భారత క్రీడాభిమానుల చిరకాల స్వప్నం నెరవేరింది. చాలాకాలంగా వినవస్తున్న డిమాండ్ నెరవేరింది. భారత దేశ క్రికెట్ దేవుడిగా కీర్తింపబడుతున్న సచిన్ టెండూల్కర్ కు ‘భారతరత్న’ ప్రకటించారు. యువతరం గుండెల్లో చెదరని స్థానం సంపాదించి, తన చివరి ఇన్నింగ్స్ ఆడి, రిటైరైన సచిన్ కు ఈ అవార్డు ప్రకటిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
దీంతో క్రీడాభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ట్విట్టర్లు, ఫేస్ బుక్ లు పోస్టింగ్ లతో నిండిపోయాయి. తమకే అవార్డు వచ్చినంత ఆనందంగా కుర్రాళ్లు మురిసిపోయారు. కొన్నేళ్ల క్రితం సచిన్ కు గౌరవ రాజ్యసభ సభ్యత్వం లభించింది. త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యంలో సచిన్ పేరు తరచు రాజకీయ వార్తల్లో కూడా చోటు చేసుకుంటోంది. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని, మోడీ ప్రధాని అయితే మంత్రి వర్గంలో చొటు లభిస్తుందని ఇలా రకరకాల వార్తలు వినవచ్చాయి. బహుశా ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కీలకపాత్ర వహించే యుపిఎ సూచన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకుని వుంటారని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కారణాలు ఏవైనా కావచ్చు..సచిన్ మాత్రం ఓ లెజండ్రీ. ఈ దేశపు యువతలో క్రికెట్ పట్ల అభిమానాన్ని హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లినవాడు. ధోనీలు, విరాట్ కోహ్లిలు..ఇలా ఎందరో కోత్త తరం ఆటగాళ్లు పుట్టుకురావడానికి పరోక్షంగా కారణమైన వాడు. సెంచరీలు, ఇన్నింగ్స్, పరుగులు, ఇవన్నీ ఒక ఎత్తు, భారత క్రికెట్ పై సచిన్ ప్రభావం మరో ఎత్తు. భారతరత్న సచిన్ కు అభినందనలు తెలుపుదాం..ఆ ఆనందంలో మనమూ పాలు పంచుకుందాం.