మితిమీరిన టెక్నాలజీ వరమా? శాపమా?

రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ మనుషులను నిర్వీర్యులను చేస్తున్నదేమో అనిపిస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మనుషుల జీవనశైలి కూడా వేగంగా మారుతోంది

రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ మనుషులను నిర్వీర్యులను చేస్తున్నదేమో అనిపిస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మనుషుల జీవనశైలి కూడా వేగంగా మారుతోంది. సాంకేతికత మనుషుల జీవితాలను సులభతరం చేసింది. కానీ సులభతరం చేయడం అనేది మితిమీరింది.

జీవితాల్లో మితిమీరిన యాంత్రీకరణ మనుషులకు కొత్తకొత్త రోగాలను తెచ్చిపెడుతోంది. ఇప్పుడొచ్చే వ్యాధుల్లో అత్యధికం జీవనశైలికి సంబంధించిన వ్యాధులే. టెక్నాలజీ మనుషుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో, ఎంతటి అనర్ధాలు సృష్టిస్తుందో తెలియచేస్తూ చార్లీ చాప్లిన్ ఒక సినిమా తీశాడు కదా. అందులో ఒక యంత్రం చాప్లిన్ నోట్లో భోజనం కూరుతూ ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గందరగోళపరుస్తుంది.

టెక్నాలజీలో వచ్చే మార్పులను ఆయన ఏనాడో ఊహించాడు. ఆయన ఊహించింది భవిష్యత్తులో జరగొచ్చు కూడా. సెల్ ఫోన్ అంటే మొబైల్ ఫోన్ మనుషుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చింది. ఒక్క సెల్ ఫోన్ చేతుల్లో ఉంటే చాలు కంప్యూటర్, కాలిక్యులేటర్, రేడియో, సినిమాలు .. ఒకటేమిటి సమస్త ప్రపంచం మన చేతుల్లో ఉన్నట్లే.

సెల్ ఫోన్లు మనుషులను బానిసలుగా చేసుకున్నాయి. అన్నం, నీళ్లు మానేసి ఉండొచ్చుగానీ సెల్ ఫోన్ లేకుంటే జీవితమే నిరర్ధకం అన్నట్లుగా తయారైంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ఒకప్పటి వస్తువులన్నీ కనుమరుగైపోయాయి. ఉత్తరాలు మాయమయ్యాయి. టెలిగ్రామ్ మాయమైంది. టేప్ రికార్డర్ మాయమైంది. క్యాసెట్లు మాయమయ్యాయి. డీవీడీలు కాలగర్భంలో కలిశాయి. రేడియో కనుమరుగైంది. ఇలా చెప్పుకుంటూపొతే చాలా ఉంది.

టెక్నాలజీ వల్ల కొన్ని వృత్తులు నాశనమయ్యాయి. యాంత్రీకరణ పెరిగేకొద్దీ మనుషులకు జబ్బులు కూడా పెరిగాయి. ఒకప్పుడు నడక అనేది మనుషులకు చాలా సహజమైన ప్రక్రియ. పూర్వకాలంలో ఎంత దూరమైనా నడిచి వెళ్లేవారు. కానీ ఇప్పుడు నడకను డాక్టర్లు మెడిసిన్ గా చెబుతున్నారు. రోజూ కాసేపు నడవాలని సలహా ఇస్తున్నారు. వంట గదిని సైతం అనేక యంత్రాలు ఆక్రమించాయి.

మనిషి పనిచేయడం చాలా తగ్గిపోయింది. కదలికలు లేకపోవడంతో అనేక రోగాలు ముసురుకుంటున్నాయి. చివరకు సొంతంగా స్నానం కూడా చేయకుండా ఒక యంత్రాన్ని కనిపెట్టారు జపాన్ వాళ్ళు. గది మాదిరిగా ఉండే ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ లోకి వెళితే అది పావు గంటలో స్నానం చేయించి, ఒళ్ళు ఆరబెట్టి బయటకు పంపిస్తుంది. ఒళ్ళు రుద్దుకునే అవకాశం కూడా ఉండదు. అంటే స్నానం చేసేటప్పుడు చేతులకు పని ఉండదన్న మాట. మితిమీరిన టెక్నాలజీ మనిషి వరమో, శాపమో అర్థం కావడంలేదు.

5 Replies to “మితిమీరిన టెక్నాలజీ వరమా? శాపమా?”

Comments are closed.