జీవితం ఒక వల. నువ్వే విసిరి, నువ్వే చిక్కుకుంటావు. పాదాల ముందర సముద్రం మోకరిల్లితే అది వినయం. లొంగుబాటు కాదు. గర్జిస్తే సునామి. అదే అసలు ముఖం.
నీతో వచ్చిన వాళ్లెవరూ వుండరు. ఉండాలనుకున్నా నువ్వు వుండలేవ్. జాతర కలకాలం వుండదు. ఒకరోజు సంబరం మాత్రమే. ఎన్నడూ చూడని ఎక్కడికి వెళుతుందో తెలియని రహదారిలో ప్రయాణించు. జీవితం కొత్త పుస్తకంలా వుంటుంది.
కీచురాయికి రాత్రి మాత్రమే తెలుసు. పగలు భరించలేదు. కనురెప్పల పరదాలు ఎత్తిన ప్రతిసారీ కొత్త నాటకం. హారర్ సినిమా ఎక్కడో వుండదు. అద్దంలో మనల్ని చూసుకోడమే.
ఒంటరితనం ఒక భ్రాంతి. నిన్ను అనేక కళ్లు చూస్తూనే వుంటాయి. ఒక సీతాకోక చిలుక నీ భుజాల మీద ఎగురుతుంది. లేదా పొదల్లోంచి ఒక పులి ఎదురు చూస్తూ వుంటుంది.
కొత్త సంవత్సరం ఏదో ఇస్తుందని ఆశ పడకు. ఏమీ తీసుకుపోకుండా వుంటే చాలు. సాగరానికి విశ్వాసంగా వుండు. అది ఇచ్చే ఉప్పు తినే చచ్చే వరకూ బతుకుతావు.
సాహిత్యం తగ్గి పీఠాధిపతులు పెరిగారు. రాసేవాళ్ల కంటే మోసేవాళ్లు ఎక్కువయ్యారు. ఎక్కడ చూసినా చిడతల భజన. డోలు విద్వాంసుల తొక్కిసలాట.
అబద్ధాల్ని ఆశ్రయించి, సత్యాన్ని అన్వేషించడం ఆధునిక కళ. మొత్తం మేకప్. కడుక్కుంటే ఎవన్ని వాడే గుర్తు పట్టలేడు. ఒకన్ని నలుగురు సూపర్‌వైజ్ చేస్తే హెచ్ఆర్ స్కిల్స్. నలుగురి పనిని ఒకనితో చేయిస్తే ప్రాజెక్ట్ వర్క్. ఎలక్ట్రిషియన్ పనిని ప్లంబర్‌తో లాగిస్తే అది మేనేజ్‌మెంట్ టెక్నిక్.
పూర్తిగా తెలుసుకుంటే అజ్ఞానం. సగం తెలిస్తే జ్ఞానం. ఏమీ తెలియకపోతే సంపూర్ణ జ్ఞానం.
అందరూ బ్రెయిలీ ప్రాక్టీస్‌లో మునిగి ఉన్నారు. ఏదైనా తడిమి మాట్లాడ్డమే. గత ఏడు జన్మలుగా కత్తిని చూడని వాడిని కూడా ఖడ్గవీరుడని పొగడ్డమే. శత్రువుని అంతం చేయడానికి తంత్రం అక్కర్లేదు. తాళం వేసి తందానా అంటే చాలు. ఖర్చు లేకుండా కరిగిపోతాడు.
జింక సుఖశాంతుల కోసం జింక చర్మంపై ధ్యానం చేయడమే మార్గం. గొర్రెలకి కంబళి దానం చేసి ఫేస్‌బుక్‌లో పెడితే లక్ష గొర్రెలు లైక్ కొట్టి వెయ్యి గొర్రెలు రక్షకుడని కామెంట్స్ పెడతాయి.
చేతిలో భగవద్గీత పెట్టుకుని తిరిగే వాడికి కూడా శ్రీకృష్ణుడు ఎవరో తెలియని కాలం.
పిచ్చాస్పత్రులని బయట వెతుక్కునే పని లేదు. అవి ఇళ్లలోకి వచ్చి చాలా తరాలైంది. పిచ్చిని ఎన్ని రకాలుగా వర్గీకరించినా నీ పిచ్చిని నువ్వు కనుక్కోలేవు. అది నీ అదృష్టం.
నీ కోసం వేరే ప్రపంచం లేదు. ఇక్కడే వెతుక్కోవాలి. గాజు పెంకుల మధ్య వజ్రం ఉందేమో అని. దొరికినా దొరక్కపోయినా గాయం గ్యారెంటీ.
కోస్తారని తెలిసినా కోడి పుంజు మేల్కొలుపుతుంది. ప్రాపంచిక జ్ఞాని. సోక్రటీస్‌కి మించిన వేదాంతి.
అయిన్‌రాండ్ బతికొస్తే ఆమె కూడా వణికి చచ్చేంత ఆబ్జెక్టివిజం నడుస్తోంది. అట్లాస్ భూమిలోకి కుంగిపోయాడు.
God is dead. నీషే పోయినా వాక్యం బతికే వుంది. గులాబీకి ముళ్లెందుకు కాపలా ఉన్నాయో తెలిస్తే …సృష్టి రహస్యం అర్థమవుతుంది.
జీఆర్ మహర్షి
ఇవన్నీ ఎక్కడ నుండి చదివి రాశారు,
రిఫరెన్స్ లు చెప్పండి.
Delayed this time sir, please post atleast every 2 weeks. Fan of this writings.
Nee Peru nijamga maharshaa… Ekada copy paste chesav
Copy paste kadaa
చినిగిన అడ్డాకుకు కుట్టు ఉండదు తత్ దినం పప్పుకు పోపుండదు.