ఏపీ రాజధానిలో మరో రక్తచరిత్ర.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం ఎప్పుడు నిర్మితమవుతుందోగానీ, రాజధాని వస్తుందనుకున్న ప్రాంతంలో సుపారీ హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్నామధ్య విజయవాడ ` ఏలూరు జాతీయ రహదారిపై కాల్పుల ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందడం అప్పట్లో కలకలం…

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం ఎప్పుడు నిర్మితమవుతుందోగానీ, రాజధాని వస్తుందనుకున్న ప్రాంతంలో సుపారీ హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్నామధ్య విజయవాడ ` ఏలూరు జాతీయ రహదారిపై కాల్పుల ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందడం అప్పట్లో కలకలం సృష్టించింది. ముంబై నుంచి కిల్లర్స్‌ని రప్పించి మరీ, ముగ్గుర్ని చంపించేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై అనుఆమానలు తలెత్తేలా చేసింది.

తాజాగా మరో ఘటన అలాంటిదే చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా నందిగామలో ఈ ఘటన జరిగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత శ్రీశైలవాసుని దుండగులు కాల్చి చంపారు. ఓ ట్రాక్టర్‌ షోరూంని మృతుడు నిర్వహిస్తుండగా, అందులో భాగస్వాముతో ఆర్థిక లావాదేవీల వివాదాలున్నాయనీ, ఆ కారణంగానే శ్రీశైల వాసు హత్య జరిగిందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, ఇతరత్రా కారణాలు హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. శ్రీశైలవాసుని హత్య చేసింది ఆయన బంధువులేననీ, హైద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోన్న హనుమంతరావు అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడ్డాడనీ పోలీసులు అనుమానిస్తున్నారు. హనుమంతరావు స్వయానా శ్రీశైల వాసుకి మేనల్లుడు కావడం గమనార్హం.

కారణాలేవైనా.. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని పరిసరాల్లోనే హత్యోదంతాలు వెలుగు చూస్తుండడం, ఆంధ్రప్రదేశ్‌లోని శాంతి భద్రతల్ని ప్రశ్నార్థకం చేస్తోంది.