేకరణ సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఇప్పుడే కాస్త ఉదారంగా అనుమతులు ఇవ్వడం మంచిదని.. ఏపీ సర్కారు చెబుతోంది. రెండోసారి కూడా ప్రతిపాదనలు వెళ్లిన తర్వాత.. కేంద్రమంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకసారి కాదన్న విషయాన్ని పట్టుబట్టి సాధించడంలో సఫలం అయితే.. చంద్రబాబు సర్కారును అభినందించవచ్చు.

7 Replies to “ఆ అనుమతి సాధిస్తే అభినందించాల్సిందే!”

  1. అంటే ప్రస్తుతం అనుమతి వచ్చిన దానికి అభినందించనఖర్లేదా?

Comments are closed.