విన‌డం నేర్చుకో

బాగా బ‌త‌క‌డం అంటే క‌ల‌లు లేకుండా నిద్ర‌పోవ‌డం. క‌ల కావాల‌ని అనుకుంటే పీడ‌క‌ల‌కి కూడా సిద్ధంగా వుండాలి.

నదుల‌న్నీ స్వ‌చ్ఛంగా పుడ‌తాయి. త‌రువాత చెత్త‌ని మోస్తూ ప్ర‌వ‌హిస్తాయి. మ‌నుషులు కూడా ఇంతే. శిశువులోని అమాయ‌క‌త్వాన్ని పోగొట్టుకుని , తెలివి పేరుతో కాలుష్య‌పు తెట్టుని మోస్తూ ప్ర‌యాణిస్తాడు. న‌ది స‌ముద్రంలో క‌లుస్తుంది. మ‌నిషిని మృత్యువు క‌లిపేసుకుంటుంది.

కాలం జారిపోతున్న‌పుడు, సూర్యుడు ప‌డ‌మట క‌నిపిస్తాడు. మ‌నం దారి త‌ప్పామ‌ని అర్థ‌మ‌వుతుంది. తెలిసి కూడా త‌ప్పుదారిలో వ‌చ్చామ‌ని తెలుస్తుంది. వెన‌క్కి వెళ్లినా, ముందుకెళ్లినా చీక‌టే.

పులిచేతిలో మేక చ‌స్తుంది. ఇది ప్రాపంచిక జ్ఞానం. మేక‌ల‌న్నీ క‌లిస్తే పులిని చంప‌చ్చు. దీన్ని ఎక్క‌డా చెప్ప‌రు. జ్ఞాన‌మెపుడూ పులివైపే వుంటుంది. మేక‌ల కోసం ఎవ‌రూ ఏదీ క‌నిపెట్ట‌రు.

రెక్క‌ల క‌ష్టం మీద పావురం ఎగురుతున్న‌పుడు , ఒక బాణం త‌న వైపు చూస్తూ వుంద‌ని దానికి తెలియ‌దు. నువ్వు హాని చేయ‌నంత మాత్రానా నీకెవ‌రూ హాని చేయ‌ర‌నుకోవ‌డం అమాయ‌క‌త్వం.

గొర్రెల‌కి నాయ‌కుడిగా వుండ‌డం కంటే, సింహానికి బానిస‌గా బ‌త‌క‌డ‌మే గౌర‌వం. య‌జ‌మాని మెడ నిమురుతున్న‌పుడు, అత‌ని గుప్పిట్లో వున్న చుర‌క‌త్తిని గ‌మ‌నించు.

మోసం చేయ‌డ‌మే బ‌త‌క‌నేర్చినత‌నంగా చెలామ‌ణి అవుతున్న‌పుడు నీతి గ్రంథాల్ని చెద‌లు తిన‌డమే స‌ముచితం.

అల‌ల మీద ప‌డ‌వ‌ని ఊయ‌ల ఊగిస్తున్న‌పుడు స‌ముద్రం ఒక అమ్మ‌. అమ్మ‌కి కోపం వ‌స్తే అమ్మోరు. అదే తుపాను.

ప‌సిర‌క పాములు ప‌చ్చ‌టి తీగ‌లుగా క‌నిపించే కాలం. విషం ఇప్పుడు కోర‌ల్లో లేదు. పెద‌వుల్లో వుంది. నిజ‌మే అబ‌ద్ధం, అబ‌ద్ధ‌మే నిజం.

ఈ భూమి ఒక గృహ‌స్తు, నువ్వొక అతిథివి, కొంత‌కాలం వుండి వెళ్లు, కొత్త‌వాళ్లు వ‌స్తారు. మొండికేస్తే నిన్ను మెడ‌ప‌ట్టి గెంటుతారు. నీకిచ్చిన క్యారెక్ట‌ర్‌లోనే ఉండు. బ‌య‌టికి రాకు. నాట‌కం ఒప్పుకోదు.

స‌త్యానికి వ్యాక‌ర‌ణం, అలంకారం, ఛంద‌స్సు అక్క‌ర్లేదు. నువ్వు వ‌స్తావు, వెళ్లిపోతావు. వాస్త‌వం స‌ర‌ళంగా వుంటుంది. భ్ర‌మ చిక్కుముడుల‌తో పెన‌వేసుకుంటుంది.

యుద్ధం స‌రిహ‌ద్దులు దాటి ఇళ్ల‌లోకి, ఆఫీసుల్లోకి వ‌చ్చేసింది. ర‌క్తం క‌న‌ప‌డ‌దు. గాయం క‌న‌ప‌డ‌దు. నొప్పి మాత్రం తెలుస్తూ వుంటుంది.

ప్ర‌యాణీకుల కోసం ప‌డ‌వ‌, ప‌డ‌వ కోసం ప్ర‌యాణీకులు ఎక్క‌డో ఒక చోట ఎదురు చూస్తూనే వుంటారు. ఒక‌రికోసం ఒక‌రు. జ‌నం దిగిపోతారు. ప‌డ‌వ వుండిపోతుంది. ప‌చ్చ‌టి చెట్టుగా ఉన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాల్లో త‌డుస్తూ, త‌డుముతూ.

నువ్వెవ‌రో ఎప్ప‌టికీ తెలుసుకోలేవు. ఎందుకంటే నువ్వు ఒకరు కాదు, అనేకం. నీ ఆట‌లో నువ్వే నాయ‌కుడు, ప్ర‌తినాయ‌కుడు కూడా.

చెప్పేవాడే త‌ప్ప వినేవాడు లేడు. దేవుడు ద‌గ్గ‌ర కూడా చెప్ప‌డ‌మే త‌ప్ప‌, విన‌డం వుండ‌దు. దేవుడు చాలా విష‌యాలు చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. కానీ మ‌నం వినం. వ‌న్ వే.

విన‌డం నేర్చుకో. ఏదైనా నేర్చుకుంటావ్‌. బంగారాన్ని జాగ్ర‌త్త‌గా చూడు. దాని వెనుక శ‌తాబ్దాల ర‌క్త చారిక‌లుంటాయి. అవి నీ పూర్వీకుల‌వి కూడా కావ‌చ్చు.

బాగా బ‌త‌క‌డం అంటే క‌ల‌లు లేకుండా నిద్ర‌పోవ‌డం. క‌ల కావాల‌ని అనుకుంటే పీడ‌క‌ల‌కి కూడా సిద్ధంగా వుండాలి.

తీయ‌టి క‌ల వ‌స్తే సుగ‌ర్ చెక్ చేసుకో.

జీఆర్ మ‌హ‌ర్షి

12 Replies to “విన‌డం నేర్చుకో”

  1. చాలా రోజుల తర్వాత ఓ మంచి ఆర్టికల్ చదివాను.. మనం హాని చెయ్యను మాత్రాన మనకెవడూ హానిచెయ్యడనుకోవటం భ్రమ. చెప్పె వాడే కానీ వినేవాడు లేడు. ఇది నిజం

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః ఓం‌నమశ్శివాయ‌‌‌ శ్రీ సీతారామ చంద్ర పరబ్రహ్మణే నమః

Comments are closed.