‘కంట్రోల్‌’ తప్పితే కోట్లు గల్లంతే!!

తెలుగు సినిమా పరిధి పెరిగిందని.. ఇప్పుడో సినిమా పెద్ద హిట్టయితే అరవై, డెబ్బయ్‌ కోట్లు అవలీలగా దాటేయవచ్చునని సంబరపడిపోతున్నారు సరే.. కానీ సినిమా ఫెయిలైతే అప్పుడు జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో కూడా…

తెలుగు సినిమా పరిధి పెరిగిందని.. ఇప్పుడో సినిమా పెద్ద హిట్టయితే అరవై, డెబ్బయ్‌ కోట్లు అవలీలగా దాటేయవచ్చునని సంబరపడిపోతున్నారు సరే.. కానీ సినిమా ఫెయిలైతే అప్పుడు జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో కూడా లెక్క చూసుకోవాలిగా! పెరిగిన టికెట్‌ ధరల వల్ల ఎంత లాభముందో… అంతే నష్టం కూడా ఉంది. మన పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికీ మన సినిమా టికెట్‌ ధరలు ‘రీజనబుల్‌’ అయినా కానీ కొద్ది నెలల క్రితమే టికెట్‌ రేట్స్‌ని అమాంతం ముప్పయ్‌ శాతం పెంచేసారు. దీంతో ఒక్కసారిగా మన మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌కి సినిమా లగ్జరీ వ్యవహారం అయిపోయింది. నలుగురు ఉన్న కుటుంబం సినిమాకి వెళ్లాలంటే… సింగిల్‌ స్క్రీన్‌లో అయితే ఖర్చు అయిదొందలు పైమాటే. అదే మల్టీప్లెక్స్‌ల్లో అయితే… తినుబండారాలకి బాదే బాదుడు వల్ల నలుగురికి యావరేజ్‌గా వెయ్యి నోటు ఆంఫట్‌ అయినట్టే! 

సినిమా కాస్ట్‌లీ వ్యవహారం అయింది కదా అని ప్రేక్షకుడు సినిమా చూడ్డం మానేయడు. కాకపోతే మరీ సెలక్టివ్‌ అయిపోతాడు. అంటే సినిమా టాక్‌ బాలేదనుకోండి… టీవీలో వచ్చినప్పుడు చూద్దామనో, రెండు నెలలాగితే డివిడి వస్తే అద్దెకు తెచ్చుకుందామనో అనుకుంటాడు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నవారికి అయితే సవాలక్ష ఫైల్‌ షేరింగ్‌ సైట్స్‌ ఉండడం వల్ల అసలు అదనపు ఖర్చే లేకుండా సినిమా చూసేసుకోవచ్చు. ప్రేక్షకుడు అంత తేలిగ్గా థియేటర్‌కి కదిలి రానపుడు తనని రప్పించడానికి తగిన విధంగా సినిమాలుండాలి. చాలా సినిమాల్ని కామెడీతో నింపేయడానికి కూడా కారణమిదే. ఈ సినిమాకెళితే రెండు గంటలు హాయిగా నవ్వుకోవచ్చుననే నమ్మకం కలిగితే జేబులోంచి అయిదొందల నోటో, వెయ్యి నోటో తీస్తున్నారు తప్ప సినిమా బోరు కొడుతోందట, తలనొప్పి అంట అని టాక్‌ వచ్చిందంటే.. ఇంత డబ్బు పోసి తలపోటు కనుక్కోవాలా అని ఎలాంటి సినిమానైనా తిప్పి కొట్టేస్తున్నారు. సినిమాలో మహేష్‌బాబు ఉండనీ… పవన్‌కళ్యాణ్‌ కానీ… ఎన్టీఆర్‌ అవనీ… ఎవరైనా సరే సినిమా బాగుంది అంటేనే కలెక్షన్స్‌ ఇప్పుడు. లేదంటే ఇన్ని వందల థియేటర్లలో విడుదల చేయడం వల్ల రెండో రోజుకే ఈగలు, దోమలు!!

ఈ నేపథ్యంలో నిర్మాతలు, దర్శకులు కథల మీదే కాకుండా సినిమాకి అయ్యే ఖర్చు విషయంలో కూడా  జాగ్రత్త పాటించాలి. బడ్జెట్‌ అదుపులో ఉంచుకున్నట్టయితే సినిమా ఒకవేళ అనుకున్నంత టాక్‌ తెచ్చుకోకపోయినా కానీ కుదేలైపోయే లెవల్లో అయితే నష్టాలు రావు. దీనికోసం ముందుగా హీరోలు, దర్శకులు పారితోషికం విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలి. సినిమాకి వర్క్‌ చేసినందుకు తమ పారితోషికం ఇంతా అని డిసైడ్‌ చేసి, ఒకవేళ ఆ చిత్రం విజయవంతమైతే లాభంలో ఇంత శాతం కావాలని ముందే ఒప్పందం చేసుకున్నట్టయితే నిర్మాతలపై భారం తగ్గుతుంది. ఒక హీరోకి పన్నెండు నుంచి పదిహేను కోట్లు, ఒక దర్శకుడికి ఎనిమిది నుంచి పది కోట్లు పారితోషికం ఇచ్చేస్తే ఇక సినిమా నిర్మాణానికి, ఇతరత్రా వ్యవహారాలకి ఎంత ఖర్చవుతుంది? ఈమధ్య కాలంలో వచ్చిన భారీ పరాజయాల్ని చూస్తే… ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం ఫుల్‌ రన్‌లో కష్టమ్మీద ముప్పయ్‌ కోట్ల షేర్‌ రాబట్టింది. అలాగే సంక్రాంతికి విడుదలైన ‘1 నేనొక్కడినే’ కూడా ముప్పయ్‌ కోట్ల మార్కు చేరుకోవడానికి అవస్థలు పడుతోంది. 

‘1’ సినిమాని ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో అందించాలనే ప్రయత్నం జరిగింది. వారి ప్రయత్నం మంచిదే కానీ మన తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచికి ఏమాత్రం సరిపడని సినిమా తీస్తున్నప్పుడు ‘ఎంతలో తీస్తే సేఫ్‌గా ఉంటాం’ అనేది కూడా ముందే ఆలోచించుకుని ఉండాలి. అల్టిమేట్‌గా సినిమా బాగుందా లేదా అన్నదే ప్రేక్షకులకి కావాలి కానీ ఎంత ఖర్చు పెట్టి తీసారు, ఎన్నేళ్లు కష్టపడ్డారు అనేది వారికి బొత్తిగా అనవసరం. ప్రేక్షకుడికి ఎప్పుడూ టికెట్‌పై తను ఖర్చు పెట్టిన ఆ డబ్బే ఎక్కువ. దానికి సరిపడా వినోదం అందిందా లేదా అన్నదే కావాలి కానీ సినిమాలో నిర్మాణ విలువలు ఉన్నాయా… లేదా చీప్‌గా చుట్టేసారా అన్నది కూడా లెక్కుండదు. 1 లాంటి విలక్షణ చిత్రాన్ని నలభై కోట్ల లోపు బడ్జెట్‌తో తీసి ఉన్నట్టయితే ఇప్పుడు ఇన్ని కోట్ల నష్టం చూడాల్సి వచ్చేది కాదు. అంత ఖర్చు పెట్టిన ఈ చిత్రాన్ని మొదటి వారంలోనే చూడ్డానికి జనం రాలేదంటే, పండుగ వేళ కూడా మరో సినిమాని వెతుక్కుని వెళ్లారు కానీ… మహేష్‌లాంటి పెద్ద స్టార్‌ ఉన్నా దీనిని పట్టించుకోలేదంటే కారణం ఏమిటి? ‘ఈ సినిమాకి వెళితే నేను ఖర్చు చేసే డబ్బుకి సరిపడా వినోదం దక్కదు’ అనే అభిప్రాయం ప్రేక్షకులకి ఏర్పడిపోవడమే. 

దసరాకి విడుదలైన ‘రామయ్యా వస్తావయ్యా’ కూడా ఇలాంటి ఫలితాన్నే చవిచూసింది. ఆ చిత్రానికి కూడా ఖర్చు ఘనంగానే పెట్టారు. దాని వల్ల నిర్మాత కొంత నష్టపోగా, బయ్యర్లు తీవ్రంగా దెబ్బతిన్నారు. అప్పుడు కూడా మంచి టాక్‌ ఉన్న అత్తారింటికి దారేది చిత్రం చూడ్డానికే జనం మొగ్గు చూపించారు కానీ ఎన్టీఆర్‌లాంటి పాపులర్‌ స్టార్‌ ఉన్నాడు కదా… ఓసారి చూద్దామని అనుకోలేదు. భాయ్‌, మసాలా చిత్రాలు కూడా బ్యాడ్‌ టాక్‌ తెచ్చుకుని బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడిపోయాయి. గతంలో మాదిరిగా సినిమాలు స్లోగా పికప్‌ కావడం, వారం రోజుల తర్వాత పుంజుకోవడం అనేది ఇప్పుడు లేదు. సినిమా భవిష్యత్తు ఏమిటనేది మొదటి రోజు మార్నింగ్‌ షో అయ్యేసరికే తేలిపోతోంది. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఒక సినిమా టాక్‌ ఇంటింటికీ మధ్యాహ్నానికల్లా చేరిపోతోంది. సినిమా బాగుందంటే ముక్కు, ముఖం తెలియని నటీనటులు ఉన్నా కానీ ఉయ్యాలా జంపాలా, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లాంటి చిన్న సినిమాలు చూసేందుకు సిద్ధ పడుతున్నారు. అదే బాలేదంటే ఎంతటి స్టార్‌ ఉన్నా కానీ నిర్మొహమాటంగా తిప్పి కొడుతున్నారు. 

హిట్‌ అయిన పెద్ద సినిమాలతో యాభై కోట్లు కొల్లగొట్టడం ఎంత సాధారణం అయిపోయిందో… ఫ్లాప్‌ అయిన వాటితో ముప్పయ్‌ కోట్ల గుమ్మం దాటడం అంతకంటే కష్టంగా మారింది. సినిమా ఫలితం ఏమిటనేది మొదటి షో పడి, పబ్లిక్‌ టాక్‌ తెలిసే వరకు తెలియదు. అలాంటప్పుడు నిర్మాణ సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తర్వాత కోట్లు పోగొట్టుకుని తలలు పట్టుకు కూర్చోవాల్సిన పనుండదు. ప్రాఫిట్‌ షేరింగ్‌ పద్ధతిని నిర్మాతలు, హీరోలు ఎంకరేజ్‌ చేసినట్టయితే పెద్ద హీరోలతో కూడా ప్రయోగాత్మక చిత్రాలు తీయవచ్చు. ప్రయోగం తీసినా, వినోదాత్మక చిత్రం తీసినా కానీ అదే ఖర్చు, అదే రేటు అంటే… అదసలు ఎలా వర్కవుట్‌ అవుతుంది? సినిమా ష్యూర్‌షాట్‌ సక్సెస్‌ అవుతుందని నమ్మకం ఉన్నా కానీ ఖర్చుని ముందే అదుపు చేసుకున్నట్టయితే వచ్చే లాభాలు కూడా పెరుగుతాయి. ఎప్పుడూ అదే కామెడీ చేస్తూ, ఒకే రకం మూస సినిమాలు చేయాల్సి వస్తోందని బాధ పడే కంటే సినిమాకి తగ్గట్టుగా బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకుని, అందుకు అనుగుణంగా తమ పారితోషికాన్ని కూడా అడ్జస్ట్‌ చేసుకుంటే ఇటు సక్సెస్‌ రేట్‌ పెరగడంతో పాటు అటు తెలుగు సినిమాల తీరు కూడా మారుతుంది. కొత్తదనానికి స్కోప్‌ పెరుగుతుంది. సినిమా జోనర్‌కి అనుగుణంగా, బిజినెస్‌ కూడా ప్లాన్‌ చేసుకున్నట్టయితే బయ్యర్ల నుంచి కూడా సపోర్ట్‌ బాగుంటుంది. ప్లానింగ్‌ దగ్గర పర్‌ఫెక్ట్‌గా ఉంటే రిజల్ట్‌ కూడా చేయి దాటిపోకుండా ఎప్పుడూ మన కంట్రోల్‌లో ఉంటుంది. అన్నిటికీ అదే పద్ధతి ఫాలో అవుతామంటే హిట్టొచ్చినప్పుడు సంబరం… ఫ్లాపొచ్చినప్పుడు వైరాగ్యం తాండవిస్తుంది.

– గణేష్‌ రావూరి

[email protected]

http://twitter.com/ganeshravuri